రంగులెపుడు తొలిసారి పరిచయమయ్యాయో జ్ఞాపకముందా
చిననాటి బొమ్మలమీదనో, మేఘాల మీదనో, అమ్మ చీరల మీదనో, పూల మీదనో
రంగులెలా తొలిసారి ఆశ్చర్యపరిచాయో నిద్రాణంగానైనా కలలు మిగిలాయా
పసుపూ, ఎరుపూ, నీలం, వాటితో తెలుపూ, నలుపుల వేల ఆటలు
ఒక్కో పేరుతో అలవాటుపడిపోవటానికి ముందు
ఏ రహస్యలోకాల సందడి చేసాయో కాస్తయినా సజీవంగా వినిపిస్తున్నాయా
అపుడపుడూ విస్మయపరుస్తూనే ఉన్నాయి రంగులు నన్ను
వ్యాకులతలూ, తడబాట్లూ, భయాలూ చీకటిలోకి విసిరినప్పుడు
బాల్య స్నేహితుల్లా సేదదీరుస్తూనే ఉన్నాయి
సఖుడా, ఆగిపోవటం మృత్యువు, ప్రవాహమే జీవితమని వెన్నుతడుతూనే ఉన్నాయి
దైవానికి దయలేదనీ, ఆయనకు మాటలు రావనీ ఎవరైనా అన్నపుడల్లా?
వెలుతురు ఆయన దయ అనీ, రంగులు ప్రేమభాషణ అనీ చెప్పాలనిపిస్తూనే వుంది
మనకు రంగులు వెలిసిపోవటం ఎపుడు మొదలయిందో వెనుదిరిగి చూసావా
చిననాటి పుస్తకాలతోపాటు
వాటిలో దాచుకొన్న నెమలీకనీ జీవితంలోంచి విసిరేసిన క్షణాలలో
మనలోంచి మాయమైన అమాయకత్వాన్ని ఎపుడైనా తడుముకొన్నావా
తెల్లనికాంతీ, కాంతిలోంచి కాంతిలోకి ఎగిరే రంగుల పక్షులూ ఎటు వెళ్ళిపోయాయో,
ధూళిమేఘాల చాటున జీవితమెలా వెలిసిపోయిందో ఎపుడైనా బాల్యాన్నడిగి తెలుసుకొన్నావా.