నిబద్ధ కవిత్వాన్ని చదువుతున్నప్పుడు, కొన్ని అంశాలను గమనించవచ్చు. ప్రధానంగా నిబద్ధత అనేది వస్తువు. సిద్ధాంతం అనే రెండు నిర్మాణ పరికరాల మధ్యలోని స్థిరాంశం. పై రెండు అంశాలకు మధ్య స్థిరమైన దార్శనిక పరిధిని ఒకదాన్ని నిబద్ధత ప్రేరేపిస్తుంది. నిబద్ధతని గురించి ఆలోచిస్తున్నప్పుడు - నిబద్ధాంశాలతో వైయక్తికానుకలనంకన్నా సమూహ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. కాని నిబద్ధ సాహిత్యం వైయక్తిక ప్రతిభ వలన ఉదాత్త ప్రతిఫలాలను చూస్తుంది. ఇదే సాహిత్యానికి ఒక ధర్మాన్ని ఆపాదించి నిలబెడుతుంది.
నిబద్ధ దర్శనం వెనక కొన్ని ప్రేరక శక్తులుంటాయి. జీవితంలో ప్రకృతి గతాంశాలు అననుభూతమై పార్శ్వభాగంగా నిలబడ్డప్పుడు పరిపూర్ణత్వాన్ని అపేక్షించి సాధించే దిశలో నిబద్ధత ప్రాథమిక శక్తిని కూర్చుకుంటుంది. కవితా నిర్మాణంలో కళాకారులు ఒక పార్శ్వంలో నిలబడి సందర్భాన్ని అందులోని వాతావరణాన్ని సాధిస్తారు. అయితే సందర్భంలో నిష్పన్నమైనా కాకపోయినా ప్రతి సందర్భంలోనూ రెండు పాత్రలు ఉంటాయి. రెండు అస్తిత్వాలుంటాయి. ఈ పాత్రలు రెండూ సమానధర్మం, గుణం, ప్రతిపత్తి కలిగినవే అయినా అనుభవంలో రసనిష్పత్తి సమాంతరంగా ఉండదు. మూర్తామూర్తాలలో నిబద్ధ సాహిత్యంలోని రెండు వస్తువులు సమానగుణం కలిగినవే అయినా వీటి అనుభవికనిష్పత్తులు వేరు. ఒకటి అనుభూత ద్రవ్యంగా ఉంటే మరొకటి అనుభోక్తగా ఉంటుంది. ఈ సందర్భంలో అనుభూత ద్రవ్యం ఆత్మ చైతన్యానికి లోనైతే నిబద్ధత కనిపిస్తుంది.
నిబద్ధ సాహిత్యం కేవలం సిద్ధాంత వస్తుగతాంశాలకు చెందినదే అయితే పాఠకుడు ఏ కవిత్వం చదివినా అందులోకి వెళ్లిపోవాలి. అందువల్ల నిబద్ధ రచనలోనూ సృజన ధర్మం సృజనశీలుర ప్రతిభ గుర్తించాలి. సమాజగతమైన వర్తన పార్శ్వానికి ఉన్న ప్రాధాన్యతవల్ల సృజన గుర్తింపబడదు. కాని వ్యక్తీకరణలో నిబద్ధ సామగ్రిని చేర్చేది సృజన భాగమే. ఆధునిక తెలుగు కవిత్వంలో నిబద్ధ సాహిత్య రూపాలు ఎక్కువే. ఈ కోవలో ఓల్గాలాంటివారి దార్శనిక, నిబద్ధల గూర్చి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. సుమారు 1972 నుండి రాసినవిగా కనిపించే ఈ కవితల్లోని కవితలు సుమారు 48 ఓల్గా ‘కవితలు కొన్ని’గా అందించారు. ప్రాతిపదికంగా కనిపించే నినాదంకన్నా విధానమే ఎక్కువ. అననుభూత జీవన పరిపూర్ణత్వాన్ని అపేక్షించే దశలోని తిరస్కారం సున్నితంగా ఇందులో కనిపిస్తుంది. భాషాముఖంగా అధివాస్తవంగా కనిపించే కొన్ని ఖండికల్లోనూ ఈ వాస్తవ స్పర్శ, అనే్వషణ ఉన్నాయి. నిబద్ధ రచనం ప్రధానంగా సమూహాత్మ, స్థల కాలాల పూర్ణస్పర్శలేకపోవడం, సమానాశంస, స్వీయోద్దీపన, స్థితిగతాంశతోపాటుగా వామపక్ష ఉద్యమ పార్శ్వంలో రాసిన రెండు కవితలు, కొన్ని అనువాదాలు నిర్మాణగతంగా ఒక మాత్రాబద్ధగేయం ఇందులో ఉన్నాయి.
జీవితం ఒక సార్థకత కలిగిందని దానికి కొన్ని పార్శ్వాలున్నాయని కలలున్నాయని, ఆ కలల సాఫల్యమే జీవన పూర్ణత్వమని ఓల్గా కవిత్వం నమ్ముతుంది. ఈ కలలు వాస్తవంలోని ఆశలే. ఈ ఆశల ప్రతీకాత్మకత ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది. జీవన పూర్ణత్వమంటే కలలు (ఆశలు) సాకారమవటం. ఆ కలలకు ఆకారం నిద్ర. దానికి ఆధారం, సందర్భం రాత్రి. అందువల్ల ఈ కవిత్వంలో ‘రాత్రి’ అనే పదం అనేక నిబద్ధోద్వేగాలకు ప్రతిరూపంగా నిలుస్తుంది. సుమారు పనె్నండు వరకు ‘రాత్రి’ అనే పదం పరిధిలోకి కవితలున్నాయి.
‘రాత్రం’టే నీకు నిద్రావస్థ / నాకు భగ్న స్వప్నం’’- (70)
‘‘నా రాత్రులను వేధించి వెంటాడే ప్రశ్న/ రాజకీయంలో (ప్రతీ రాత్రీ హోరాకిరి తప్పదు’’- (43- రాజకీయ రాత్రులు)
‘‘మగత నిదరల చిరు దరహాసంలో/ ప్రతీ రాత్రీ ఒక స్వప్న గుచ్ఛం’’ (చిన్ననాటి రాత్రులు)
‘ఈ రాత్రి తెల్లవారకూడదు/ ఎన్నటికీ ఓటమి భయం/ పట్టపగలులా నను తాకకూడదు’’- (విజయోత్సవ రాత్రి)
ఈ భాగాల్లో జీవితంలోని అనేక సందర్భాల అనుకలనం ఉంది. ఈ పరిధిలో ఆలోచిస్తే ఆశా జీవితం, వాస్తవ జీవితానికి మధ్య బాహ్యంతశే్చతనల సమాహార సారంగా తేడాని గమనించింది.‘రాత్రి’ కలలకు ఆ రకమైన ఆశకు ఆకారంగా, వెలుగు, పగలు, అనిద్రావస్థ. ఉదయం ఇవన్నీ అసంపూర్ణత్వాన్ని ప్రతిపాదించేలా కనిపిస్తాయి. తన అస్తిత్వాన్ని కోల్పోవడం. జీవితంలో కేవల పార్శ్వంగా అనుకలనాంశంగా ఉండే స్థాయినుండి తనను తాను వ్యక్తపరచుకోవడం కనిపిస్తుంది. ఈ సంపుటిలో సమాజాన్ని అధ్యయనం చేసిన కవితలూ ఉన్నాయి. సామాజిక వృద్ధి వికాసం వ్యక్తి చేతనలను మార్చలేదనే బాధని వ్యక్తంచేసిన కవిత ‘హింస’. అందమైన భావ చిత్రాలు చెప్పడంలో కవయిత్రిలోని సృజనశీలత సౌందర్యాత్మకమైంది. పఠితల హృదయాలకు స్వీయ ఉద్దేశాన్ని మాత్రమే కాకుండా ఉద్వేగాన్ని, ఉధృతిని అందించడంలో ఈ వర్ణన (జఒషూజఔఆజ్యశ) ఉదాత్తంగా కనిపిస్తుంది. ఓల్గా కవిత్వంలో నిబద్ధ పార్శ్వం వర్గశత్రువుకు ప్రతిగా నిలబడే నినాదం లాంటిది కాదు. సాపేక్షంగా జీవిత పూర్ణత్వాన్ని ఆ సాధనలోని రెండు పార్శ్వాలను ప్రేరేపించేది. ప్రశ్నించినా నిర్వచించినా ఆ భావన సుస్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలోని బాధ్యతను విస్మరించడాన్ని, కుటుంబ భారాన్ని వదిలేయడాన్ని ఓ స్ర్తి గొంతుకతో నినదించిన భాగాలు ఉన్నాయి. ముద్దకోసం గాదు యుద్ధానికోసం బతకాలని నేర్పుతానని ధీరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ప్రధానంగా ఈ కవిత్వంలో ఆకట్టుకునే మరో అంశం భాష ఏ గొంతుతో కవిత్వం రాస్తే ఆ పరిధిలోని, ప్రతీ కలని వాడటం పై భాగంలోని ‘పురుగు కొరికిన పత్తికాయ’లాంటి అనేకచోట్ల సందర్భోచితంగా కనిపిస్తాయి. ‘మాతృత్వం’ కవిత శబ్ద లాఘవాన్ని బాగా వాడుకున్న కవిత.
కొన్ని పదబంధాలు ఉద్వేగంకోసమే సృజించినా భాషా పటిమకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ‘శరీర శకలాలు (44) అవ్యక్త్భోగం (15) భావాంధకారం దేహపు నెర్రెలు (45) కాలుష్యాంధకారం (45) ఫలదీకరణ ప్రయోగ యజ్ఞం (44) నీరస నిస్తేజ నాడీ మండలం (66) ఇలా చాలా పదాల్ని ఎత్తి రాయొచ్చు. స్వేచ్ఛ, రాత్రి పగలు, స్వప్నం లాంటి పదాలకు అర్ధ సంబంధంగా ఈ సంపుటిలో ఉదాత్త జీవనం ఉంది. అనువాద కవితే అయినా ‘స్వేచ్ఛాగీతం’ ఓల్గా కవిత్వానికి నేపథ్యం లాంటిది.
నిబద్ధ కవిత్వాన్ని చదువుతున్నప్పుడు
english title:
literary dharma
Date:
Monday, February 11, 2013