ఆదిలాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సీమాంధ్ర పాలకులు కుట్రలు పన్నుతున్న నేపధ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని గెలిపించి తమ సత్తా చాటి చెప్పాలని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి స్వామిగౌడ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు పాఠశాలలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి తెలంగాణ తల్లికి పూలదండలు వేశారు. ఈ సందర్భంగా టిఎన్‌జిఓ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి స్వామిగౌడ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి డైరెక్టర్ పోస్టులను దొడ్డదారిన గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించామని విర్రవీగుతూ తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తున్నారని అన్నారు. రాష్ట్రం సాధించే వరకు వెనుకడుగు వేయకుండా పోరాటాలు సాగిస్తున్న జెఎసి, టిఆర్‌ఎస్ పిలుపుమేరకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవంగా పోటీ చేయాలన్న ఆసక్తి లేకపోయినప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను టిఎన్‌జిఓల డిమాండ్లపై పోరాటం చేసి వాణి వినిపించేందుకే ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థిగా తాను పోటీలో వున్న విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పట్ట్భద్రులు లక్షా 50 వేల పైన ఓట్లు వున్నందున లక్షకు పైగా మెజార్టీతో గెలిపించి తెలంగాణ వాదం ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. తాను ఈ ఎన్నికల్లో గెలవడం తధ్యమని మెజార్టీ కోసమే ఉద్యోగులు, ఉపాధ్యాయులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి సీమాంధ్ర పాలకులకు ఫలితాలతో గుణపాఠం చెప్పాలని కోరారు. తాను గెలిస్తే తెలంగాణలో 610 జీఓ అమలుతో పాటు ప్రధాన డిమాండ్లను పరిష్కరించడమే గాక, ముఖ్యమంత్రి వద్ద సమస్యలు ప్రస్తావిస్తానని వివరించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ ప్రజావాణిని వినిపించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ సహకార ఎన్నికలను అంత సీరియస్‌గా తీసుకోలేదని, ఈ పాటికే కాంగ్రెస్ తమ విజయంగా సంబరాలు చేసుకోవడం విచిత్రంగా వుందన్నారు. సత్తా వుంటే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలాన్ని చూపాలని ఆయన సవాలు విసిరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం, డ్వామా, బిసి వెల్ఫేర్, సొషల్ వెల్ఫేర్, వ్యవసాయశాఖ వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో స్వామిగౌడ్ ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం నిర్వహించారు. స్వామిగౌడ్ వెంట టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, నాయకులు గోవర్థన్‌రెడ్డి, బాబన్న, పవన్‌కుమార్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
సుధాకర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నుకోండి : ఈటెల
ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పాతూరి సుధాకర్‌రెడ్డిని గెలిపించి తెలంగాణ వాదాన్ని నిరూపించాలని టిఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం సాయంత్రం టిఎన్‌జిఓ భవన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన, అనుభవం కలిగి వున్న సుధాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై వుందన్నారు. పలు సంఘాలు ఇప్పటికే స్వచ్చంధంగా ప్రచారం నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ఆయన వెంట అభ్యర్థి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగురామన్న, లోక భూమారెడ్డి, గోవర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
15న ఆహార భద్రత సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఫిబ్రవరి 12: ఈ నెల 15న కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి జాతీయ ఆహార భద్రత పథకంపై పాలక వర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ జెడి ఎస్ రోస్‌లీలా తెలిపారు. ఉదయం 12 గంటలకు జరిగే ఈ సమావేశంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాలక వర్గ సభ్యులు హాజరుకావాల్సిందిగా ఆమె కోరారు.
* టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి స్వామిగౌడ్
english title:
v
Date:
Wednesday, February 13, 2013