ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 12: జిల్లాలోని గిరిజనులకు విద్య, వైద్య సౌకర్యాలతో పాటు నిరుద్యోగ యువకులకు ఉపాధిని కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు. మండలంలోని కెస్లాపూర్‌లో జరుగుతున్న నాగోబా జాతర సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన నాగోబా గిరిజన దర్బార్‌కు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన నాగోబా దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలోని కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులు అర్పించారు. దర్బార్‌లో పాల్గొని కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగులేని లక్షా 50 వేల మంది విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లతో పాటు ఫీజు రీయంబర్స్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదవడానికి 55 కోట్లలో 50 కోట్లు వెచ్చించినట్లు కలెక్టర్ చెప్పారు. అంతేగాక ఆశ్రమ పాఠశాలల్లో డోరో మెట్రి ఆశ్రమ పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితరవి గిరిజన విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గత దర్బార్‌లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చి జాతరలో తాగునీటి వనరులు వసతులు కల్పించామన్నారు. రోడ్డు, విద్యుత్‌తో పాటు విద్యుద్దీకరణ పనులు చేపట్టినట్లు ఆయన చెప్పారు. కొమరంభీం నిజాం సర్కార్‌తో పోరాడి జల్, జంగల్, జమీన్ హక్కులు కల్పించారన్నారు. భూమి సమస్య, మంచినీటి, భూమి హక్కు పత్రాలను అందించడానికి ప్రత్యేక కృషి చేసినట్లు చెప్పారు. గతంలో జిల్లాలోని 30 వేల 880 మంది గిరిజన రైతులకు 2 లక్షల ఎకరాల భూమికి అటవీ హక్కు పత్రాలను అందించగా, 870 హక్కు పత్రాలు పంపిణీ కోసం సిద్దంగా వున్నాయని కలెక్టర్ అన్నారు. వాటిని ఎన్నికల కోడ్ అయిన వెంటనే గిరిజన రైతులకు పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత సంవత్సరం పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ కింద 100 కోట్ల రూపాయల పంట నష్టపరిహారాన్ని అందించామన్నారు. గిరిజన అభివృద్ధి కోసం ఐటిడిఎ, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంకిత భావంతో పని చేస్తుందన్నారు. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ తరపున గర్భవతి మహిళలకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం అందించి రక్తహీనత నిర్మూలించడానికి గుడ్లు, పాలు, అంగన్‌వాడీ భవనాలు, అమృతహస్తం కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ చిన్న సన్నకారు 30 వేల మంది రైతుల బంజారు భూముల్లో 15 వేల బోరుబావులను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ పథకం కింద లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అంతేగాక విద్యుత్ కనెక్షన్లు, విద్యుత్ మోటార్లు, రైతులకు ఉచితంగా అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాజీవ్ విద్యామిషన్ కింద పునాది కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్హతలు అందరికి నాణ్యమైన చదువులను అందిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఆశ్రమ పాఠశాలల్లో అధునిక పరికరాలతో ఇ-లెర్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, గిరిజన నిరుద్యోగ యువకులకు ఐటిడిఎ ద్వారా రాజీవ్ యువ కిరణాల కింద ప్రత్యేక శిక్షణలు అందించడం జరిగిందని, ఈ శిక్షణలు పొంది 9 మంది నిరుద్యోగులు ఉద్యోగాల్లో చేరారని అన్నారు. వారు 4 వేల నుండి 9 వేల రూపాయల వరకు నెలకు వేతనం పొందుతున్నట్లు చెప్పారు. గిరిజనులు పిటిజిలు వున్న మనె్నవార్, కొలాం, తోటి కులాల వారికి వంద శాతం సబ్సిడీ కింద ఇల్లు కట్టడానికి ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ గిరిజనులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వరంగల్‌లో జరిగే గిరిజనుల దైవమైన సమ్మక్క సారక్కలాగానే నాగోబా జాతరను పండగ లాగానే జరుపుకోవాలని భక్తులకు సూచించారు. ఈ దర్బార్ మెస్రం మోతిరాం అధ్యక్షతన జరిగింది. ఈ దర్బార్‌లో వివిధ గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు గిరిజన పాటలపై నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జాతరలో నిర్వహించిన క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వంటి ఆటలను నిర్వహించగా గెలుపొందిన క్రీడాకారులకు కలెక్టర్, ఐటిడిఎ పిఓ మహేష్‌లు బహుమతులు అందజేశారు. దర్భార్‌లో జడ్పీ సిఇఓ వెంకటయ్య, వ్యవసాయ శాఖ జెడి రోస్‌లీలా, పశుసంవర్థక శాఖ జెడి విఠల్, పిఆర్‌ఇఇ నిర్మల్ జాదవ్ వెంకట్‌రావు, ఐటిడిఎ ఇఇ శంకర్‌రావు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ హెచ్‌కె నాగు, డిపిఆర్‌ఓ పూర్ణచందర్, దేవదాయాశాఖ అధికారి ఎం రవి, గ్రామ పటేల్ మెస్రం వెంకట్‌రావు, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం నాగ్‌నాథ్, మెస్రం వంశీయులు అయిన మెస్రం సోంజీ, మెస్రం మహదూ, మెస్రం దేవ్‌రావు, మెస్రం పొల్లు, గోండ్వానా సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఆత్రం పరుశురాం, గిరిజన సంఘ నాయకులు రాంకిషన్, గోపి, సిడాం శంభు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్
english title:
a
Date:
Tuesday, February 12, 2013