Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పసికందు ప్రాణం తీసిన డ్రైవర్ నిర్లక్ష్యం..!

$
0
0

హయత్‌నగర్, ఫిబ్రవరి 13: జీవనోపాధికోసం నగరానికి వలసవచ్చిన కూలీల పాప ఒక కారుడ్రైవర్ నిర్లక్ష్యానికి బలైంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా డిండి గ్రామం దేవత్‌పల్లి తండాకు చెందిన చందు, లక్ష్మి దంపతులు గత కొంతకాలంగా జీవనోపాధి కోసం హయత్‌నగర్‌లో నివాసం ఉంటూ కూలిపని చేస్తున్నారు. బుధవారం హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో రోడ్డు పనులు చేస్తుండగా వారి పాప వైశాలి (9 నెలలు)ని రోడ్డు పక్కన పడుకోబెట్టారు. ఏపి 24 ఎజి 6668 నెంబర్‌గల కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా కారును నడుపుతూ పాపపై నుండి వెళ్లాడు. తీవ్ర గాయాలైన పాపను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
వివాహితను వేధించిన ఎస్‌ఐ సస్పెన్షన్
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 13: ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక వివాహితను వేధించిన ఎస్‌ఐను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల క్రితం దుండిగల్ ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన సుధీర్‌కుమార్ ఒక కేసు విషయమై తన దగ్గరకు వచ్చిన ఒక వివాహితను వేధించాడు. ఈ మేరకు బాధితురాలు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐను సస్పెండ్ చేస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు.

రానున్న ఎన్నికల్లో బిజెపిదే హవా
అంబర్‌పేట, ఫిబ్రవరి 13: రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందిబి మోగించడం ఖాయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట ఎమ్మెల్యే జి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం కిషన్‌రెడ్డి రెండోసారి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా విద్యానగర్, బాగ్ అంబర్‌పేట డివిజన్ల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సాధ్యం కాని పలు పథకాలను ప్రవేశపెడుతూ పేద ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రతి నెలా పన్నుల రూపంలో పేదలపై భారాన్ని మోపుతున్నారని పాలకులపై విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారన్ దత్తు ముదిరాజ్, గోవర్ధన్‌రెడ్డి, ఎన్ గిరి, మి వెంకట్, చుక్క జగన్, భాగ్యలక్ష్మి, యాదమ్మ, శాంతమ్మ పాల్గొన్నారు.
బాగ్ అంబర్‌పేట డివిజన్ అధ్యక్షుడు ఏడెల్లి అజయ్‌కుమార్, నాయకులు చంద్రశేఖర్, రాజు, సుభాష్, సుభాష్, మల్లేష్, కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలతో అభివృద్ధికి ఆటంకం: సర్వే
నార్సింగి, ఫిబ్రవరి 13: సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువయ్యాయని దీంతో ఆసుపత్రిలో అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. బుధవారం మధ్యాహ్నం స్వాతంత్ర సమరయోధురాలు, భారత కోకిల సరోజినీనాయుడు 134వ జయంతిని పురస్కరించుకుని మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ తాను ఎంపి నిధులతో 10 లక్షల వ్యయంతో ఓ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు, అంతేకాకుండా ఆసుపత్రి కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా తాను ముందుండి సమకూర్చుతానని తెలిపారు. గతంలో కూడా ఆసుపత్రి కోసం పరికరాలు అందించినట్లు గుర్తుచేశారు.
త్వరలో మళ్లీ ఆసుపత్రిని పరిశీలించేందుకు వస్తానని తెలిపారు. ఈ ఆసుపత్రి వాతావారణం సరిగా లేదని దీనిని మార్చాల్సి ఉందని పేర్కొన్నారు. డాక్టర్ వృత్తి అంటే చాలా గౌరవం ఉందని ఈ వృత్తిలో నా ఇంట్లో నలుగురు డాక్టర్లు ఉన్నారని గుర్తుచేశారు. ఆసుపత్రి సూపరింటెండ్‌ంట్ కోసం ఇద్దరు పోటీ పడ్డారని అందులో తెలంగాణకు చెందిన ఓ డాక్టర్ కూడా తన వద్దకు వస్తే వెంటనే అతనికి లెటర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత నందకుమార్‌రెడ్డి కూడా తన వద్దకు వచ్చాడని దీంతో నందకుమార్‌రెడ్డికి కూడా లెటర్ ఇచ్చానని చివరికి ప్రాధాన్యత ఉన్నవారికి సూపరింటెండ్‌ంట్ పదవి ఇవ్వాలని లెటర్‌లో తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే చివరిగా సూపరింటెండ్‌ంట్ పదవి నందకుమార్‌రెడ్డికి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ నందకుమార్‌రెడ్డి, ఆర్‌ఎంవోలు మోతిలాల్‌నాయిక్, రాథోడ్, తెలంగాణ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రాజలింగమ్‌తో పాటు డాక్టర్లు బృందం పాల్గొన్నారు.
తెలంగాణ సంగతి ఏమిటని నిలదీసిన
తెలంగాణ డాక్టర్లు
తెలంగాణ సంగతి ఏమిటి అని తెలంగాణ డాక్టర్లు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజలింగమ్ మంత్రి సర్వే సత్యనారాయణను అడిగారు. దీంతో మంత్రి సమాధానం తెలుపుతూ హిందీ మాట్లాడేవారు నాలుగు రాష్ట్రాలుంటే, తెలుగు మాట్లాడేవారు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పులేదని పేర్కొన్నారు.
తెలంగాణ త్వరలోనే సోనియాగాంధీ ఇస్తుందని రెండు రాష్ట్రాలు ఉంటే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రం తప్పక సోనియాగాంధీ ఇస్తుందని నాకు నమ్మకం అని తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి నెలరోజుల్లో తెలంగాణ తేలుస్తామని తెలిపితే దానిని కేంద్ర మంత్రి ఆజాద్ నెలరోజులు అంటే 30రోజులు కాదని తెలిపారని దీనిపై మీ సమాధానం ఏమిటని విలేఖరులు ప్రశ్నించగా, తెలంగాణ విషయం సున్నితమని తెలంగాణ రాష్ట్రం ఎన్నికల ముందే వచ్చి తీరుతుందని మంత్రి సర్వే తెలిపారు. అంతేకాకుండా ఇప్పుడే తెలంగాణ ఇస్తే సమైక్యాంధ్రవాదులు రాజీనామాలు చేస్తున్నారని దీంతో తెలంగాణ రాష్ట్రం కొంత ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ వస్తుంది అని తెలిపారు.

ఉపాధి పథకంలో అక్రమాలు

చెవెళ్ల, ఫిబ్రవరి 13: గ్రామీణ ప్రాంతంలోని పేదల వలసలను నివారించి ఆర్థికంగా దోహదపడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంలో అవినీతి పెచ్చరిల్లుతుందని విమర్శలున్నాయి. చేవెళ్ల మండలంలో 2011 సెప్టెంబర్ నుంచి 2012 నవంబర్‌కు వరకు జరిగిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ నిర్వహించగా రూ.50లక్షలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఉపాధి పథకంలో అక్రమాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో అవినీతి మాత్రం అగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చేయని పనులకు, లేని వ్యక్తులకు బినామీలుగా చూపించి అందికకాడికి దండుకుంటున్నట్లు తెలిసింది. బుధవారం చేవెళ్ల మడల పరిషత్ కార్యాలయంలో ఉపాధి పథకం 5వ విడత సామాజిక తనిఖీలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఎంపిడివో రత్నమ్మ, ఎపివో లక్ష్మిదేవీలకు తనిఖీ బృందం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పరిశీలన బృందం కూలీలతో మాట్లాడారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ జైపాల్‌రావు, తనిఖీ బృందం సభ్యులు రమేశ్‌గుప్త, కోటేశ్వర్, శ్రీధర్ ఆయా గ్రామాల్లో ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులు, చేపట్టిన పనుల వివరాలను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రూ.25లక్షలు విలువ చేపట్టిన్నట్లు రికార్డుల్లో ఉన్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాటికి ఆనవాళ్లు కనపించడం లేదని తనిఖీ బృందం పేర్కొంది.

అనుమతులు లేకుండా కార్పొరేట్ పాఠశాలలు

శంషాబాద్, ఫిబ్రవరి 13: ఎలాంటి అనుమతి లేకుండా శంషాబాద్ ప్రాంతంలో అనేక కార్పొరేట్ స్కూళ్ల పేరిట పాఠశాలలు వెలిసినట్లు విమర్శలున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన అనుమతి లేకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరిట పాఠశాలను ఏర్పాటు చేసి అనంతరం మూసివేసిన సంఘటన తెలిసిందే. శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఉండటంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడకు వచ్చారు. పెద్దపెద్ద స్కూళ్లు, కార్పొరేట్ సూళ్ల శాఖలను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు ప్రకటనలు ఇవ్వడంతో.. అందులో తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పించారు. ఆయా పాఠశాలల శాఖలకు అనుమతి ఉందా.. లేదా.. అనే అంశాన్ని సరిగా పట్టించుకోకుండా అడిగినంత డొనేషన్లు, ఫీజులు చెల్లిస్తున్నారు. ఇటీవల టీచర్లకు వేతనాలు ఇవ్వలేదని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మూసివేయడం సంఘటన జరిగిన నేపథ్యంలో తల్లిదండ్రులలో ఆందోళన కనిపిస్తోంది. కేంద్ర మంత్రి ఒకరు మావాడేనంటూ సదరు స్కూల్ యజమాని చెప్పడం గమనార్హం. కాగా, స్కూల్ యజమాని జైలు పాలైన విషయం తెలిసిందే. పిల్లలు వెళ్తున్న స్కూల్‌కు అన్ని అనుమతులు ఉన్నాయో లేవో అంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నకిలీ స్కూళ్లను గుర్తించి చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

డబ్బులిస్తేనే ఆధార్ దరఖాస్తు ఫారాలు?
మేడ్చల్, ఫిబ్రవరి 13: ఆధార్ కార్డును వంట గ్యాస్‌తో పాటు నగదు బదిలీ పథకానికి అనుసంధానం చేయడంతో డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఆధార్ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తుల ఫారాలను డబ్బులు ఇచ్చిన వారికే ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆధార్ కార్డు నమోదు ప్రక్రియ ప్రహాసనంగా మారడంతో ప్రభుత్వం రెండు నెలల వ్యవధి పెంచడంతోపాటు మరో 1900 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఆధార్ నమోదు అవినీతిమయంగా మారిందని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. కేంద్రం వద్ద ఫారాలు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మేడ్చల్‌లోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నమోదు కేంద్రం కొనసాగుతుంది.అధికారల ఆదేశాల మేరకు ఇక్కడ కేంద్రాన్ని మూసివేసి శివారులో కళాశాల విద్యార్థుల కోసం తెరిచారు. తిరిగి రెండు రోజులుగా పునఃప్రారంభమయింది. ఫారాలు అందుబాటులో లేవని నిర్వాహకులు తెలపడం గమనార్హం. మూడు రోజుల పాటు గర్భిణుల కోసమే కేంద్రం ఏర్పాటు చేసామని ప్రకటించడం విశేషం. కాగా, మధ్యవర్తులను ఆశ్రయిస్తే డబ్బులు తీసుకొని ఫారాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. బుధవారం మీడియా ప్రతినిధులు సంప్రదించగా వారి వద్ద కూడా నిర్వాహకులు డబ్బులు తీసుకొని ఫారాలు ఇవ్వడం విశేషం. మీడియా ప్రతినిధులు ఇక్కడి సంఘటనలు చిత్రీకరిస్తుండగా నిర్వాహకులు పరుగులు తీశారు. అవినీతి వ్యవహారంపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా విచారించి చర్య తీసుకుంటామని చెప్పారు.
ఆధార్.. డబ్బులిస్తే ఇంటికే...
దిల్‌సుఖ్‌నగర్, ఫిబ్రవరి 13: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చిరునామా ఉత్తరమైన ఆధార్ కార్డు అపహాస్య పాలవుతోంది. ఆధార్ జీవితంవో ముడివేసి ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు పొందాలని ప్రభుత్వ నిబంధన. ఇది ఆధార్ కేంద్రాలలో పనిచేస్తున్న వ్యక్తులకు అదునుగా మారింది. ఉప్పల్‌లోని మాలబస్తీ భవనంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంలో ఇన్‌చార్జిగా పనిచేస్తున్న వ్యక్తి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను, అతని సోదరుడు, మరొకరు కలిసి ముఠాగా ఏర్పడి నమోదు కేంద్రం నుంచి పరికరాలను బయటకు తీసుకవచ్చి కొందరు పెద్దల ఇళ్లలోకి వెళ్లి రూ.5వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తూ అక్కడే నమోదు చేస్తున్నట్లు సమాచారం. కర్మాన్‌ఘాట్ హనుమాన్‌నగర్‌లో ఓ ఇంట్లో ఇదేతంతూ జరుగుతుండగా సరూర్‌నగర్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దేవిదాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నింధితుడు గణేశ్, అతని సోదరుడు అజయ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

అనుమతి లేని సెల్‌టవర్లపై మున్సిపల్ అధికారుల కొరడా
వికారాబాద్, ఫిబ్రవరి 13: అనుమతిలేని సెల్‌టవర్లపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. బుధవారం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ జైత్‌రాం ఆదేశాల మేరకు గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించనందుకు కమలానగర్‌లోని ఎయిర్‌టెల్, వొడా, స్టేట్ బ్యాంక్ సమీపంలోని రిలయన్స్ టవర్ల కనెక్షన్‌లను పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు. పట్టణంలో మొత్తం 16 సెల్‌టవర్లుండగా కేవలం రెండు టవర్లకు మాత్రమే అనుమతులున్నాయి. 16 సెల్‌టవర్లలో రిలయన్స్ మూడు, ఎయిర్‌టెల్ ఐదు, వొడాకు నాలుగు, టాటా ఇండికాంకు నాలుగు టవర్లున్నాయి. మున్సిపల్ అనుమతి పొందేందుకు 30 వేల రుసుము కంపెనీవారు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు రోజుల్లో రుసుము చెల్లించి అనుమతి పొందని పక్షంలో మిగతా సెల్‌టవర్ల కనెక్షన్‌లను మున్సిపల్ అధికారులు తొలగించనున్నారు.

జీవనోపాధికోసం నగరానికి వలసవచ్చిన కూలీల పాప ఒక కారుడ్రైవర్ నిర్లక్ష్యానికి బలైంది. హయత్‌నగర్
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>