Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన పొంగులేటి

$
0
0

ఖమ్మం, ఫిబ్రవరి 13:జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోచేరారు. కల్లూరు మండలం నారాయణపురానికి చెందిన ఆయన ఇప్పటి వరకు వ్యాపారవేత్తగా, సంఘ సేవకుడిగా ఉన్నారు. బుధవారం ఉదయమే సుమారు 100కి పైగా వాహనాల్లో హైదరాబాద్ చేరుకొని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, రాష్ట్ర నాయకులు వైవి సుబ్బారెడ్డిల సమక్షంలో పార్టీలో చేరారు. కాగా జిల్లా నుంచి వర్గాలకతీతంగా అన్ని నియోజకవర్గాల్లోని ప్రధాన నాయకులతో పాటు జిల్లా కన్వీనర్, రాష్ట్ర, కేంద్రకమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం విశేషం. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధన కోసం జరిగే ఉద్యమంలో పాలుపంచుకోవటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పదవులను ఆశించకుండా కేవలం వైఎస్ ఆశయాలను సాధించేందుకే తాను ఈ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళటమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ఇటీవల తాను జగన్‌ను కలిసి కూడా అదే విషయాన్ని చెప్పానని, తనకు పదవులు ముఖ్యం కాదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జగన్‌పై కక్షసాధిం ధోరణిని విడనాడాలన్నారు. ప్రజల మద్దతుతో జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని, దానిని ఎవరూ ఆపలేరని వెల్లడించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయటం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా జరపాలి
* అధికారులతో కలెక్టర్ సిద్ధార్థ జైన్
ఆంధ్రభూమిబ్యూరో
ఖమ్మం, ఫిబ్రవరి 13: ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను జిల్లాలో సజావుగా జరిపేందుకు అధికారులు తోడ్పాటునందించాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ప్రెసిడెంట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, సహాయక ప్రిసైడింగ్ అధికారులకు జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికకు సంబంధించి జిల్లాలో ఓటర్లు 6వేల మంది మాత్రమే ఉన్నారన్నారు. ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికలు నిర్వహించే రోజుకు ముందే అధికారులు పూర్తి అవగాహన పొందారన్నారు. భారత ఎన్నికల సంఘం ప్రచురించిన మాన్యువల్ ఆధారంగా నిబంధనలు అతిక్రమించకుండా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎన్నికల సంఘం నిర్వహించిన సమయానికి ప్రారంభించి, ముగించాలన్నారు. అంతేగాకుండా పోలింగ్ స్టేషన్లలో ఉన్న అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు రహస్య బ్యాలెట్‌గురించి ముందుగానే వివరించాలన్నారు. ఓటింగ్ సమయం ముగిసే నాటికి వరుసలో ఉన్న ఓటర్లందరికీ నిబంధనల మేరకు ఓటు హక్కును కల్పించాలన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జయచందర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా 47పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బ్యాలెట్ బాక్స్‌ల విధానంలో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నామని, దీనిపై అధికారులకు శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ట్రైని కలెక్టర్ హరి నారాయణ, ఆర్డీవోలు వాసం వెంకటేశ్వర్లు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

వారిద్దరు అదృష్టవంతులు

ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఫిబ్రవరి 13: డిసిసిబి, డిసిఎంఎస్ ఎన్నికల్లో ఇరువురు అభ్యర్థులకు అదృష్టం కలిసి వస్తోంది. ఎటువంటి పోటీ లేకుండా వారిద్దరు డైరెక్టర్లుగా ఎన్నిక కానున్నారు. ఆశ్చర్యకరంగా వారిద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. అందులో కారేపల్లి సొసైటీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన మీసాల నాగేశ్వరరావుతో పాటు కొర్లగూడెం సొసైటీ నుంచి కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన తలారి రాణి ఉన్నారు. వీరిద్దరు డిసిసిబి, డిసిఎంఎస్‌లలో డైరెక్టర్లుగా పదవులు దక్కించుకోనున్నారు. జిల్లాలో 107 సహకార సంఘాలుండగా 104 సంఘాలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఐదు సంఘాలకు బకాయిలు ఉన్నందున వాటికి ఓటు హక్కు లేదు. ఇందులో వీరంతా కలిసి 16మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అందులో ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, బిసిలకు 2, ఇతరులకు 10కేటాయించారు. ఎస్టీ అభ్యర్థులుగా గెలిచిన వారిలో చింతూరు సొసైటీ అధ్యక్షుడు కుర్సపు కోటేశ్వరరావు, కారేపల్లి సొసైటీ అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ మాత్రమే ఉన్నారు. ఇందులో సొసైటీ బాకీ ఉన్న ఫలితంగా చింతూరు సొసైటీకి ఓటు హక్కు ఉండదు. దీంతో మీసాల సత్యనారాయణ నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ స్థానంలో మూడు డైరెక్టర్ పోస్టులు రిజర్వ్ కాగా, జిల్లాలో ఒకరు మాత్రమే ఎస్సీ అభ్యర్థి ఉండటం విశేషం. ఈ స్థానానికి కొర్లగూడెం నుంచి కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన తలారి రాణి నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇదే తరహాలో డిసిఎంఎస్‌లో కూడా వీరిద్దరే పదవులు పొందనున్నారు. కాగా ఈ రెండు స్థానాలకు తోడు మరో రెండు స్థానాలను కో ఆప్షన్ ద్వారా ఎన్నుకోనుండటంతో అవి కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశమే. డిసిసిబి, డిసిఎంఎస్‌లలో ఎన్నిక జరగకముందే నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. దీంతో మొత్తం 16స్థానాలకు గాను 4స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళనున్నాయి. కాగా 16డైరెక్టర్లలో నాలుగు కాంగ్రెస్ గెలుచుకుంటే మిగిలిన 12లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటే చైర్మన్, వైస్ చైర్మన్లను గెలుచుకునే అవకాశం ఉంటుందని టిడిపి నేతలు భావిస్తున్నారు.

ఎవరి భయం వారిదే
* పశ్చిమగోదావరికి చేరిన టిడిపి శిబిరం
* హైదరాబాద్ దాటిన కాంగ్రెస్ శిబిరం

ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఫిబ్రవరి 13: డిసిసిబి, డిసిఎంఎస్‌ల ఎన్నిక తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీల్లోనూ భయం పట్టుకుంది. తమ మద్దతుతో గెలిచిన డైరెక్టర్లు చివరి వరకు తమతో ఉంటారా లేదా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. అందులో భాగంగానే ఆయా పార్టీల నాయకులు తమ మద్దతుతో గెలిచిన వారిని క్యాంపులకు తరలించినప్పటికీ ఫోన్ ద్వారా రాయబారాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు హైదరాబాద్ సమీపంలో ఉన్న కాంగ్రెస్ శిబిరం నేడు మరో రహస్య ప్రదేశానికి మారింది. అలాగే కొణిజర్ల మండలం తనికెళ్ళ వద్ద ఉన్న విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న తెలుగుదేశం శిబిరాన్ని బుధవారానికి పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టాయిగూడెం వద్దకు మార్చారు. ఇది ఖమ్మం జిల్లా దమ్మపేట మండలానికి సరిహద్దు గ్రామం. ఈ శిబిరంలోనే టిడిపి తరుపున గెలిచిన 47మందితో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ శిబిరంలో కూడా పార్టీ మద్దతుతో గెలిచిన 23మందితో పాటు మరో ఆరుగురు ఇతర పార్టీలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. టిడిపి తరుపున ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరావుల ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహిస్తున్నారు. అయితే డిసిసిబికి సంబంధించి నాయకుల మధ్య ఉన్న విభేదాలను తొలగించి అందరినీ ఒక్క తాటిపైకి తీసుకరావటంతో పాటు పార్టీ సూచించిన అభ్యర్థిని గెలిపించాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఇదే తరహాలో కాంగ్రెస్ సైతం రాష్ట్ర ఉద్యానవన శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో క్యాంపును నిర్వహిస్తున్నారు. వీరు ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన ఆరుగురిని తమ పార్టీలోకి చేర్చుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావటంతో నాయకుల మధ్య ఉన్న విభేదాలను తొలగించి ఐక్యంగా అభ్యర్థిని నిలపటంతో పాటు ఇతర పార్టీల మద్దతుతో గెలిపించుకోవాలని ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అలాగే వామపక్ష పార్టీల మద్దతు గెలిచిన వారు సైతం ఇతర పార్టీల అభ్యర్థులకు రహస్యంగానైనా మద్దతు ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఆ పార్టీ నాయకులు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక వైఎస్‌ఆర్‌సిపి తరుపున విజయం సాధించిన 12మందిలో అధికులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ నాయకులు తామెవ్వరికి మద్దతునివ్వమని చెప్తున్నా కిందిస్థాయి నాయకుల్లో ఆ పరిస్థితి లేకపోవటం గమనార్హం.
ప్రధానంగా కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొనగా గత నాలుగు రోజులుగా టిడిపికి చెందిన ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు సహకార సంఘాల ఎన్నికల గురించి పట్టించుకోవటం లేదని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. గత మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సహకార సంఘాల అధ్యక్షుల సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదని, ఎన్నికలు అయిన మరుసటి రోజు నుంచి డిసిసిబి, డిసిఎంఎస్ డైరెక్టర్ల ఎన్నికపై శ్రద్ధచూపటం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. నాయకుల మధ్య ఉన్న స్వల్ప విభేదాలను తొలగించటంతో పాటు పార్టీ అభివృద్ధిని గెలిపించుకునేందుకు ఇరువురు ప్రధాన నాయకులు కృషి చేయాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో సైతం అదే పరిస్థితి నెలకొంది. మంత్రి సోదరుడు గోపాల్‌రెడ్డిని గెలిపించుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా తమకు నష్టమని భట్టి వర్గీయులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా అన్ని పార్టీలు తమ డైరెక్టర్లను కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుండగా ఇతర పార్టీల నేతలు మాత్రం ఏదో ఒక రూపంలో తమకు మద్దతునిచ్చేలా ప్రత్యర్థి పార్టీల డైరెక్టర్లతో మంతనాలు కూడా జరుపుతున్నారు.

సొసైటీల పాలకవర్గ
ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఖానాపురం హవేలి, ఫిబ్రవరి 13: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ పాలకవర్గ ఎన్నికల అధికారి కె రామకృష్ణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, అదే రోజు సాయంత్రం నామినేషన్లు పరిశీలిస్తారని, 16వ తేదీన ఉదయం 10గంటల నుంచి 5గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 18వ తేదీన ఉదయం 7గంటల నుంచి 2గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం 19వ తేదీన డిసిసిబి అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు డిసిసిబి కార్యాలయంలో, డిసిఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు డిసిఎంఎస్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా 19వ తేదీన పాలకమండలిలో భర్తీ కాని స్థానాలకు కో ఆప్షన్ ద్వారా ఎన్నిక జరుపుతారు. అదే రోజు ఫలితాలను కూడా ప్రకటిస్తారు. కాగా సహకార సంఘం అధ్యక్షుల్లో ఎవరైనా డిసిసిబి, డిసిఎంఎస్‌లలో డైరెక్టర్లుగా పోటీ చేయవచ్చని, అయితే వారు డిఫాల్టర్ కాకుండా ఉండాల్సి ఉంటుందని ఎన్నికల అధికారి రామకృష్ణ వెల్లడించారు. కాగా ఎన్నికలు జరిగే రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

సింగరేణి అంతర్గత నియామకాల్లో
రాష్టప్రతి ఉత్తర్వులు అమలుచేయాలి
రుద్రంపూర్, ఫిబ్రవరి 13: సింగరేణి ఎన్‌సిడబ్ల్యూఎ నుండి ఎగ్జిక్యూటివ్ ఇ-1క్యాడర్ పోస్టుల అంతర్గత నియామకాల్లో రాష్టప్రతి ఉత్తర్వులను కచ్చితంగా అమలుచేయాలని సింగరేణి జాక్, గుర్తింపుసంఘమైన టిబిజికెఎస్ నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం జూనియర్ మైనింగ్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ తదితర 108పోస్టుల అంతర్గత ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తులను కోరుతూ యాజమాన్యం ప్రకటన చేసింది. అయితే జారీచేసిన సర్క్యూలర్‌లో రాష్టప్రతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ ప్రాంతంవారికి 60శాతం ఉద్యోగాలు కల్పించాల్సివుండగా సింగరేణి యాజమాన్యం రాష్టప్రతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక రిజర్వేషన్‌ను పాటించకుండా నిబంధనలను తుంగలోతొక్కి నియామకాలను ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని వారు హెచ్చరించారు. సింగరేణిలో ఆంధ్ర ఆదిపత్య దోరణిని, తెలంగాణ అణిచివేత విధానాలను సింగరేణి జాక్, గుర్తింపు సంఘమైన టిబిజికెఎస్‌లు తీవ్రంగా ప్రతిఘటిస్తాయని హెచ్చరించారు. యాజమాన్యం రాష్టప్రతి ఉత్తర్వులను కచ్చితంగా అమలుచేయాలని డి మాండ్ చేశారు. ఈ సమావేశంలో టిబిజికెఎస్, జాక్ నాయకులు డాక్టర్ శంకర్‌నాయక్, నరేంద్రబాబు, పి శరభలింగం, కనకరాజు, ఎస్‌కె గౌస్ పాల్గొన్నారు.

మీ సేవ కేంద్రాల ద్వారానే
జనన, మరణ ధ్రువీకరణపత్రాలు
ఖానాపురం హవేలి, ఫిబ్రవరి 13: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీ, 12 గ్రామ పంచాయతీల్లో మీసేవకేంద్రాల ద్వారా జనన, మరణ, ధృవీకరణపత్రాలను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు జెసి ఎంఎం నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీసేవ కార్యక్రమాన్ని విస్తరించటంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఖానాపురం హవేలిలోని రికార్డులను కూడా మీ సేవ పోర్టల్‌లోకి ఎక్కించినట్లు తెలిపారు. ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, సత్తుపల్లి మున్సిపాలిటీలతో పాటు మేజర్ గ్రామ పంచాయతీలైన మధిర, వైరా, పెద్దతండా, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, కల్లూరు, గార్ల, బయ్యారం, సారపాక, బూర్గంపాడులలో మీసేవ కేంద్రాల ద్వారా జనన, మరణ ధృవీకరణపత్రాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రికార్డులను కంప్యూటరీకరించినట్లు వెల్లడించారు. రికార్డుల్లో నమోదైన వివరాలను 15నిమిషాల్లోగా దరఖాస్తు దారుకు అందచేయాలని అధికారులకు ఆదేశించారు. రికార్డులు లేని వారికి కూడా త్వరగా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని డాక్టర్ భానుప్రకాశ్‌ను ఆదేశించారు. సమావేశంలో ఖమ్మం కమిషనర్ శ్రీనివాస్, జిల్లా ఇన్ఫర్మేషన్ సెంటర్ అధికారి శ్రీనివాస్, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.

శారదాలో స్పార్క్ స 2కె13
ఖానాపురం హవేలి, ఫిబ్రవరి 13: స్థానిక శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఈ నెల 21, 22వ తేదీల్లో స్పార్క్స్ 2కె13 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల చైర్మన్, కోశాధికారి రేఖల భాస్కర్, గుర్రం తిరుమలరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులను ఉత్తేజితులను చేయాలనే లక్ష్యంతోనే ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్పార్క్స్ నేషనల్ లెవల్ టెక్నోఫెస్ట్ 2కె13లో విద్యార్థులకు పేపర్ ప్రెజంటేషన్, పోస్టర్ ప్రెజంటేషన్, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్, షార్ట్ఫిల్మ్, ల్యాన్‌గేమ్ తదితర అంశాలతో పాటు గ్రూప్‌డ్యాన్స్, ఫ్యాషన్ షో, డిస్కో, జాకీ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనాలనుకున్న విద్యార్థులు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ స్పార్క్స్2కె13.సిట్స్.ఏసి.ఇన్ వెబ్‌సైట్‌లో తమ ఎంట్రీలు నమోదు చేసుకోవాలని సూచించారు. గత నాలుగు సంవత్సరాలుగా తమ కళాశాల స్పార్క్స్ అనే పేరుతో జాతీయ స్థాయి టెక్నికల్‌ఫెస్ట్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. తొలుత కార్యక్రమ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. విలేఖరుల సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కెవి నర్సింహారావు, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోచేరారు.
english title: 
ys

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>