ఆగిన చోటనే
పదం అల్లడం మొదలుపెట్టాలి
మాటల దండ
తెగిన క్షణానే్న
జీవన కఠోర వాస్తవాల
ఉద్గ్రంథ్రావిష్కరణకు
ఏర్పాట్లు సాగాలి
వాక్యం కూలబడిన వేళ
బలమైన శీర్షికతో
బలపరీక్ష పెట్టాలి
విషయం
గందరగోళంలో పడిన తావున
ప్రతి చెట్టు ఆకుని పఠించాలి
బోధి సత్యం
బోధపడేవరకు
లక్ష్యశుద్ధి లోపంతో
రెపరెపలాడే భావదీపం
అరచేయి అంటుకున్నా సరే
ఆర్పాలి
ఉదాత్త అక్షరానికి
అఖండ దీపం వెలిగించాలి
అనవసరాలన్నీ అవసరాలై
అవసరాలన్నీ అనవసరాలై
మెడకు చుట్టుకుంటున్న
హింసాత్మక, మరణ
సాదృశ్య సందర్భాన
కవిత్వమొక్కటే కాపాడుతుంది
సరిగ్గా,
పాళీ చిట్లిన చోట
ఒక కొత్త కవి
జన్మెత్తుతాడు!
ఆగిన చోటనే పదం అల్లడం మొదలుపెట్టాలి
english title:
life of a poet
Date:
Monday, February 11, 2013