ఏలూరు, ఫిబ్రవరి 13: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల ఎన్నికలకు సంబంధించి గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బుధవారం ఓటర్ల జాబితాను సహకారశాఖాధికారులు విడుదల చేశారు. 15న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, అదేరోజు మధ్యాహ్నం 3గంటల నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 16న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 18న బ్యాలెట్ పద్దతిలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు డిసిసిబి ఎన్నిక జరుగుతుంది. అదేరోజు డిసిఎంఎస్ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం డిసిసిబికి ఎన్నికల అధికారిగా ఎస్ మురళీకృష్ణ, డిసిఎంఎస్‌కు ఎన్నికల అధికారిగా డిఎల్‌సిఓ ఎం రవికుమార్ వ్యవహరిస్తారు. ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధులు అయితే 400 రూపాయలు ఫీజు, బిసిలకు 800 రూపాయలు, జనరల్ అభ్యర్ధులకు రెండు వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. 19న ఉదయం 8నుంచి 9గంటల వరకు ఆఫీసు బేరర్ల ఎన్నిక, పాలకమండలిలో భర్తీకాని స్ధానాలకు కో-ఆప్షన్ ఎన్నిక ద్వారా భర్తీ చేయటం జరుగుతుంది. ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఉదయం 11.30గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఉదయం 12గంటల నుంచి 2గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, మధ్యాహ్నం 2గంటల తర్వాత తుది జాబితా ప్రచురిస్తారు. పోటీ అనివార్యమైతే పోలింగ్ మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షుల్లో ఎవరైనా డిసిసిబికి, డిసిఎంఎస్‌కు, రెండింటికిగాని డైరెక్టర్లుగా పోటీ చేసే అవకాశం ఉంటుంది.
ఎన్నికలు ఇలా...
డిసిసిబి ఎన్నికలలో 21మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఎన్నికైన సహకార సంఘాల అధ్యక్షులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. ఏ గ్రూపులో 16మంది, బి గ్రూపులో అయిదుమంది డైరెక్టర్లు ఉంటారు. 16మంది డైరెక్టర్లను జిల్లాలో ఉన్న 244 మంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ 16మంది డైరెక్టర్లలో ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఇద్దరు బిసిలు, 10మంది ఓసిలు ఉంటారు. డిసిసిబి బి కేటగిరిలోకి జిల్లాలో ఉన్న 172 గొర్రెలు, మేకలు, మత్స్య, చేనేత, పాడిపారిశ్రామాభివృద్ధి, కార్మిక, జాయింట్ ఫ్యాక్టరీ, ఉద్యోగ, గృహనిర్మాణ సహకార సంఘాలు వస్తాయి. వాస్తవానికి జిల్లాలో మొత్తం 412 బి గ్రేడ్ సహకార సంఘాలు ఉండగా వాటిలో 240 సంఘాలకు అర్హత లేనందున 172 సంఘాల అధ్యక్షులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సంఘాల అధ్యక్షులు డిసిసిబి ఎన్నికల్లో అయిదుగురు డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ అయిదుగురు డైరెక్టర్లను ఈ సంఘాల నుంచే ఎన్నుకుంటారు. ఈ అయిందింటిలో ఒకటి ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు, రెండు బిసిలకు, ఒకటి ఒసిలకు కేటాయించారు. డిసిసిబి డైరెక్టర్ల ఎన్నికల్లో గెలుపొందిన ఎ కేటగిరి 16మంది డైరెక్టర్లు, బి కేటగిరిలోని అయిదుగురు డైరెక్టర్లు కలిసి వారిలోనే తిరిగి డిసిసిబి ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
ఇక జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఎ కేటగిరిలోని 244 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, బి కేటగిరిలో 172 వివిధ సహకార సంఘాల అధ్యక్షులు డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎ కేటగిరిలోని 244 సంఘాల ఛైర్మన్లు డిసిఎంఎస్‌లోని ఆరుగురు డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఒకరు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బిసి, ముగ్గురు ఒసిలు ఉంటారు. బి కేటగిరిలోని 172 సంఘాల అధ్యక్షులు నలుగురు డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఒకటి ఎస్సీలకు, ఒకటి బిసిలకు, ఇద్దరు ఒసిలకు కేటాయించారు. ఎ కేటగిరిలో గెలుపొందిన ఆరుగురు, బి కేటగిరిలో గెలుపొందిన నలుగురు డైరెక్టర్లు కలిసి ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
హవ్వ... వీళ్లు విద్యార్థులా!
*సహ విద్యార్థినితో అసభ్య ప్రవర్తన
*సెల్‌లో చిత్రీకరించి, నెట్‌లో ఉంచిన ఘనులు
*కొంతేరు జడ్పీ పాఠశాలలో ఘాతుకం
*ఆలస్యంగా వెలుగులోకి
*ఐదుగురు అరెస్టు
యలమంచిలి, ఫిబ్రవరి 13: పదోతరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడమేకాక, దాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, ఆ దృశ్యాలను ఇంటర్‌నెట్‌లో ఉంచిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. వీరిలో ముగ్గురు బాధితురాలికి సహ విద్యార్థులే కావడం విశేషం. యలమంచిలి మండలం కొంతేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ దురాగతం చోటచేసుకుంది. గత నెల 30 జరిగిన ఈ ఘటనపై మంగళవారం రాత్రి బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేయడంతో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... జనవరి 30వ తేదీన కొంతేరు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఒక పదోతరగతి విద్యార్థినితో భోజన విరామ సమయంలో సహ విద్యార్థి ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. దీన్ని తన సహచరుడైన మరో విద్యార్థితో సెల్‌ఫోన్‌లో చిత్రీకరింపచేశాడు. అనంతరం ఈ దృశ్యాలను తమ సహ విద్యార్థితోపాటు పోడూరు పాలిటెక్నిక్‌లో చదువుతున్న అతని సోదరునికి చూపించారు. వారు కొంతేరుకు చెందిన బాబు అనే మరో యువకుడికి ఈ దృశ్యాలు చూపించడంతో అతను వాటిని ఇంటర్‌నెట్‌లో ఉంచాడు. మెల్లమెల్లగా ఈ వ్యవహారం విద్యార్థిని తల్లిదండ్రుల చేరింది. వారు సోమవారం మాజీ ఎంపిటిసి సభ్యుడు సహా పాఠశాల ప్రధానోపాధ్యాయిని పాలేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలో ఇలాంటి దురాగతాలు జరుగుతుంటే ఏంచేస్తున్నారని ఆమెను నిలదీశారు. ఈ ఘటనకు కారకులైన విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖాధికారి, బాధిత బాలిక బంధువుల సమక్షంలో మంగళవారం రాజీ చర్చలు జరిగాయి. అయితే దీన్ని అంగీకరించని బాలిక తండ్రి మంగళవారం రాత్రి యలమంచిలి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మొత్తం వ్యవహారానికి కారకులైన ఐదుగురిపై కేసు నమోదుచేశారు. పాలకొల్లు టౌన్ సిఐ కృష్ణారావు ఆధ్వర్యంలో నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్టుచేసి, బుధవారం కోర్టులో హాజరుపరిచారు.
సబ్-స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే వనిత ధర్నా
గోపాలపురం, ఫిబ్రవరి 13: విద్యుత్ సమస్య పరిష్కరించాలని కోరుతూ గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత ఆధ్వర్యంలో రైతులు బుధవారం స్థానిక సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది తప్ప రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యుత్‌పై పంటలు సాగు చేసే ఈ ప్రాంతంలో తరచూ విద్యుత్ కోతల వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయానికి సంబంధించి సరఫరా చేసే విద్యుత్‌లో తరచు కోతలు విధించడం వల్ల సకాలంలో పంటలకు నీరందక పంటలు ఎండి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారన్నారు. ఈ ఏడాది మొదటి నుండి రైతులను కరెంటు కష్టాలు వెంటాడుతూనే వున్నాయన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని కనీసం ఏడు గంటలు విద్యుత్‌నైనా పగలు నిరంతరాయంగా సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
కోవర్టుల కోలాటం
*డిసిసిబిలో కొత్త కోణం
*శిబిరాల్లో చీలికల ప్రచారం
*ప్రధాన పక్షాల్లో ఆందోళన
*వర్గసమీకరణలో నిమగ్నం
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, ఫిబ్రవరి 13: ఇంతకాలం గణాంకాల గారడీతో కుస్తీలు పడుతూ వచ్చిన ప్రధాన పక్షాలకు మరో ప్రమాదం ముంచుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోవర్టులతో కోలాటాలు నడిపిస్తున్న పార్టీలకు ఇప్పుడు అదే ప్రమాదం తమవర్గాల్లో కన్పించటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఫలానా పార్టీ శిబిరం చీలిపోయిందని ప్రచారాలు జోరుగా సాగుతుండటంతో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠభరితంగా మారిపోయింది. వాస్తవంగా చూస్తే తాజా ఎన్నికల పరిణామాల్లో బి గ్రేడ్ సొసైటీల్లో ఓట్ల సంఖ్య కుదేలైనట్లే కన్పిస్తోంది. ఈ సంఘాలు మొత్తం 412 ఉంటే వాటిలో 172 సంఘాలకు మాత్రమే ఓటు హక్కు ఉందని అధికారులు తేల్చారు. అయితే ఈ వ్యవహారంలోనూ అధికార పార్టీ రాజకీయం నడిచిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిఫాల్ట్ అయిన సొసైటీలకు ఓటుహక్కు ఉండదని అధికారులు తేల్చిచెప్పటంతో ఈ పరిణామం ఎవరికి అనుకూలంగా మారుతుందన్నది చర్చనీయాంశంగా మారిపోయింది. వాస్తవానికి బి గ్రేడ్ సొసైటీల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి ఆధిక్యం లభించినట్లు ముందునుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు అధికభాగం సొసైటీలకు ఓటుహక్కు లేకుండా పోవటం అధికారపార్టీ రాజకీయమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం ఎలాఉన్నా దానివల్ల ఫలితాలు ఏమేరకు మారిపోతాయి, అవి చివరకు డిసిసిబి పీఠంపై ప్రభావం చూపుతాయా అన్న అంచనాల్లో ప్రధానపక్షాలు నిమగ్నమయ్యాయి. ఈ చర్చలు జరుగుతుండగానే మరోవైపు అధికారపార్టీ శిబిరం చీలిందన్న ప్రచారం జిల్లాలో విస్తృతంగా సాగిపోతోంది. అధికారపార్టీకి సంబంధించి పరిణామాలను పరిశీలిస్తే తొలినుంచి డిసిసిబి పీఠంపై కనే్నసి చేతిచమురు వదిలించుకున్న నాయకులు అనేకమంది ఉన్నారు. అయితే డిసిసిబి ఛైర్మన్ అభ్యర్ధిగా ఇంతకుముందే ముత్యాల వెంకటేశ్వరరావును ప్రకటించటం తెల్సిందే. అప్పటినుంచి కాంగ్రెస్‌కు అలవాటుగా ఉన్న అసంతృప్తి గుంభనంగా కొనసాగిందని చెపుతున్నారు. ఎన్నికల తరుణం దగ్గరపడిన సమయంలో ఈ అసంతృప్తి ఇప్పుడు వెలుగుచూసి చీలిక దిశగా అధికారపార్టీ శిబిరాన్ని పరుగులు తీయించిందని ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు ఛైర్మన్ అభ్యర్ధిత్వాన్ని ఆశించి భంగపడిన కొంతమంది అభ్యర్ధులు తాజా పరిస్ధితుల్లో ఇతర పార్టీల వైపు మొగ్గిపోయేందుకు సిద్ధమయ్యారని ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే మూడు పార్టీల వద్ద పూర్తి ఆధిక్యం లేకుండానే డిసిసిబి పీఠం తమదేనని ధీమాగా ప్రచారం చేసుకోవటం గమనార్హం. ఈ సమయంలో కోవర్టుల వ్యవహారం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్నది వేచి చూడాలి. అయితే ఈ పరిణామాల పట్ల అధికార పార్టీ నేతలు కూడా పూర్తి అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్దితుల్లోనూ అధికారపార్టీ శిబిరం బీటలు వారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెపుతున్నారు. అసంతృప్తితో ఉన్న నేతలతో ఇప్పటికే లోపాయికారీగా చర్చలు జరిపి వారిని శాంతింపచేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇతర పార్టీల ధీమాను చూస్తే మాత్రం ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయన్నది అనుమానాస్పదమే. ఇదేసమయంలో వైఎస్సార్‌సిపి సహకార ఎన్నికల్లో నామమాత్రంగానే మిగలటం మరో ఇబ్బందికరమైన పరిణామంగా మారిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, ప్రచారాలను పరిశీలిస్తే ఒకవేళ వైఎస్సార్‌సిపి తన ఉనికిని కాపాడుకోకుండా వదిలివేస్తే ఆ బలం సుమారుగా అధికారపార్టీకి దరి చేరుతుందని చెపుతుండగా ఎట్టిపరిస్దితుల్లోను డిసిసిబి పీఠం తమదేనని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించి దానికి తగ్గట్టు ప్రయత్నాలు కూడా చేస్తోంది. దీంతో ఆ పరిస్దితి లేదనే భావించాల్సి ఉంటుంది. మరోవైపు వైఎస్సార్‌సిపికి అధికారపార్టీ నుంచి వలసలు జరిగితే ఆ ప్రభావం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోతుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఏవిధమైన పరిణామం చోటుచేసుకుంటుంది, ఏవిధంగా ఇవి రూపుదిద్దుకుంటాయి అన్నది 18న జరగనున్న డైరెక్టర్ల ఎన్నికల్లో దాదాపు స్పష్టమవుతుందని భావిస్తున్నారు.
ద్వారకాతిరుమలకు పెళ్లి కళ
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల పెళ్లి జనాలతో బుధవారం కళకళలాడింది. మాఘమాసంలో ఈ నెల 15 వరకూ మూడు రోజులపాటు శుభముహూర్తాలున్నాయి. ఈ నెల 20 నుండి శుక్రవౌడ్యమి కారణంగా మరో మూడు నెలలపాటు మంచి ముహూర్తాలు లేక పోవడంతో క్షేత్రంలో పెళ్లి రద్దీ ఏర్పడింది. వివాహాలు, ఉపనయనాలు చేసుకునేందుకు వచ్చిన వారితో ఆలయ, క్షేత్ర పరిసరాలు కిక్కిరిశాయి. ఉదయం ఆలయ ఆవరణలో వివాహాది, ఉపనయన కార్యక్రమాలు జరిగాయి. రాత్రి ముహూర్తానికి వివాహాలు మరింత ఎక్కువగా జరిగాయి. కాగా గురువారం ఇంతకు రెండితలు వివాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. రేవతి నక్షత్రం పంచమి తిధి కావడంతో గురువారం అధిక సంఖ్యలో వివాహాలు జరుగనున్నట్లు పండితులు చెబుతున్నారు. అదే రోజు ప్రేమికుల దినోత్సవం కావడం యాదృచ్ఛికమే అయినా ప్రేమ వివాహాలు సైతం ఎక్కువగా జరుగుతాయని భావిస్తున్నారు.
ఎండిపోయిన ప్రధాన డ్రెయిన్లు!
-ఉండి కాలువకు మరింత తగ్గిన నీరు
ఉండి, ఫిబ్రవరి 13: గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రధానమైన డ్రెయిన్లలో నీరులేకపోవటం పట్ల రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ నీరు అధికంగా ఉండే యండగండి మీడియం డ్రెయిన్ నీరులేక దిబ్బలు తేలిపోయాయి. మండలంలో నీటి విడుదల చాలడం లేదని చెరుకువాడ రైతులు మంగళవారం ఉండిలో పెద్దయెత్తున ధర్నా చేశారు. మంగళవారం ఉండి కాలువకు 792 క్యూసెక్కుల నీరు విడుదలైతే బుధవారం నాటికి మరో 50 క్యూసెక్కుల నీరు అధికారులు తగ్గించి తమ తడాఖా చూపించారు. ఉండి కాలువకు ఉండి అక్విడెక్టు వద్ద 4.5 అడుగుల ఎఫ్‌ఎస్‌ఎల్ ఉంటే తప్ప దిగువ చేలకు నీరు అందదు. అయితే ప్రస్తుతం 4.0 అడుగులు ఉండటంతో ఎగువ తూరలు మూసి బాగా నెరలు తీసిన దిగువ చేలకు నీరు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కనీసం వెయ్యి క్యూసెక్కుల నీరు ఉండి కాలువకు అందిస్తే తప్ప రబీసాగు గట్టెక్కదని రైతులు అంటున్నారు. వంతుల వారీ విధానం కూడా ఒక పద్ధతి లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఉండి కాలువకు ఎన్నిరోజులు, వెంకయ్య వయ్యేరుకు ఎన్ని రోజులు అన్న విషయం అధికారులు అధికారికంగా ప్రకటించకపోవటం వలన రైతులు తమకు ఎన్నిరోజులు నీరు వస్తుందో తెలియని స్థితి. ఉన్నతాధికారులు కనీసం కార్యాలయంలో ఉండటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
బిల్లు చెల్లించకపోయినా సరఫరా ఆపవద్దు
వేసవిలో మంచినీటి పథకాలకు విద్యుత్‌పై కలెక్టర్ ఆదేశం
ఏలూరు, ఫిబ్రవరి 13 : జిల్లాలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వచ్చే వేసవిలో కరెంటు బిల్లులు చెల్లించకపోయినా మంచినీటి పథకాలకు విద్యుత్తు సరఫరా నిరంతరం కొనసాగించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ జి వాణీమోహన్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై మండల ప్రత్యేకాధికారులు, ఎంపిడివోలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్తు బకాయిలు ఎక్కువగా ఉండడం వల్ల అనేక పంచాయితీలకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నారని, పలువురు అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని అయితే ప్రజలకు సమృద్ధిగా తాగునీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా కరెంటు బిల్లులు చెల్లించని పంచాయితీలకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తే ప్రజలకు తాగునీరు అందించడం సాధ్యంకాదని అందువల్ల మంచినీటి పధకాలకు సంబంధించి ఎక్కడా కూడా విద్యుత్తు సరఫరా నిలిపివేయవద్దని సూచించారు. జిల్లాలో వీధిలైట్లకు సంబంధించి కోట్లాది రూపాయల బిల్లులు బకాయిలు పేరుకుపోయాయని, కావున పల్లెల్లో, మున్సిపల్ ప్రాంతాలలో వీధి దీపాల లైటింగ్ విధానాన్ని పరిశీలించి అవసరం మేరకే వీధి దీపాలు వెలిగేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వచ్చే వేసవి సీజన్‌లో జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి లేకుండా పక్కా ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వచ్చే వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు 30 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, వేసవి మూడు నెలలకు సంబంధించి మైనర్ గ్రామ పంచాయితీలకు 1.5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయితీలకు మూడు లక్షల రూపాయలు చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని అధికార్లను కలెక్టరు ఆదేశించారు. జిల్లాలోని 880 గ్రామ పంచాయితీలలో తాగునీటి వనరులకు సంబంధించి మరమ్మతులు, పైపులైను, తదితర పనులకు సంబంధించి ప్రతిపాదనలను వెంటనే సంబంధిత ఎంపిడివోలకు సమర్పించాలన్నారు. కాలువలు మూసివేసే సమయానికి తాగునీటి చెరువులను పూర్తిస్థాయిలో నీటితో నింపుకోవాలన్నారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసిన సమయంలో సంబంధిత గ్రామ పారిశుద్ధ్య కమిటీ ద్వారా ధృవీకరించుకోవాలన్నారు. మండల పరిధిలో తాగునీటి బోర్ల విడి పరికరాలు, మోటార్లను ముందస్తు జాగ్రత్తగా మండల కేంద్రాలలో సిద్ధంగా ఉంచుకోవాలని, బోర్లు, మోటార్లు మరమ్మతుకు గురైనప్పుడు వెంటనే మరమ్మతులు చేయించడం, స్పేర్ మోటారును అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కొత్తగా మంచినీటి బోర్లు ఏర్పాటు, బోర్ల ఫ్లషింగ్‌లపై ఈ నెల 18వ తేదీలోగా ప్రతిపాదనలు సమర్పించి, పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికార్లను కలెక్టరు ఆదేశించారు. మండల పరిధిలో అత్యవసర సమయంలో సేవలు వినియోగించుకునేందుకు గాను బోర్ల మెకానిక్‌లను గుర్తించి వారి ఫోన్ నెంబరు వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జిల్లాలో సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా నిర్మల్ భారత్ అభయాన్ కార్యక్రమంలో మంజూరు చేసిన వ్యక్తిగత మరుగుదొడ్లను వెంటనే పూర్తి చేయాలని, మిగిలిన లక్ష్యాలను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో ఎక్కడా అపారిశుద్ధ్య పరిస్థితులు లేకుండా ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని, నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డులు సాధించిన గ్రామాలలో పారిశుద్ధ్య పరిస్థితులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
వరుడి కాళ్లపై మచ్చలున్నాయని నిలిచిపోయిన పెళ్లి!
భీమవరం, ఫిబ్రవరి 13: కాలి తొడపై మచ్చ ఉంటే రాజయోగం పడుతుందనే సరదా కథనంతో మూడు దశాబ్దాలనాడు వచ్చిన లేడీస్ టైలర్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే నిజజీవితంలో పెళ్లికొడుకు కాళ్లపై మచ్చలు పెళ్లి నిలిచిపోవడానికి కారణమయ్యాయి. భీమవరంలోని గునుపూడి ఉమాసోమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... భీమవరం రూరల్ మండలం ఎల్‌విఎన్ పురం గ్రామానికి చెందిన యువకుడికి, పెనుగొండ మండలం నడిపూడి గ్రామానికి చెందిన యువతితో వివాహం కుదిరింది. బుధవారం రాత్రి 9.03 గంటలకు గునుపూడి ఆలయంలో వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. బుధవారం రాత్రి వివాహ తంతు ప్రారంభమైన అనంతరం కాళ్లు కడిగే సీను మొదలయ్యింది. ఆ సమయంలో పెళ్లికొడుకు ఫ్యాంటు పైకి లేపినపుడు కాళ్లపై మచ్చలున్నట్టు పెళ్లికుమార్తె బంధువులు గమనించారు. వెంటనే పెళ్లికొడుకుకు ఏదో వ్యాధి ఉందంటూ వివాహతంతు నిలిపివేశారు. వ్యాధిని దాచిపెట్టి వివాహం కుదుర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే తమ కుమారుడు ఉపాధి నిమిత్తం డెహ్రాడూన్ వెళ్లాడని, అక్కడ వాతావరణం సరిపడక మచ్చలు వచ్చాయని, కావాలంటే వైద్యులతో పరీక్ష చేయించుకోవాలని పెళ్లికుమారుడి తల్లిదండ్రులు కోరారు. అయినా పెళ్లికుమార్తె తరపువారు పెళ్లికి ససేమిరా అనడంతో వివాహం నిలిచిపోయింది. రాత్రి వరకు ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
పశువులకు అంతుచిక్కని వ్యాధి!
-మరణాలతో రైతుల్లో ఆందోళన
పెదవేగి, ఫిబ్రవరి 13 : అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత పడడంతో పాడిపరిశ్రమ రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలో బాపిరాజుగూడెంలో 15 రోజుల్లో సుమారు 30 గేదెల వరకు మృత్యువాత పడ్డాయి. 40 వేల నుండి 70 వేలు చేసే గేదెలు చనిపోవడంతో పాడిపైనే జీవనాధారంగా ఉన్న రైతులు గగ్గోలు పెడుతున్నారు. గేదెలకు ఇటీవల కాలంలో కంతేటి వ్యాధి సోకుతుందని దీనివల్ల ఆరోగ్యంగా కనిపించే గేదెలే చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న వైద్య అధికారి సరిగ్గా అందుబాటులో ఉండటం లేదని ఎప్పుడు చూసినా ఆసుపత్రి తాళాలు వేసి ఉంటున్నాయని స్థానిక రైతులు అక్కినేని వెంకటకృష్ణ, చల్లగోళ్ల శ్రీరామమూర్తి, బి సుబ్బారావు, ఎం సుభాష్‌చంద్రబోస్‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడైనా వైద్య అధికారులు అందుబాటులో ఉండి వైద్యం అందిస్తే కొంత వరకు మేలు జరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు.
ఆక్వారంగానికి సహకారం కరవు
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడం, ఫిబ్రవరి 13: ఆహార అవసరాలు, ఉపాధికల్పనలో గణనీయ పాత్ర పోషిస్తూ దేశప్రగతిలో ఆక్వా రంగం కీలక పాత్రను పోషిస్తున్నా, ప్రభుత్వం నుండి సరైన సహకారం లభించడంలేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. పెంటపాడు డిఆర్ గోయంకా కళాశాలలో ఆక్వారంగంపై బుధవారం సదస్సు జరిగింది. ఈ సదస్సుకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జి ముత్యాలరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీనియర్ సైంటిస్టు కె వరప్రసాద్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 12 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు జరుగుతున్నాయని తెలిపారు. 15 వేల ఎకరాల్లో జరుగుతున్న ఈ ఉత్పత్తులతో రూ.800 కోట్ల ఆదాయం లభిస్తోందన్నారు. ఇటీవల ప్రాచుర్యం పొందిన రూప్‌చంద్ చేపలపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే, ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని రైతులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి 7.5 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు, ఇతర ఉత్పత్తులు ఎగమతి అవుతున్నాయన్నారు. అనేక సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఆక్వాపై అనేక పరిశోధనలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ డిఇ బాబు, బాదంపూడి మత్స్య అభివృద్ధి అధికారి వి కృష్ణారావు, వీరభద్రరావు, ఎ శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎం వసంతలక్ష్మి, బి చక్రవర్తి, మాధవశర్మ తదితరులు పాల్గొన్నారు.
ఐటిడిఎ ముట్టడి
పోడు భూములకు పట్టాలివ్వాలని గిరిజనుల డిమాండు
బుట్టాయగూడెం, ఫిబ్రవరి 13: పోడు భూములకు పట్టాలివ్వాల్సిన అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టి, వేధింపులకు గురి చేస్తున్నందుకు నిరసనగా కెఆర్ పురం ఐటిడిఎ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, వ్యవసాయ, కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఏజన్సీ మూడు మండలాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు బుధవారం ఐటిడిఎ వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సీతారాం మాట్లాడుతూ పోడుభూముల క్లయిమ్‌లను పరిశీలించి, గిరిజనులకు పట్టాలివ్వాల్సిన అధికారులు ఏకపక్షంగా వందలాది క్లయిమ్‌లను తిరస్కరించడాన్ని ప్రశ్నించారు. 2006 సంవత్సరానికి ముందు నుండి సాగుచేస్తున్న అటవీభూముల సర్వే చేపట్టడంలేదని ఆన్నారు. 1/70 చట్టం ప్రకారం గిరిజనులకు చెందాల్సిన భూముల సమగ్ర పరిశీలన చేపట్టాలని డిమాండ్ చేసారు. 15రోజుల్లో సమస్యలపై ఐటిడిఎ పిఒ దృష్టి సారించకపోతే మరోసారి ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ, కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి నెలటూరి మోహన్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎంఎం సుందరబాబు, ఉపాధ్యక్షుడు ఎ.ఫ్రాన్సిస్, పోలోజు నాగేశ్వరరావు, రాజమండ్రి దానియేలు, కొమరం బాబూరావు, తామా సీతయ్య నాయకత్వం వహించారు.
విద్యాప్రణాళికకు చుక్కాని మదింపు పరీక్షలు
నల్లజర్ల, ఫిబ్రవరి 13: రాబోయే విద్యా సంవత్సరంలో కార్యాచరణ రూపకల్పన చేసి గుణాత్మక విద్యనందించడానికి ఈ మదింపు పరీక్షలు దోహదపడతాయని ఆర్‌విఎం రాష్ట్ర పరిశీలకులు ఎ జయప్రకాశరావు అన్నారు. జిల్లావ్యాప్తంగా 48 ఉన్నత పాఠశాలల్లో 46 పాఠశాలల్లో 6,7,8 తరగతుల విద్యార్థులు 15,543 మంది ఈ పరీక్షలు రాస్తున్నట్టు వివరించారు. మంగళవారం 1 నుంచి 5 తరగతుల వరకు 96 పాఠశాలల్లో 20,254 మంది పరీక్షలు రాసినట్టు తెలిపారు. 2 ఉర్దూ పాఠశాలల్లో 201 మంది పాల్గొన్నారన్నారు. అనంతపల్లి జడ్పీ హైస్కూల్‌లో జరుగుతున్న మదింపు పరీక్షలను జయప్రకాశరావుతోపాటు ఎఎంఒ సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. వీరితోపాటు ఎంఇఒ ఎన్ రాజేంద్రప్రసాద్, హెచ్‌ఎం రత్నరాజు పాల్గొన్నారు.
రైసుమిల్లు కార్మికులకు నూతన వేతన ఒప్పందం
ఏలూరు, ఫిబ్రవరి 13 : రైసుమిల్లు కార్మికులకు 28 శాతం కూలీ రేట్ల పెంపుదలతో నూతన వేతన ఒప్పందం చేసినట్లు ఏలూరు డివిజన్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ నాయకులు పల్నాటి సూర్యప్రకాశరావు, బి సోమయ్య, బైరెడ్డి లక్ష్మణరావు, పి కిషోర్ తెలిపారు. కూలీ రేట్లు, వేతనాలు 28 శాతం పెంపుదల, నైట్ కూలీ 66.33 శాతం అదనంగానూ, పిఎఫ్, ఇఎస్‌ఐ మిల్లులో పనిచేసే కార్మికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా అందరికీ వర్తింపు, సంవత్సరానికి రెండున్నర నెలల జీతం బోనస్ తదితర ఒప్పందాలు ఇరువర్గాల మధ్య కుదిరాయని వారు తెలిపారు.