స్పందన
========
సాహితి శీర్షిక క్రింద ప్రచురించిన ‘‘్భషజపు చక్రబంధంలో రచయితలు’’ (ది.28.1.13) అనే రచనకు స్పందన. భేషజం అంటే మందు. భిషక్ అంటే వైద్యుడు. ఈ రెండు సంస్కృత పదాలు తెలుగులో భేషజం అనే మాటను గర్వం, అహంకారం, డాబుదర్పానికి వాడతారు. దీనికి కారణం ఏమిటో తెలియదు. దీనిని మత్తు మందు అని రచయిత కూడా అంగీకరించారు. ఇలాటి మత్తు మందుకి ఎవరు బానిసలో రజాహుస్సేన్‌గారు సోదాహరణంగా వివరించారు. ముందుగా ఈయన బాణం వీరేశలింగంగారిపై ఎక్కుపెట్టబడింది. వీరేశలింగంగారు సంఘ సంస్కరణకి తానే ఆద్యుడనని తన వంటివారు గతంలో ఎవరూ లేరని ఎక్కడా చెప్పలేదు. స్వామినేని ముద్ద నరసింహంగారు రచించిన ‘‘హిత సూచని’’ అనే గ్రంథం హుస్సేన్‌గారు చదివితే ఆ గ్రంథం నుండి ఏయే విషయాలు వీరేశలింగంగారు అనుకరించారో చెప్పవద్దా? కేవలం ‘‘అనేక సామాజికాభ్యుదయ కార్యక్రమాల్ని ప్రణాళికా బద్ధంగా పేర్కొన్నారు. అంతేకాదు సమాజంలోని మూఢ విశ్వాసాలను మంత్ర విద్యలను ఖండించారు’’ అంటే చాలదు. వీరేశలింగంగారు వితంతు వివాహాలు జరిపించడానికి బ్రహ్మసమాజ మతాన్ని అభిమానించడానికి హితసూచని ఆధారమా? ‘’‘వీరేశలింగం అప్పటికే హితసూచనిని క్షుణ్ణంగా చదివి ఉన్నారు’’ అని అన్నారు. ఈ విషయం ఎలా చెప్పగలిగారు? హిత సూచని అను పేరులో వీరేశలింగంగారు హిత దొంగిలించి తన సంస్థకు హితకారిణి అని పేరు పెట్టారు కాబోలు. వితంతు వివాహాలు పూర్వమే ఉన్నాయని తాను కొత్తగా జరిపించడం లేదని అందుకు ప్రమాణాలు కూడా పంతులుగారు చూపించారు. ఒకవేళ ఆయన హిత సూచనిలోని విషయాలు అమలుచేసినా అది భేషజం క్రింద రాదు. నేటి మాటలలో చెప్పాలంటే కాపీ చేశారని చెప్పాలి. తరువాత శేషేంద్రశర్మ ప్రస్తావన చేశారు. శేషేంద్ర సంప్రదాయ మరియు ఆధునిక కవితతు వారధి వంటివాడు. ఆయనకు వేదాలు తెలుసు. ఉపనిషత్తులు తెలుసు. రామాయణ భారత భాగవత గ్రంథాలు తెలుసు. పూర్వ కవుల ప్రతిభ ఎరిగినవాడు. సంప్రదాయ కవితలోను ఆధునిక కవితలోను సిద్ధహస్తుడు. రచయితలకి పూర్వ సాహిత్యంపై మంచి అవగాహన ఉండాలి. ఈ లక్షణాలు లేని రచయితల అభిప్రాయాలతో శేషేంద్ర వంటివారు ఎలా ఏకీభవిస్తారు? ఇది భేషజం కాదు, ఉన్నమాట. వడ్డెర చండీదాస్ నవల, సంగీతం గురించి ప్రస్తావించారు. చాలమంది సంగీత విద్వాంసుల కంటే చండీదాస్ ఘనుడని హుస్సేన్‌గారు అంగీకరించారు. చండీదాసు ఏ విధంగా తనను పొగడుకొన్నది చెప్పలేదు. ఇక్కడ కేవలం అనుసరించిన మార్గం అన్నారు కానీ, అది అర్థం కావడం లేదు. మరీచిక నవల విషయంలోను, శివారెడ్డిగారి విషయంలోను రాసిన విషయాలు భేషజాలే. శివారెడ్డిగారు అరవైలో ఇరవైఏళ్ల వాణ్ణిలా ఉన్నాను అని చెప్పడం భేషజమే. ఎనభై ఏళ్లవారు ఎవరైనా అలా చెబితే హర్షిస్తారు. అరవై ఏళ్లవయసు అంటే ఈ రోజులలో వృద్ధాప్యం కాదు. ఈ రచనలో మరొక ముఖ్య విషయం పరిశీలించాలి. సినిమాలు మనకి ప్రమాణం కాదు. సినిమా ఎలా తీస్తే ధనం వస్తుందో ఆలోచించి అలా తీస్తారు. దానవీరశూరకర్ణ సినిమా మహాభారతాన్ని మార్చివేసిందంటే బాగుండదని మహాభారతాన్ని కొత్తకోణంలో చూపించారు అన్నారు. మహాభారతాన్ని కొత్తకోణంలో చూపించడానికి ఉమర్ ఆలీషాగారికీ హక్కు ఉంది. కొండవీటి వెంకట కవికీ హక్కు ఉంది. మనది ప్రజాస్వామ్యం, సెక్యులర్ రాజ్యం. అనగా హిందూ దేవతలను ఇష్టం వచ్చినట్లు చిత్రీకరించవచ్చు. ఇష్టం వచ్చినట్లు తిట్టవచ్చు. ఇక్కడ ఉమరాలీషా గారి ‘మహాభారత కౌరవ రంగము’ అను గ్రంథంలోని విషయాలు కొండవీటి వారు సంగ్రహించి పేరు తెచ్చుకున్నారని చెప్పాలి. ఇది భేషజం ఎలా అవుతుంది? దీనిని గ్రంథచౌర్యం అందాం. మన పూర్వకవులు తమకవిత్వం ఏ విధంగా ఉంటుందో గ్రంథాదిని వివరించి ఆ విధంగా వ్రాసి చూపారు. ఇందుకు సుమతీ శతకకర్త ఉదాహరణ. ఆధునిక కవులలో తిలక్ కూడా అలా చేశాడు. ఇలాటివి భేషజాలు కావు. ఆయా కవుల ఆత్మవిశ్వాసాలు. చివర ‘‘నాకు అవకాశం లేదు కాని సూరీడులా వెలిగిపోగలను. ఆకాశంలో చంద్రుడిలా వేళ్లాడగలను’’ అన్న భేషజం మన కవులలో కళాకారులలో తక్కువేం కాదు’’ అన్నారు. ఇలాంటి కవులను గాని సంగీత విద్వాంసులను గాని నేను ఎక్కడా చూడలేదు. రజాహుస్సేన్‌గారి దృష్టిలో ఎవరైనా ఉన్నారేమో తెలియదు.
స్పందన
english title:
spandana
Date:
Monday, February 11, 2013