Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

డిసిసిబి ఎన్నికపై నాలుగు వారాలపాటు హైకోర్టు స్టే!

$
0
0

గుంటూరు, ఫిబ్రవరి 13: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) ఎన్నికలపై నాలుగువారాలపాటు స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికలు నిలచిపోయిన సంతగుడిపాడు సొసైటీకి చెందిన చింతగుంట అంజిరెడ్డి, అచ్చుల శ్రీనివాసరావు అనే సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. తమ సొసైటీకి ఎన్నికలు నిలిపివేయడంతో తాము డిసిసిబి ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోయామని, అందువల్ల తమ సొసైటీకి ఎన్నికలు జరపకుండా డిసిసిబి ఎన్నికలు జరపడానికి వీల్లేదంటూ వీరు హైకోర్టును ఆశ్రయించారు. సంతగుడిపాడు సొసైటీ ఎన్నికలను నిలిపివేస్తూ గతంలో ప్రభుత్వం స్టే ఇచ్చింది. దీంతో నాలుగువారాలు డిసిసిబి ఎన్నికలపై స్టే విధిస్తూ రెండువారాల్లో కౌంటర్ దాఖలుచేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పిటిషన్ వేయించి డిసిసిబి ఎన్నికలపై స్టే తేగలిగింది. ఎన్నికలు నిలచిపోయిన 12 సొసైటీల్లో 8వరకు టిడిపికి చెందినవి ఉన్నాయని, స్టే గడువు ముగిసేలోపు వాటికి కూడా ఎన్నికలు నిర్వహిస్తే డిసిసిబి ఎన్నికల్లో తమ విజయానికి ఢోకా ఉండదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఎన్నిక పూర్తయిన నూతక్కి సొసైటీతో సహా ఎన్నికలు జరిగిన 156 సొసైటీల్లో టిడిపికి 64, కాంగ్రెస్‌కు 52, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 31మంది బలం ఉండగా, 9మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఇదిలావుండగా డిసిసిబి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం కుదరడం వల్లే తెలుగుదేశం పార్టీ స్టే కోసం వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. డిసిసిబి చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు, డిసిఎంఎస్ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అదేవిధంగా డిసిసిబి వైస్‌చైర్మన్ వైఎస్సార్ కాంగ్రెస్‌కు, డిసిఎంఎస్ వైస్‌చైర్మన్ కాంగ్రెస్‌కు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరితే వారి బలం 83కు చేరుతుంది. ప్రస్తుతం 156మందితో ఎన్నిక నిర్వహిస్తే విజయం సాధించడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 78కాగా, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లకు అయిదుఓట్లు అధికంగానే ఉన్నాయి. డిసిసిబి ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీకి దిగుతున్నామనే వైఎస్సార్ కాంగ్రెస్ నిన్నటివరకు చెబుతూ వచ్చింది. ఎన్నికల వ్యూహంలో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ అలా ప్రకటిస్తూ వచ్చింది. పోటీచేస్తున్నామని చెప్పకపోతే ఆ పార్టీ సభ్యులు జారిపోయే అవకాశముంది. ఈ పరిణామం కాంగ్రెస్-వైకాప ఉమ్మడి ప్రత్యర్థి టిడిపికి లాభించే అవకాశముంది. ఇదిలావుండగా డిసిసిబి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్-వైఎస్సార్ కాంగ్రెస్ రహస్య ఒప్పందాన్ని తెలుగుదేశం పార్టీ పసిగట్టింది. దీంతో నిలుపుదలచేసిన సొసైటీలకు ఎన్నికలు నిర్వహించనిదే డిసిసిబి ఎన్నిక నిర్వహించరాదంటూ వ్యూహాత్మకంగా తమవారితో కోర్టును ఆశ్రయించి ఎన్నిక నిలుపుదల చేయడంలో విజయం సాధించింది. ఈ పరిణామం కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లకు ఒకరకంగా ఎదురుదెబ్బే. ఎందుకంటే తమ పార్టీ సొసైటీ అధ్యక్షులను కాపాడుకునేందుకు ఆ పార్టీలు ఇప్పటికే కర్నూలు, నాగార్జునసాగర్‌లలో క్యాంపులు నిర్వహిస్తున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు క్యాంపు కొనసాగించాలా లేక సొసైటీ అధ్యక్షులను బయటకువదిలిపెట్టాలా అనే అంశంపై రెండుపార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటివరకు క్యాంపుపెట్టడానికే కాంగ్రెస్‌పార్టీ అష్టకష్టాలూ పడుతోంది. క్యాంపునకు వెళ్లేముందు నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యులందరితో ఇన్‌చార్జి మంత్రి టిజి వెంకటేష్ సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో క్యాంపు ఖర్చు ఎవరు భరించాలనే అంశంపై చర్చ వచ్చినప్పుడు జిల్లాకు చెందిన ఏ ఒక్కనాయకుడు ముందుకు రాలేదు. అప్పుడు గుంటూరుకు చెందిన ఓ ముఖ్యనేత 8లక్షలరూపాయలు ఇచ్చి క్యాంపునకు పంపించారు. ఇన్‌చార్జి మంత్రి టిజి వెంకటేష్ సొంత ప్రాంతమైన కర్నూలులో కాంగ్రెస్ క్యాంపు పెట్టడంతో ఆ ఎనిమిది లక్షలతో ఇప్పటివరకు ఎలాగోలా లాక్కొచ్చారు. క్యాంపు ఖర్చులు ప్రతిరోజూ తడిసి మోపెడవుతుండటంతో మరో నాలుగువారాలపాటు అక్కడ క్యాంపును కొనసాగించే పరిస్థితి లేదు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్‌లో క్యాంపు ఏర్పాటుచేసింది. వారి క్యాంపు ఖర్చును జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త భరిస్తూ వస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే ఆ పార్టీ సభ్యులను ప్రత్యర్థి పార్టీలు కొనుగోలుచేయడం గానీ, తమవైపునకు తిప్పుకోవడంగానీ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లు ఇప్పటివరకు తమ పార్టీ తరపున ఎవరు నిలబడతారనే విషయంలో స్పష్టతలేదు. అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే తప్ప డబ్బు ఖర్చుచేసి ప్రత్యర్థులకు వలవేసే పరిస్థితి ఆ రెండుపార్టీల్లో లేదు. తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా రేపల్లె మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకటసుబ్బయ్యను ఇప్పటికే ప్రకటించింది. టిడిపి క్యాంపునకు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నాయకత్వం వహిస్తున్నారు. తమ అభ్యర్థిని ముందుగానే ప్రకటించగా, ఎన్నికలు వాయిదాపడిన నేపథ్యంలో టిడిపి క్యాంపును ప్రస్తుతానికి ఎత్తివేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీ క్యాంపు ప్రస్తుతం విజయవాడ సమీపంలోని భవానీ ఐలాండ్‌లో కొనసాగుతోంది. మొత్తం డిసిసిబి ఎన్నికలపై స్టే రావడంతో జిల్లాలో ప్రధాన రాజకీయపక్షాలు వ్యూహ,ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.

జూన్ నాటికి పులిచింతల పూర్తి
* భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన రెడ్డి
అచ్చంపేట, ఫిబ్రవరి 13: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పనులు జూన్ నాటికి పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి పి సుదర్శనరెడ్డి చెప్పారు. పులిచింతల వద్ద ప్రాజెక్టు నిర్మాణం పనులను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టుఅధికారులతో పనుల నిర్మాణంపై సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే ఆరు క్రషర్ గేట్లను పూర్తిగా నిర్వహించటం జరిగిందని ఏప్రిల్ నెలాఖరునాటికి గేట్లు పనులు పూర్తి అవుతాయని చెప్పారు. ప్రాజెక్టువద్ద 120మెగావాట్ల విద్యత్ ప్రాజెక్కు పనులు వేగవంతంగా జరుగతున్నాయన్నారు. దీంతో పాటుగా నెట్టెంపాడు, కోయిలసాగర్ , బీమా, కల్వకుర్తి ప్రాజెక్టు పనులను కూడా జూన్‌నాటికి ప్రారంభమైయ్యేవిధంగా చేస్తున్నామన్నారు. ఈప్రాజెక్టు నిర్మాణం వల్ల రెండు లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం దక్కుతుందన్నారు. డెల్టా రైతు చిరకాల వాంఛయైన పులిచింతల ప్రాజెక్టు పనులను వేగవంతంచేసి వారి కలలనుసాకారం చేస్తామన్నారు. మంత్రివెంట గుత్తేదారులు శ్రీనివాస్, ప్రసాద్, సిఇ సాంబయ్య, రవికుమార్, వెంకటరావు తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ అవినీతితో
రాష్ట్రం అభివృద్ధిలో 20ఏళ్లు వెనక్కి
తెనాలి రూరల్, ఫిబ్రవరి 13: కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధిలో 20యేళ్ళు వెనక్కి వెళ్ళిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. జిల్లాలో 7వరోజు పాదయాత్రలో భాగంగా బుధవారం తెనాలి మండలం హాప్‌పేట, ఖాజీపేట, కొలకలూరు గ్రామాల్లో యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజలతో ఆయన మాట్లాడుతూ అవినీతి పాలకుల సంక్షేమ ఫలాలను సక్రమంగా అమలుచేయని కారణంగా ప్రజలుతీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 35యేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో వడుదుడుకులు ఎదుర్కున్నానని , తనపై పలుమార్లు కాంగ్రెస్ నాయకులు కోర్టులకువెళ్లినా తాను నిర్దోషిగానే నిలిచానన్నారు. గత రెండు సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యుల ఆస్తులనూ బహిర్గతం చేస్తున్నట్లు చెప్పారు. 9సంవత్సరాలుపాటు తనపాలనలో అనేక సమస్యలను పరిష్కరించి రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా తయారుచేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో పెరిగిన అవినీతి వల్ల సంక్షేమం కుంటుపడిందన్నారు. ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధిలో 20యేళ్ళ వెనక్కు వెళ్లిందన్నారు. పెట్టుబడులు తగ్గాయన్నారు. మహిళలకు మంచినీటికోసం బారులుతీసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తాను అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, విద్యార్థుల సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ముఖ్యంగా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మొదటినుండి తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని , అందులో భాగంగానే డ్వాక్రా గ్రూపులను ఏర్పాటుచేసి లక్షలాది మంది మహిళలకు చేయూత నిచ్చామన్నారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడంలో రాష్ట్రంలో ఘోరంగా విఫలమైందన్నారు. పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ సామాన్యులకు మనుగడ లేకుండా ఈప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. తనకు అధికారం ఇస్తే ఆరుమాసాల్లో గాడితప్పిన పాలనను సరిదిద్దుతామన్నారు. అంతకుముందు గుంటూరు నగరంలో మహిళలు ఎదుర్కొంటున్న మంచినీరు, పారిశుద్యం సమస్యలతోపాటుగా తక్కెళ్ళపాడు గ్రామంలోని పాఠశాలలకు అదనపు తరగతి గదులు నిర్మాణంకోసం జిల్లా కలెక్టర్‌కు లేఖరాస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉగ్రవాదం కంటే ప్రమాదంగా అవినీతి మారిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు, వేమూరు ఎమ్మెల్యేలు నరేంద్రకుమార్, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలాపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ రాజకుమారి, నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబుకు తెనాలి నియోజకవర్గం పార్టీ నాయకులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.

విద్యుత్ భారంపై ఐక్యపోరాటం
గుంటూరు, ఫిబ్రవరి 13: రాష్టవ్రిభజన రాజకీయ సుడిగుండంలో పడిన ప్రధాన రాజకీయపక్షాలు ప్రజల నడ్డివిరుస్తున్న విద్యుత్, తదితర సమస్యలపై స్పందించకపోవడం శోచనీయమని, ప్రజలకు వెసలుబాటు కలిగించేందుకు విద్యుత్ భారంపై అన్ని రాజకీయపార్టీలు ఐక్యపోరాటం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు పేర్కొన్నారు. ఏదేమైనా ప్రభుత్వం ఈ భారాన్ని వెంటనే ఉపసంహరించు కోకుంటే బడ్జెట్ సమావేశాల్లో అసెం బ్లీని దిగ్బంధం చేస్తామని హెచ్చరిం చారు. విద్యుత్ భారాలు- పరిష్కారమార్గాలు అనే అంశంపై బుధవారం స్థానిక బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన సదస్సులో రాఘవులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు జిల్లాకార్యదర్శి డి రమాదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ మాజీ సిఎం చంద్రబాబు హయాంలో 5వేలకోట్లరూపాయలు రుణం ఇచ్చిన ప్రపంచబ్యాంకు కొన్ని షరతులు విధించిందని అన్నారు. తామిచ్చిన రుణంతో విద్యుత్ సంస్థ పనితీరును మెరుగుపర్చుకొని తొలిఏడాది 30శాతం, తర్వాత ఏటా 15శాతం చొప్పున చార్జీలు పెంచాలనే ఒప్పందం చేసుకున్నారని, అది ప్రజలకు మోయలేని భారంగా మారిందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వందయూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ప్రజలపై భారాన్ని మోపడం లేదని చెబుతున్నా వాస్తవపరిస్థితులు ఇందు కు భిన్నంగా ఉన్నాయన్నారు. పేదలకు 50యూనిట్ల లోపు రూ.1.65 పైసలు, 50 నుంచి వంద యూనిట్లలోపు 2.45 రూపాయలు చార్జీలు విధిస్తున్నట్లు చెబుతున్నా సర్‌చార్జిలు,
మినిమమ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు, వడ్డీలతో కలుపుకుంటే పేదల విద్యుత్ వాడకానికి యూనిట్‌కు 10రూపాయలు పడుతోందని తెలిపారు. వందయూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారి బిల్లుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌చేశారు. చార్జీలను తగ్గించేవిధంగా ప్రభుత్వంపై వత్తిడితెచ్చేందుకు అన్ని రాజకీయపక్షాలు ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజలపై భారంమోపే విద్యుత్ చార్జీల పెంపును ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించకపోకపోతే రానున్న బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీని దిగ్బంధిస్తామని రాఘవులు హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు, ఎ.కోటిరెడ్డి, జెవి రాఘవులు, జొన్నా శివశంకర్, పి.నరసింహారావు, గద్దే చలమయ్య, ఎన్.్భవన్నారాయణ, ఎన్.కాళిదాసు, బి.ఆంజనేయరెడ్డి, ఆయా డివిజన్ల కార్యదర్శులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

భరతం పట్టాల్సింది మీరే...
* వస్తున్నా మీకోసం పాదయాత్రలో చంద్రబాబు
తెనాలి, ఫిబ్రవరి 13: పేదల సంక్షే మం సంక్షోభం అంచుకు చేరితే... అవినీతిని అగ్రభాగానికి చేర్చి ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని దోచేస్తున్నారని వారి భరతం పట్టా ల్సింది మీరేనని, ఆ సమయం దగ్గరలోనే ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు అన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర జిల్లాకేంద్రమైన గుంటూరులో 2000 కిలోమీటర్లు పూర్తిచేసుకుని, బుధవారం వెంకటకృష్ణాపురం మీదుగా, జాకీర్ హుసేన్ నగర్ కు చేరడంతో తెనాలి నియోజక వర్గంలో ప్రవేశించింది, ఈక్రమంలో క్రైస్తవ మత పెద్దలు జాకీర్ హుసేన్ నగర్‌లో చంద్రబాబుకు ప్రార్ధన చేసి ఆశీర్వచనాలిచ్చారు. అడుగడుగున ప్రజలకు అభివాదం చేసుకుంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, అలుపును మరచి, వెంట వచ్చే జిల్లా నాయకులు, గ్రామ నాయకులు, అభిమానులను ఉత్తేజపరస్తూ బాబు యాత్రనుకొనసాగించారు. జాకీర్ హుసేన్ నగర్, హాఫ్ పేట,ఖాజీపేటల మీదుగా రాత్రికి కొలకలూరు చేరుకున్నారు. ఈక్రమంలో మార్గ మధ్యంలో ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంకు తెలుగు దేశం పార్టీ ద్వారా చేపట్టె కార్యక్రమాలను మహిళలకు వివరించారు. బెల్టు షాపుల ఎత్తివేత, పెంచిన గ్యాస్ ధరలు తగ్గిస్తామని హామిలిచ్చారు. ఆయాగ్రామాల్లో పార్టీ శ్రేణులు సాదర స్వాగతాలు పలికారు. ఆయన వెంట పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కోడెల శివప్రసాద్, ఎమ్మెల్లెలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, తెనాలి నియోజక వర్గ ఇంచార్జి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, నియోజక వర్గంలోని ముఖ్యనాయకులు బాబు వెంట ఉన్నారు.

త్వరలో జిడిసిసిబి ద్వారా
ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం
గుంటూరు, ఫిబ్రవరి 13: జిల్లాలోని 33 సహకార బ్యాంకు బ్రాంచిలు కంప్యూటరీకరణ చేయడం పూర్తయిందని, త్వరలో జిడిసిసి బ్యాంకు ఆధ్వర్యంలో ఆన్‌లైన్ మనీట్రాన్స్‌ఫర్ సౌకర్యాన్ని బ్యాంకుచైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బుధవారం బ్రాడీపేటలోని బ్యాంకు కార్యాలయంలో హరిత డిపాజిట్ పథకాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం నల్లపాటి విలేఖరులతో మాట్లాడుతూ జిడిసిసి బ్యాంకు రిజర్వ్‌బ్యాంకు గుర్తింపు రావడానికి కృషిచేసిన బ్యాంకు డైరక్టర్లకు, అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు వందకోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 30కోట్లరూపాయలు సేకరించామని అన్నారు. హరిత డిపాజిట్ పథకాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విలేఖరుల సమావేశంలో బ్యాంకు వైస్‌చైర్మన్ అల్లు నరసింహారెడ్డి, డైరక్టర్లు రామిరెడ్డి, రామయ్య, లక్ష్మీనారాయణ, బ్యాంకు సిఇఓ బి.విశ్వనాథం, జిఎంలు మురళి, సుబ్బారెడ్డి, డిజిఎంలు భాను, ఫణి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల హృదయాల్లో చోటుకోసమే నా తపన
పెదకాకాని, ఫిబ్రవరి 13: ప్రజలు హృదయాల్లో నిలిచిపోవడం కోసమే తాను తపన పడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని ఉప్పలపాడు, వెంకటకృష్ణాపురం గ్రామాల్లో చంద్రబాబు పాదయాత్ర సాగింది. ఉప్పలపాడులో మహిళలు బాబుకు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా వారినుద్దేశించి మాట్లాడుతూ పేద ప్రజలు, రైతులకోసమే 63సంవత్సరాలు వచ్చినా, ఆరోగ్యం అనుకూలించక పోయినా పాదయాత్ర చేస్తున్నానని, యాత్ర తలపెట్టినప్పుడు రెండురోజుల్లో విరమించుకుంటారనుకున్నారు గానీ ఒకపని తలపెట్టినప్పుడు అది సాధించే వరకునిద్రపోనన్నారు. పరిపాలన పూర్తిగా గాడితప్పిందని, అవినీతి రాక్షస పాలనవల్ల పేదలు రైతులు బతికే పరిస్థితి లేదని అన్నారు. విద్యుత్ చార్జీలు, గ్యాస్, పెట్రోలు, నిత్యావసర ధరలు పెరగటంవల్ల పేద ప్రజలు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారన్నారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) ఎన్నికలపై నాలుగువారాలపాటు స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం
english title: 
d

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>