కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 12: రెండువేల పద్నాలుగు ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక షాలినీ ఫంక్షన్ హాలులో బిజెపి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముద్దసాని లక్ష్మారెడ్డి గెలుపుకోసం ప్రతీ కార్యకర్త తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ క్షణంలోనైనా మద్యంతర ఎన్నికలు రావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఈ నెల చివరి వరకు సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకోవాలని, మార్చిలో ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలని పిలుపునిచ్చారు. మార్చి నుండి సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా గ్రామ గ్రామాన బిజెపిని పటిష్టం చేయడంతో పాటు అవినీతి కాంగ్రెస్‌ను గద్దె దించడానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన బిజెపితోనే సాధ్యమనే విషయాన్ని సామాన్య ప్రజలకు చేరేవేసే విధంగా జిల్లా శాఖలు తమ కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు బిజెపి సమాయత్తం కావాల్సిన అవసరముందని, ఈ దిశగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో బిజెపికి అనుకూల వాతావరణం ఉంటుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసి సాధారణ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ముద్దసాని లక్ష్మారెడ్డి గెలుపు విజయప్రస్థానం మొదలు కావాలని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ముద్దసాని లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తనకు ఈ సారి అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. తన గెలుపుకోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ అనుబంధ మోర్చాలు పటిష్టం చేయడానికి ముఖ్యమైన వ్యక్తులను ఆ బాధ్యతలలో నియమించాలని నేతలు నిర్ణయించారు. జిల్లా ఇంచార్జి కె.సత్యనారాయణ, కిసాన్ మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్ రావు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాథ్, మెదక్ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు ప్రేమేందర్ రెడ్డి, బల్మూరి వనిత, ఎస్.కుమార్, రాంనాయక్, లాయక్ అలీ, శ్యాం సుందర్ రావు, కోమల ఆంజనేయులు, బాజోజు భాస్కర్, బాస సత్యనారాయణ రావు, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, ప్రతాప రామకృష్ణ, నారాయణ రావు, శ్రీ్ధర్, శశిభూషణ్ కాచె, ఓదెలు, శ్రీనివాస్ రెడ్డి, కన్నం అంజయ్య, గుజ్జ సతీష్, వర్ధినేని సత్యనారాయణ రావు, బల్మూరి జగన్ మోహన్ రావు, బండి సంజయ్ కుమార్, లక్కిరెడ్డి తిరుమలతో పాటు పలువురు పాల్గొన్నారు.
కిషన్ రెడ్డికి ఘన స్వాగతం
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మొదటిసారిగా జిల్లాకు వచ్చిన జి.కిషన్ రెడ్డికి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన నాలుగు జిల్లాల పదాధికారుల సమావేశంలో ఆయా జిల్లాల నాయకులు కిషన్ రెడ్డిని శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.
* సంస్థాగత ఎన్నికలు త్వరితగతిన పూర్తి చేయాలి * ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ‘ముద్దసాని’ గెలుపునకు కృషి చేయాలి * బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి
english title:
e
Date:
Wednesday, February 13, 2013