న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయలు గండికొట్టిన 2-జి స్ప్రెక్టమ్ లైసెన్స్‌ల కేటాయింపులో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరానికి సంబంధం లేదని సిబిఐ ప్రత్యేక న్యాయ స్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈమొత్తం వ్యవహారంలో అప్పటి టెలికాం మంత్రి రాజా ఒక్కడే విలన్ పాత్ర పోషించారా? అన్న ప్రశ్న తలెత్తుతున్నదని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ వ్యాఖ్యానించారు. నిజానిజాలు పరిశీలించి, దోషులెవరో సుప్రీం కోర్టు నిర్ధారించాలని సూచించారు. యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ అవినీతికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చిదంబరానికి తాత్కాలిక ఊరట కలిగించినప్పటికీ ఆయనపై కేసు వేసిన జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి పట్టువదిలే అవకాశం లేదని ఆయన తన బ్లాగులో అభిప్రాయపడ్డారు. రాజా ఒక్కడే దోషా? చిదంబరంతో సహాప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఇతరులెవరికీ ఈనేరంతో సంబంధం లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉందని అన్నారు. చూసేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా వ్యవహరిస్తున్నా, యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధికారం చెలాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆమెకు తెలియకుండా ఏ ఒక్క విధాన నిర్ణయం కూడా వెలువడటం లేదని అద్వానీ అభిప్రాయపడ్డారు. అందుకే కుంభకోణాలకు సోనియా గాంధీ కూడా బాధ్యత వహించక తప్పదని వ్యాఖ్యానించారు.
సోనియా కూడా బాధ్యత వహించాలి బిజెపి అగ్రనేత అద్వానీ డిమాండ్
english title:
2 g kumbakonam
Date:
Thursday, February 9, 2012