హైదరాబాద్, చార్మినార్, ఫిబ్రవరి 13: ప్రేమికులలో హుషారు నింపే రోజు నేడు. ప్రేమికులు ఒకరినికొరు ఆనందపరిచేందుకు మార్గాలను వెతుక్కోవటంలో ప్రేమికులు గత నాలుగైదు రోజుల నుంచే బిజీగా ఉన్నారు. అయతే ప్రేమికుల రోజే అటు ప్రేమికులకు, ఇటు అధికారులకు, ఇటు కొందరు నేతలకు పరీక్ష రోజుగా మారింది. ప్రేమికులు కన్పిస్తే వారిని అడ్డుకుని తీరుతామని, వారి పెళ్లిళ్లు చేస్తామని కొందరు, వారిని అడ్డుకుంటే అంతు చూస్తామంటూ మరికొందరు, ప్రేమికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామంటూ ఇటు పోలీసులు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రకటనలు చేస్తున్నారు. ప్రేమికుల రోజు నిర్వహించుకోవటం పాశ్చాత్య సంస్కృతి అంటూ గత కొద్ది సంవత్సరాలుగా బజరంగ్‌దళ్ నేతలు, కార్యకర్తలు ప్రేమికులను పట్టుకుని పెళ్లిళ్లు చేసిన సంఘటనలు తెల్సిందే. ఈసారి కూడా గురువారం ప్రేమికులు తమకు కన్పిస్తే వారికి పెళ్లిళ్లు చేయడం ఖాయమని బజరంగ్‌దళ్ నేతలు ప్రకటించారు. వాలంటైన్స్ డే మన సంస్కృతి కాదని, తాము ప్రేమకు, ప్రేమికులకు వ్యతిరేకం కాదని, అయితే పాశ్చాత్య సంస్కృతిని వంటబట్టించుకున్న పలువురు యువతీయువకులు వాటి వ్యామోహంలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అర్థం లేని సంస్కృతులను ఆలవాటు చేసుకుంటున్నారని వారు మండిపడుతున్నారు. అందుకే పాశ్చాత్యదేశాల నుంచి దిగుమతి అయిన ఈ పండుగను తాము ఎట్టిపరిస్థితుల్లో జరగనివ్వబోమని వారు హెచ్చరిస్తున్నారు. కాగా, ప్రేమించుకోవటం తమ హక్కు అంటూ, తాము ఏదో తప్పు చేసిన విధంగా తమను పార్కుల్లో, సినిమాహాళ్లలో పట్టుకుని పెళ్లిళ్లు చేస్తున్న బజరంగ్‌దళ్ నుంచి తమకు భద్రత కల్పించాలని ప్రేమికులు కోరుతున్నారు. ప్రేమికులు ఒకరికొకరు గులాబీలు, ఇతర బహుమతులు ఇచ్చి అభినందించుకోవటం గొప్ప సంస్కృతి అంటూ పలువురు ప్రేమికులు వాదిస్తున్నారు. కానీ పాశ్చాత్య పోకడ నచ్చని బజరంగ్‌దళ్ మాత్రం గతంలో మాదిరిగానే వాలంటైన్స్ డే నిర్వహించుకునే ప్రేమికులను పట్టుకుని, వారిని పెళ్లిబంధంతో ఒక్కటి చేసేందుకు బజరంగ్‌దళ్ నేతలు, కార్యకర్తలు కూడా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రేమికులు ఎక్కువగా కన్పించే ఇందిరాపార్కు, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, గోల్కొండ, సెవెన్ టూంబ్స్, బిర్లామందిర్ తదితర ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా గురువారం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. అయితే నగరంలోని పలు పార్కుల్లో గతంలో ప్రేమికులు బజరంగ్‌దళ్‌కు చిక్కటంతో ఈసారి ప్రేమికులు కాస్త తెలివిగా వాలెంటైన్స్ డే వేదికలను ఎంచుకుంటున్నట్లు తెల్సింది. రోజురోజుకీ కార్పొరేట్ సంస్కృతి విస్తరిస్తున్న నేటి పరిస్థితుల్లో ఎంత డబ్బు అయినా వెచ్చించేందుకు సిద్ధమవుతున్న ప్రేమికులు నగర శివార్లలోని పర్యాటక ప్రాంతాలను వాలంటైన్స్ డేకు వేదికలుగా ఎంచుకున్నట్టు తెల్సింది. దీనికి తోడు నగరంలోని పలు రిసార్ట్స్‌లు, అయిదు నక్షత్రాల హోటళ్లు కూడా గురువారం సాయంత్రం పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.ప్రేమికులకు రక్షణ కల్పిస్తామని, వారిపై ఎలాంటి దాడులకు పూనుకున్నా సహించేది లేదని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా బజరంగ్‌దళ్, ఇతర నేతలు వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ప్రేమికులకు రక్షణ కల్పిస్తామని వారు హామీ ఇస్తున్నారు. కాగా, బజరంగ్‌దళ్ దాడుల నుంచి ప్రేమికులకు రక్షించి అండగా ఉంటామని పలువురు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు తెలిపారు. ప్రేమికుల డేను బజరంగ్‌దళ్ వ్యతిరేకించడాన్ని వారు ఖండించారు.
అడ్డుకుని తీరుతాం: బజరంగ్‌దళ్ హెచ్చరిక ఏం భయం లేదు.. మేమున్నాం : పోలీసుల భరోసా
english title:
p
Date:
Thursday, February 14, 2013