తెలుగు సాహిత్యం, ఆధునికత్వం, నవ్యత్వం అనే దశల్లో వృద్ధిచెందింది. అది పురాణ ఇతిహాస సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, దేశి సాహిత్యం, ఆధునిక (ప్రగతి) సాహిత్యం అనే రూపాల్లో వెలువడింది. కవిత్వ రీతుల్లో దాన్ని ప్రబంధ కవిత్వం, ఆధునిక కవిత్వం, నవ్య కవిత్వం, నవ్య సంప్రదాయ కవిత్వం, సమకాలిక కవిత్వం అంటున్నాం. ప్రాచీన క్లాసిక్ తత్వంతో కూడిన ఆధునిక రచనను నవ్యసంప్రదాయక కవిత్వం అన్నారు.
ఆధునికంగా భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, నవ్య సంప్రదాయ కవిత్వం, సమకాలిక కవిత్వం బడుగువర్గ కవిత్వం వచ్చాయి. అభ్యుదయ కవిత్వంలో తీవ్ర రూపం దాల్చినది నగ్న కవిత్వం. ఇంకా జాతీయ పునరుజ్జీవన, దేశభక్తి, రాష్ట్ర భక్తి, సంఘ సంస్కరణ ప్రాతిపదికన కొంత కవిత్వం వెలువడింది.
సమకాలం అంటే అస్తిత్వ ఉద్యమాల కాలం. దానిని 1990 నుంచి గణుతించారు. ఆ కాలంలో సరికొత్త సాహిత్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవి అభ్యుదక కవిత్వానికి కాస్త భిన్నంగా ఉన్నాయి. అవి ఏవనగా దళితవాద, స్ర్తివాద, మైనారిటీవాద, ప్రాంతీయవాద కవిత్వాలు. ఇవి అసమానతలను తొలగించడానికి ఏర్పడ్డ వివిధ కవిత్వ ధోరణులు. అవి వాస్తవికతను, నగ్నతను, తీవ్రమైన తిరుగుబాటును వెలిబుచ్చాయి.
ఆయా కవిత్వాలు మానవాళికి కొంత మేలు చేశాయి. ఆనందం కల్గించాయి; వినోదం ఇచ్చాయి. కాని సామాజిక మార్పు కలగలేదు. దానికి నిదర్శనం ఈనాటి సంక్షోభం, అనిశ్చిత, అభద్రతాభావం, ఆందోళన, ధనదాహం, పోటీతత్వం, పరుగులు ఉరుకులు, వల్లమాలిన వినోదాలు. కొంత మానసిక వికాసం కనిపించినా, అది మానసిక ఉల్లాస స్థాయిలో ఆగిపోతోంది.
అందుచేత సంపూర్ణ మానసిక వికాసాన్ని కల్గించే కవిత్వం వెలువడాలి. మనిషిలో, మనసులో మార్పు తీసికొని రావాలి. ఆలోచింపజేయడంతో ఆగిపోకుండా, అనుదిన జీవితంలో ప్రకాశించాలి. వినోదం, ఉల్లాసం, ఆత్మతృప్తిని మించి మెదడు కణాల్లో మార్పును తేవాలి. కవిత్వంలో ప్రేమ- కళ- చైతన్యం- వాదం- విప్లవం అనే బలీయమైన అంశాలను సమన్వయపరిచే శక్తి మార్పు కవిత్వానికి ఉండాలి. గ్రూపు కవిత్వాలు, విభేద కవిత్వాలు గాక పరివర్తనా కవిత్వం వెలువడాలి. రచయిత పరివర్తన చెందాలి, పాఠకుని పరివర్తింపజేయాలి. ఆ ప్రభావం సమాజంమీద పడాలి. అంత శక్తివంతంగా ఉండాలి. ఒక సినిమా పాట ప్రభావం శ్రామికుని వరకు జాలువారినట్లు మార్పు కవిత్వం సమాజాన్ని ప్రభావితం చేయాలి, పరివర్తన కల్గించేదిగా విశుద్ధి చెందాలి.
వస్తు, రూప, ప్రక్రియ నిర్ణయంలో కవికి పూర్తి స్వేచ్ఛ వుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే కవిత కల్గించే ప్రభావం మున్ముందుగా దృగ్గోచరమై ఉండాలి. మార్పు కవిత్వపు స్వభావం రూపురేఖలు ఇప్పుడే నిర్ధారించలేము. దీనికి తాత్విక పునాది అవసరం. సృజనత్వంగల తత్త్వదర్శకుడు కొన్ని కవితలు వెలువరించిన మీదట, స్పందన తెలిసిన మీదట, విమర్శలు సాక్షాత్కరించిన మీదట దాని హృదయం, ఆకృతి నిశ్చయాత్మక స్థితిని చేరుకోగలవు. కాకపోతే మార్పు కవితా గుణ లక్షణాలలో కొన్ని చేర్పుల గూర్చి చర్చించుకోవచ్చు.
కవిత్వానికి ప్రధాన లక్షణాలైన వస్త్భువ రూపాలకు అదనంగా ప్రవర్తనాశీలత అనే అంశాన్ని చేర్చుకోవచ్చు. ఆరాధన, ప్రణయం, ప్రీతి, ప్రియత్వం, స్వేచ్ఛ, స్మృతి, ఆత్మాశ్రయత, మృదు పదభంగిమ, ఆంతరంగిక ఆసక్తి మున్నగునవి హృదయ కుహరంలో సావధానత చెందాలి, వాటి సమ్యక్‌రూప సాంద్రత కవిత్వలో ప్రతిఫలించాలి. మార్క్సిస్టు సాహిత్య విమర్శనాదృష్టి ఆర్థిక సమత్వం, కమ్యూన్ నిర్మాణానికి ముందు చేకూరాలన్నది. ఆ క్రమంలో పరివర్తనాశీలతను జోడించాల్సి వుంది.
అస్తిత్వం సచేతన చైతన్యం కోరుతోంది. సచేతన చైతన్యం సమగ్ర సామాజిక చైతన్యం కావడానికి పరివర్తనా కవిత్వ పుటుషోదయ అరుణ కిరణాలు ప్రసరించాలి. అభ్యుదయ కవిత్వ దర్శనంలో సామాజికాంశం బలంగా ప్రతిబింబించింది. అది మార్పు అంచులను తాకింది. ఆ ప్రతిబింబం వినూత్న కవిత్వంతో రసాయనీకరణ చెంది మెదడు కణాలను మార్చాలి. ‘ప్రాహ్లాద కవిత్వం’ ఆహ్లాదంగా ముందడుగు వేసింది. దానికి పాత గంధపు వాసన లేకుంటే పరివర్తనాశక్తిని సంతరించుకోగలదు. రసాత్మకత, రమణీయార్థ ప్రతిపాదికత కావ్య ప్రధాన లక్షణాలు నేటి పరిస్థితులలో దానికి పరివర్తనాశీలత చేర్చడం అవసరం. అపుడు శబ్దం, రసం, రమణీయత, పరివర్తన కావ్యయుక్త లక్షణాలు కాగలవు. కావ్యం మార్పు తెచ్చేది, ప్రవర్తన చేకూర్చేది, ఆంతరంగిక విప్లవం కలిగించేది, మనస్తత్వం మార్చేది, మహోన్నతమైంది కాగలదు.
మానసిక పరివర్తనవల్ల అహంభావంపాలు తరుగుతుంది. ఉద్రేకాల విజృంభణ తగ్గుతుంది, కుల భావన సన్నగిల్లుతుంది, మతం మత్తు వదులుతుంది, వివేకం ఉదయిస్తుంది.
‘‘కళాసృష్టి పారమార్థిక సత్యంకాదు. ఇది ప్రతిబింబానికి ప్రతిబింబం. కళాసృష్టి కూడా ప్రయోజనకారి. అంటే మానవుని పరమార్థ సిద్ధికి వినియోగపడాలి. అందుకు తప్ప ఇది తనకు తాను పరమార్థంకాదు. కాబట్టి సాహిత్యాదికం పరమార్థ బోధకంగా ఉండాలి కాని తానే పరమార్ధమైనట్లుగా తనయందే సర్వం లీనమై పోయేటట్లు ఉండకూడదు. అంటే ధర్మోపదేశం కావాలి’’ ‘జేగంటలు’ లో జి.వి.కృష్ణారావు పలుకులివి. కళ ధర్మాచరణకు, శీల నిర్మాణానికి ప్రేరణనివ్వాలి.
అనుకరణం, ధర్మ ప్రతిపాదన, రామణీయకత ప్లాటో సాహిత్య విమర్శలో ప్రముఖాంశాలు. సహృదయునికంటే రమణీయకతత్వ విచారపరుడు ఉత్తమోత్తముడు.
ఇలా పరివర్తనా కవిత్వపు అత్యవసరత ద్యోతకమవుతోంది.
‘‘ఇతర మార్గాలన్నింటినీ తిరస్కరించినపుడే నీ సొంత మార్గాన్ని కనుక్కోగలవు.’’
‘‘చచ్చిన గతంతో ఉన్నంతకాలం భవిష్యత్తు లేదు.’’
‘‘నిజమైన గురువు ఎవరైనా ఉంటే అతడు మిమ్ముల్ని తననుండి విముక్తుల్ని చేస్తాడు.’’
‘‘వెళ్లిపోయాక తనవెనుక గంపెడు గందరగోళం వదిలినవాడే ప్రవక్త’’ అని ‘యుజి’ చెప్పగా రాజశేఖర్ రాశాడు.
ఇవి భాగాలుగా, చమత్కారయుక్తంగా ఉన్నా ఆంతరంగిక మార్పును సూచిస్తున్నాయి.
మనసు మిథ్య, మనసు ప్రమాదకారి, మనసు నిర్మాణాత్మకమైంది, మనసు గతానుభవయుతం అనే పార్శ్వభాగాలు కళాకారుని అవగాహనలో ఉండవలసినవి.
తెలుగు సాహిత్యం, ఆధునికత్వం, నవ్యత్వం అనే
english title:
powerful poetry
Date:
Monday, February 11, 2013