విశాఖపట్నం (క్రైం), ఫిబ్రవరి 13: అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను ఓ కిరాతకునికి కట్టబెట్టాం. కన్న బిడ్డను చేచేతులా చంపుకొన్నాం. కన్న బిడ్డనే కాదు.. ఆమె కడుపులో పెరుగుతున్న ఐదు నెలల పసికందును కూడా హతమార్చిన వాడికి యావజ్జీవ శిక్ష కాదు.. ఉరి శిక్ష విధించాలని కృష్ణవేణి తల్లి కన్నీటిపర్యంతమైంది. 2011 మార్చి నాలుగో తేదీన మద్దిలపాలెం పిఠాపురం కాలనీ రోడ్డులో కృష్ణవేణిని ఆమె భర్త రవికుమార్ కత్తితో గొంతు కోసి హతమార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఈ ఘటనపై తీవ్రంగా నిరసన తెలియచేశాయి. ఈ కేసు అనేక మలుపులు తిరిగి చివరకు హంతకుడు రవికుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే కృష్ణవేణి తల్లి వేణు కోర్టు పరిసరాల్లోనే రోదించింది. రవికుమార్‌కు పడిన శిక్ష చాలదని, అతనికి ఉరి శిక్ష విధించాలంటూ ఏడ్చింది. తన కుమార్తె కృష్ణవేణి హత్యకు గురైనప్పుడు కుమార్తె కడుపులో ఐదు నెలల బిడ్డ ఉందని, కుమార్తె, ఆమెతో పాటు బిడ్డను కూడ హతమార్చిన నరహంతకునికి ఉరిశిక్ష వేయాలని, దీనిపై తాను హైకోర్టుకు, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించనున్నట్టు స్పష్టం చేశారు. హత్య విషయంలో పోలీసులు సక్రమంగా కేసు నమోదు చేశారని, అయితే నిందితులకు ఈ శిక్ష సరిపోదని హతురాలు తల్లి వేణు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగస్టు 29న కృష్ణవేణికి రవికుమార్‌తో వివాహం జరిగిందని, పెళ్లి సమయంలో కట్నకానుకలు, ఇతర లాంచనాలను అందజేశామని, అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుండి అదనపు కట్నం కోసం అల్లుడు కుమార్తెను వేధించేవాడని ఆమె తెలిపారు. తాము ఉంటున్న ఇంట్లోని సగభాగాన్ని తన పేరున రాయమని రవికుమార్, అతని తల్లిదండ్రులు, ఆడపడుచులు వేధించేవారని అన్నారు. దీంతో హత్య జరిగిన నెల రోజుల ముందు కృష్ణవేణి, తమ వద్దకు వచ్చేసిందని, దీనిపై కక్ష పెట్టుకున్న రవికుమార్ దారుణంగా తన కుమార్తె ప్రాణాలను హరించాడని ఆమె బోరుమన్నారు.
తాము రెండేళ్ళు కాళ్లు అరిగేలా కోర్టు చుట్టూ తిరిగామని, అయితే వచ్చిన తీర్పు తమకు సంతృప్తిగా లేదని కృష్ణవేణి మేనమామ సిహెచ్.నారాయణరావు అన్నారు. ఈ తరహా కేసును కోర్టు ప్రత్యేకంగా తీసుకుని సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. నిందితుడు 14ఏళ్ళు జైలు శిక్షను అనుభవించి మరల నేరం చేసే అవకాశం ఉంటుందని, కాబట్టి ఈ తరహ హంతకులకు ఉరిశిక్ష వేయాలని ఆయన కోరారు.
24 నెలలు సాగిన విచారణ
ఈ హత్య కేసు విచారణ సుమారు 24 నెలలపాటు సాగింది. ఈ కేసు విచారణ ఎనిమిది నెలల ముందే ముగిసిపోవలసింది. అయితే నిందితుడు రవికుమార్ ఈ కేసును వేరే కోర్టుకు మార్చమని హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో, దానిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టింది. చివరకు ఈ కేసును విశాఖ కోర్టులోనే విచారించాల్సి వచ్చింది. ఈ కేసులో 20 మంది సాక్ష్యులను విచారించారు. రవికుమార్‌పై నేరం రుజువు కావడంతో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.
రసకందాయంలో డిసిసిబి ఎన్నిక
* కెజె పురం సొసైటీ డిఫాల్ట్‌పై తొలగని ఉత్కంఠ
* ధర్మాశ్రీకి ఓటు హక్కు లేకుంటే ప్రత్యామ్నాయం?
* కోర్టుకు వెళతారా?
* డైరక్టర్ల ఎన్నికకు నోటిఫికేషన్ నేడు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 13: డిసిసిబి ఎన్నికలు మంచి రసకందాయంలో పడింది. జిల్లాలోని 11 నుంచి 15 ఎ క్లాస్ సొసైటీలు, అలాగే 12 వరకూ బి క్లాస్ సొసైటీలు డిఫాల్ట్ అయ్యాయి. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సొసైటీలను డిఫాల్ట్ చేస్తే, ఎన్నికల్లో రాజకీయంగా విభేదాలు తలత్తే అవకాశం ఉంది. కొన్ని చోట్ల శాంతి భద్రతల సమస్య కూడా ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిసిసిబి డైరక్టర్ల ఎన్నికకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ముఖ్యంగా కెజె పురం సొసైటీ డిఫాల్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ సొసైటీ నుంచి ఎన్నికైన ధర్మశ్రీ, డిసిసిబి చైర్మన్ రేసులో ఉన్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే కన్నబాబు రాజు కుమారుడు కుమార వర్మ కూడా పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య రాజకీయంగా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో కెజె పురం సొసైటీ డిఫాల్ట్ జాబితాలో చేరిందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇది రాష్టవ్య్రాప్త నిర్ణయం అని కొందరు అంటున్నారు. ఒకవేళ సొసైటీ డిఫాల్ట్ అయితే, అందులో నెగ్గిన వారికి ఓటు హక్కు ఉండదు. ఆ విధంగానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతోందని తెలిసింది. అలా అయితే ధర్మశ్రీకి ఓటు ఉండకపోవచ్చు. అందుకే ఆ శిబిరం నుంచి మరో వ్యక్తిని రేసులోకి దించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ధర్మశ్రీ తన పంతం నెగ్గించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కెజె పురం సొసైటీ డిఫాల్ట్‌పై గురువారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీన్నిబట్టి ధర్మశ్రీ శిబిరం భవిష్యత్ కార్యాచరణను చేపట్టబోతోంది. ఓటర్ల జాబితా కోసం బుధవారం రాత్రి డిసిసిబి కార్యాలయానికి వెళ్లినప్పుడు ఆ జాబితా ఇచ్చేందుకు అధికారులు ముందుకు రాకపోవడంతో వీరి మధ్య వాగ్వాదం జరిగినట్టుతెలిసింది. మరోపక్క ఎలాగైనా ఈ ఎన్నికలో విజయం సాధించేందుకు కన్నబాబు కూడా విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. ప్రత్యర్థుల మద్దతు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎ, బి క్లాస్ సొసైటీలు సుమారు 27 వరకూ రద్దయితే, డిసిసిబి ఎన్నికను జరగనిస్తారా? ఇప్పటికే గుంటూరు జిల్లా సహకార బ్యాంక్ ఎన్నికను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తూ, హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే దారిలో విశాఖ జిల్లా నాయకులు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సస్పెన్షన్ ఉత్తర్వులపై
కోర్టును ఆశ్రయించనున్న సిఐ?
విశాఖపట్నం(క్రైం), ఫిబ్రవరి 13: నగర పోలీసు కమిషనర్ బి.శివధరరెడ్డి జారీ చేసిన సస్పెన్సన్ ఉత్తర్వులను పెందుర్తి సిఐ రాజశేఖర్ ఇప్పటి వరకు అందుకోలేదు. తనను అనవసరంగా సస్పెన్షన్‌కు గురి చేశారని, దీనిపై వాస్తవాలు తెలియజేయడానికి ఆయన కోర్టును ఆశ్రయించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తన దగ్గరకు వచ్చిన రెండు భూ వివాదాలపైనా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసినప్పటికీ తనను సస్పెండ్ చేయటం అన్యాయమనే భావనలో ఆయన ఉన్నట్టు సమాచారం. పెందుర్తి పరిధిలోని సింహపురి లే ఆవుట్‌లోని సర్వే నెంబర్ 164/1లోని భూ వివాదం, అదే విధంగా పెందుర్తి పరిధిలో రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ స్థల వివాదంపైనా ఉన్నతాధికారుల సూచనల మేరకే ఆయన కేసులు నమోదు చేశారు. వీటిపైనే కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. భూతగాదాలు పరిష్కంచబడవని, కోర్టులో పరిష్కరించుకోవాలని పెందుర్తి పోలీసు స్టేషన్‌లో ఇప్పటికే సిఐ రాజశేఖర్ బోర్టులు ఏర్పాటు చేసిన తరుణంలో ఆయన సస్పెన్షన్‌కు గురి కావడం గమనార్హం.
కెసి ఆర్‌ను అరెస్టు చేయాలి: లగడపాటి
విశాలాక్షినగర్, ఫిబ్రవరి 13 : రాష్ట్ర ప్రజలను కించపరిచే విధంగా పరుష పద జాలంతో మాట్లాడుతున్న టి ఆర్ ఎస్ అధినేత కెసి ఆర్‌ను వెంటనే అరెస్టు చేయాలని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం డాబాగార్డెన్స్ విజె ఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో సమైక్యాంధ్ర ప్రజా పోరాట సమితి అధ్యక్షుడు జి. ఎ.నారాయణరావు ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ ఏర్పాటు వాదుల ప్రసంగాలు, విధ్వంసకాండ వీడియో సీడీలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు వాదుల వలన రాష్ట్రం అన్ని రంగాల్లోను వెనుకబడి పోతుందని ఆవేదన వ్యక్త పర్చారు. ఒకే రాష్ట్రంలో బ్రతుకుతున్న ప్రజలను ప్రాంతాల వారీగా విడదీసి ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్న టి ఆర్ ఎస్ నాయకుల్ని శిక్షించవలసిన అవసరం ఏర్పడిందన్నారు. సీమాంధ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా ప్రసంగాలు చేస్తున్న కెసి ఆర్, కోదండరామ్‌లను ప్రజలు క్షమించరన్నారు. ఏర్పాటు వాదుల సూచనల మేరకే రాష్ట్రంలో పలు విధ్వంసాలు జరిగాయని, వీటిని పరిగణలోనికి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయాలని కోరారు. తెలంగాణ వాధుల విధ్వంసకాండ, అరాచకాలు చూసి భయపడుతున్న ప్రజలు, రాజకీయ పార్టీలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పడానికి భయపడుతున్నారని చెప్పారు. సీమాంధ్ర ప్రజలను కేసి ఆర్ రాక్షసులుగా, పిశాచాలుగా వర్ణించడాన్ని తగదన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు వాదులు నుంచి భయం తొలగించే విధంగా సమైక్యాంధ్ర వాదులు కృషి చేయాలని కోరారు. అనంతరం సీడీలను ఆవిష్కరించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర ప్రజా పోరాట సమితి నగర అధ్యక్షుడు కె.విశే్వశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు కేదారలక్ష్మి, ప్రతినిధులు ఎం. ఎ.రసూల్, గొల్లకోట వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో నిర్దేశించిన కార్యక్రమాలు పూర్తి చేయండి
కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ
సాగర్‌నగర్, ఫిబ్రవరి 13 : క్లీన్ విశాఖ - గ్రీన్ విశాఖ కార్యక్రమం ద్వారా చెత్త రహిత నగరంగా తీర్చి దాద్దడానికి అందరు అధికారులు సకాలంలో నిర్దేశించిన కార్యక్రమాలు పూర్తి చేయాలని జివి ఎంసి కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. ఓల్డ్ కౌన్సిల్ హాలులో బుధవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరు అధికారులు నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. సమావేశానికి మున్సిపల్ పరిపాలన సంయుక్త సంచాలకులు ఎస్. ఏఖదర, ఎడిసిలు కె.రమేష్, పూర్ణచంద్రరావు, సి ఎం ఓ హెచ్ డాక్టర్ పి.వి.రమణమూర్తి చీఫ్ ఇంజనీర్ బి.జయరామిరెడ్డి జోనల్ కమిషనర్లు ఎన్.శివాజీ సాయి శ్రీకాంత్, విజయలక్ష్మి, బి.సన్యాసినాయుడు, చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.బాలకృష్ణ, డి.డి. యు. ఎన్. ఎ.పాత్రుడు, డి ఇ ఒ లక్ష్మి నరస, ఇ ఇలు క్రిష్ణారావు, కోటేశ్వరరావు, ఎ ఎం హెచ్ ఒలు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ రామ్మోహనరావు, కన్సల్టెంట్ నరేష్ భండారి తదితరులు హాజరైరి.
సమైక్య ఢిల్లీబాట పోస్టర్ ఆవిష్కరణ
* ఏకాభిప్రాయంతో కొత్త రాష్ట్రాలకు కాంగ్రెస్ యోచన
విశాలాక్షినగర్, ఫిబ్రవరి 13: ఏకాభిప్రాయంతోనే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి స్పష్టం చేశారు. బుధవారం జైల్‌రోడ్డు కూడలిలో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఢిల్లీ బాట ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి సమైక్య ఢిల్లీబాటను చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఢిల్లీకి వచ్చే విద్యార్థి జెఎసి బృందాన్ని కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారని పేర్కొన్నారు. 1969, 72 ఆంధ్ర, తెలంగాణ ఉద్యమాలు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం కుదరదని ప్రాంతీయ ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని పార్లమెంట్‌లో ఇందిరాగాంధీ ప్రకటించారని గుర్తు చేశారు. జాతీయ సమైక్యతను రాహుల్‌గాంధీ కూడా ఆచరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. అనంతరం సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర చైర్మన్ ఆరేటి మహేష్ మాట్లాడుతూ ఈ నెల 25న చేపట్టే సమైక్య ఢిల్లీ బాట ప్రధాన ఉద్దేశం పొలవరం, ప్రాణహిత-చేవెళ్ళ జాతీయ హోదా కల్పించాలని, కెజి బేసిన్ ఆంధ్రుల హక్కు కనుక 25 శాతం నిధులు రాష్ట్భ్రావృద్ధికి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి డిమాండ్ చేస్తామన్నారు. అదే విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి జాతీయ నిధులు కేటాయించాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ముందుగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సుమంత్, రాష్ట్ర జాయింట్ కన్వీనర్ అట్టాడ అవినాష్, సమైక్యాంధ్ర ప్రజాపోరాట సమితి అధ్యక్షుడు జివి నారాయణరావు, బిసి నాయకుడు పితాన ఫ్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీ డి.ఇ.ఒ.పై కలెక్టర్ మళ్లీ ఆగ్రహం
* మెమో జారీకి ఆదేశం
పాడేరు, ఫిబ్రవరి 13: విశాఖ ఏజెన్సీ డి.ఇ.ఒ.పై కలెక్టర్ వి.శేషాద్రి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీ డి.ఇ.ఒ. సలీం ఆహ్మాద్‌ఖాన్‌కు మెమో జారీ చేయాలని ఆదేశించారు. ఏజెన్సీ డి.ఇ.ఒ. సలీం ఆహ్మాద్‌ఖాన్ కలెక్టర్ ఆగ్రహానికి గురై ఇటీవల ఒకసారి సస్పెన్షన్ వేటు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. రెండు సార్లు మెమోలను మాత్రం అందుకున్నట్టయింది. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ బుధవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఏజెన్సీ డి.ఇ.ఒ. డుమ్మా కొట్టడం ఆయన ఆగ్రహానికి దారితీసింది. దీంతో డి.ఇ.ఒ.కు మెమో జారీచేసి సంజాయషీ కోరాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇదిలాఉండగా కలెక్టర్ ఇటీవల అనంతగిరి మండలంలో పర్యటించినప్పుడు పాఠశాలల పనితీరు సక్రమంగా లేని విషయం బయటపడింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులను కలెక్డర్ సస్పెండ్ చేశారు. పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించాల్సిన ఏజెన్సీ డి.ఇ.ఒ. తన బాధ్యతలను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వలనే ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టగలుగుతున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతగిరి మండలంలో కలెక్టర్ పర్యటించిన సందర్భంగా ఏజెన్సీ డి.ఇ.ఒ. పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన శేషాద్రి వారం రోజుల క్రితమే మెమో జారీ చేసినట్టు తెలుస్తోంది. వారంరోజులు గడవక ముందే మరోసారి ఏజెన్సీ డి.ఇ.ఒ. సలీం ఆహ్మాద్‌ఖాన్ మరోసారి మెమో అందుకోనుండడం అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఇదిలాఉండగా కలెక్టర్‌గా శేషాద్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాడేరు సందర్శించి స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏజెన్సీ డి.ఇ.ఒ. హాజరు కాకపోవడంతో అప్పటిలోనే ఆయనపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండోసారి కలెక్టర్ నిర్వహించిన సమావేశానికి ఏజెన్సీ డి.ఇ.ఒ. హాజరైనప్పటికీ అర్థంలేని సమాధానాలు చెప్పడంతో సలీం ఆహ్మాద్‌ఖాన్‌ను సస్పెండ్ చేయాలని అప్పటి ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి శ్రీకాంత్ ప్రభాకర్‌ను ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఏజెన్సీ డి.ఇ.ఒ. సలీం ఆహ్మాద్‌ఖాన్ తన పరిస్థితిని కలెక్టర్‌కు వివరించి సస్పెన్షన్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరడంతో చల్లబడిన కలెక్టర్ ఈ నిర్ణయాన్ని అప్పటిలో ఉపసంహరించుకున్నారు. కలెక్టర్ పర్యటనలో ఏజెన్సీ డి.ఇ.ఒ. పనితీరు ఎప్పటికప్పుడు లోపభూయిష్టంగా కనిపిస్తుండడంతో ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమోల జారీకి దారితీస్తోంది.
ఉపాధి పనుల కూలి సకాలంలో చెల్లించాలి
* జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి
జి.మాడుగుల, ఫిబ్రవరి 13: ఉపాధి పనుల కూలి సొమ్ము చెల్లించడంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి అధికారులను ఆదేశించారు. మండలంలోని జి.ఎం. కొత్తూరు, జనే్నరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, జనే్నరు గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రావి టీ పథకం పనితీరును మంగళవారం ఆయన పరిశీలించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొలం పనులు చేసుకుంటున్న గిరిజనులతో ఆయన మాట్లాడారు. పనికి సరిపడా కూలి సొమ్ము సకాలంలో అందుతున్నదీ లేనిది, జాబ్‌కార్డు లేని వారు ఎవరైనా గ్రామంలో ఉన్నారా? అని కూలీలను కలెక్టర్ ప్రశ్నించారు. రోజుకు 110 రూపాయల చొప్పున కూలి సొమ్ము చెల్లిస్తున్నారని, గ్రామంలో అందరికీ జాబ్ కార్డులు ఉన్నాయని కూలీలు చెప్పడంతో ఉపాధి పనుల తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జి.ఎం.కొత్తూరు అంగన్‌వాడి కేంద్రంలో అమృతహస్తం పనితీరును సి.డి.పి.ఒ. బాలచంద్రని అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు మధ్యాహ్న భోజనం, బాలింతలకు పౌష్టికాహారం తదితర విషయాలపై ఆయన ఆరా తీశా రు. గర్భిణులకు పౌష్టికాహారం అందించడంలో అలసత్వం ప్రదర్శించరాదని ఆయన చెప్పారు.
అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రసూతి, జనరల్ వార్డులు, డ్రగ్‌రూం, ల్యాబ్‌లను పరిశీలించారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన రేడియంట్ హీట్‌వార్మర్‌ను శేషాద్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పి.డి. సత్యసాయి శ్రీనివాస్, పా డేరు ఆర్.డి.ఒ. గణపతిరావు, ఐ.టి.డి.ఎ. ఎ.పి.ఒ. పి.వి.ఎస్. నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.మల్లిఖార్జునరెడ్డి, ఆర్.డబ్ల్యు.ఎస్. డి.ఇ. నర్సింహరావు, తహశీల్థార్ రవీంద్రరావు, ఎం.పి.డి.ఒ. పూర్ణయ్య, పాల్గొన్నారు.
ఆంధ్రాబ్యాంక్‌లో స్తంభించిన లావాదేవీలు
* ఖాతాదారుల ఇబ్బందులు
చోడవరం, ఫిబ్రవరి 13: స్థానిక ఆంధ్రాబ్యాంక్ బ్రాంచి కార్యాలయంలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా గత రెండు రోజులుగా బ్యాంక్ లావాదేవీలు స్తంభించిపోయాయి. బిఎస్‌ఎన్‌ఎల్ ఆన్‌లైన్ విధానంలో సాంకేతిక లోపాలు చోటుచేసుకోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ఖాతాదారులు లావాదేవీలు నిర్వహించుకోలేక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రధానంగా ఈనెల 15వ తేదీవరకు ముమ్మర పెళ్లిళ్ళ సీజన్ కావడంతో సుముహూర్తాలు పెట్టుకుని సరకులు కొనుగోలుకు అవసరమైన డబ్బును తమ అకౌంట్ల నుండి తీసుకునేందుకు దూరప్రాంతాల నుండి బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులకు బ్యాంక్‌లో కంప్యూటర్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానిక డిగ్రీ కళాశాలకు చెందిన 80మంది విద్యార్థులు ఉపకార వేతనాలు బ్యాంకు నుండి తీసుకునేందుకు మంగళవారం, బుధవారం బ్యాంకుకు వచ్చి బిక్కమొహం వేసుకుని తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి సంభవించింది. తరచూ ఇటువంటి సాంకేతిక లోపాలు బ్యాంకులో తలెత్తడం వలన దూరప్రాంతాల నుండి వస్తున్న ఖాతాదారులు ఇక్కట్లకు గురికావాల్సి వస్తుందని పలువురు వ్యాఖ్యానించారు.
అటవీ భూముల సర్వేకు ప్రత్యేక ఏర్పాట్లు
* ఆర్డీవో గణపతిరావు
పాడేరు, ఫిబ్రవరి 13: విశాఖ మన్యంలో అటవీ భూములను వేగవంతంగా సర్వే చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చే యాలని పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.గణపతిరావు ఆదేశించా రు. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఏజెన్సీలోని తహశీల్ధార్లు, రెవెన్యూ సిబ్బందితో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ భూముల సర్వేకు ప్రతి మండలానికి పది మంది వంతున లైసెన్స్‌డ్ సర్వేలను నియమించాలన్నా రు. ఈ సర్వేయర్ల ద్వారా మండలాల్లో రెండు, మూడు రోజులలోగా అటవీ భూముల సర్వేను సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆయన చెప్పారు. జి.పి.ఎస్. విధానం ద్వారా సర్వేను నిర్వహించాలని, ముందుగా పెదబయలు, గూడెంకొత్తవీధి మండలాల్లో చేపట్టి, మిగిలిన మండలాల్లో తరువాత నిర్వహించాలని ఆయన సూచించారు. అటవీ హక్కుల చట్టం కింద ఏజెన్సీలోని 102 గ్రామాలకు చెందిన మూడు వేల ఎభై మంది లబ్ధిదారుల క్లెయిమ్‌లను పరిష్కరించి 4,710 ఎకరాల అటవీ భూమిని గుర్తించినట్టు ఆయన చెప్పారు. ఏజెన్సీలోని మిగిలిపోయిన 71 గ్రామాలలోని 1800 క్లెయిమ్‌లను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అటవీ భూముల సర్వేలో తహశీల్ధార్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని గణపతిరావు సూచించారు. ఈ సమావేశంలో ఏజెన్సీలోని అన్ని మండలాల తహశీల్ధార్లు, రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు పాల్గొన్నారు.
‘ఇందిర జలప్రభ’లో పండ్ల తోటల పెంపకం
* జిల్లా కలెక్టర్ శేషాద్రి
హుకుంపేట, ఫిబ్రవరి 13: ఇందిర జలప్రభ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకంలో మందడుగు వేయాలని గిరిజనులను కోరారు. మండలం ఉర్రాడ గ్రామంలో ఇందిర జలప్రభ ద్వారా చేపడుతున్న మామిడి మొక్కల పెంపకాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. మామిడి మొక్కల పెంపకంతో రైతులకు చేకూరుతున్న లబ్ధిని గురించి అధికారులు అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. మొక్కలు నాటిన నుండి అందవల్సిన నిధులు రైతులకు సక్రమంగా అందేటట్టు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఉర్రాడ, అల్లంపుట్టు గ్రామాలలో సుమారు 36 ఎకరాల్లో 18 మంది రైతులు మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టారని, ఎరువులు, పనిముట్లను సాధ్యమైనంత త్వరలో రైతులకు అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డుమా పి.డి. సత్యసాయి శ్రీనివాస్, ఆర్.డి.ఒ. గణపతిరావు, ప్రత్యేక అధికారి ప్రసాద్, తహశీల్థార్ పాడిపంతులు, కాఫీ సబ్ అసిస్టెంట్ అప్పలనాయుడు, అధికారులు పాల్గొన్నారు.