Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దైవానుగ్రహంతోనే అభివృద్ధి సాధించా

$
0
0

యానాం, ఫిబ్రవరి 13: తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈ పదిహేనేళ్లలో తాను చేసిన అభివృద్ధి అంతా దైవానుగ్రహంతోనేనని యానాం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అన్నారు. బుధవారం వేకువ జామున వేంకటేశ్వరస్వామి దర్శనానికి పాదయాత్ర ప్రారంభమైన సందర్భంగా వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన వందలాది మంది అనుయాయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గతంలో సింహాచలం పాదయాత్ర చేసి స్వామిని దర్శించుకున్నానని, ఆ తరువాత తాను తిరుపతి పాదయాత్ర చేయనున్నానని అప్పట్లోనే ప్రకటించానని, అయితే కొంత కాలయాపన జరిగినా ఇప్పటికీ పాదయాత్రకు వెళ్ళే అవకాశం సమకూరిందని 30 రోజుల పాటు తన సతీమణి ఉదయలక్ష్మితో కలిసి ఈ పాదయాత్ర చేస్తున్నానని, తనతో పాటు కొందరు మిత్రులు కూడా తనవంట కడ వరకు రానున్నారని ఆయన అన్నారు. తనకు తోడుగా వచ్చే వారందరికీ ఎటువంటి అకసౌకర్యం కలగకుండా ముందుగా ఏర్పాట్లు పూర్తిచేసామని, ఈ యాత్రతో స్వామి కృపతో తిరిగి వస్తానని ఆయన అన్నారు. అనంతరం మల్లాడి కృష్ణారావు ఉదయలక్ష్మి దంపతులతో పాటు యాత్రలో పాల్గొన్న వారందరికీ సుమారు 500 మంది వీడ్కోలు పలికారు.

‘డిసిసిబి రాజీ ’కీయం
* సర్ధుబాటులో కాంగ్రెస్ గ్రూపులు* ఫలించిన తులసిరెడ్డి ప్రయత్నాలు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఫిబ్రవరి 13: జిల్లా కాంగ్రెస్‌లోని కేంద్ర సహకారబ్యాంకు రాజకీయంలో తలెత్తిన విబేధాలు సర్ధుకుంటున్నాయి. డిసిసిబి చైర్మన్ అభ్యర్ధిగా వరుపుల రాజాను ఎంపికచేయటం పట్ల కాంగ్రెస్‌పార్టీలోని కొంత మంది ఎమ్మెల్యేలతో పాటు, ఎంపి హర్షకుమార్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిసిసిబి ఎన్నికల్లో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటుందని అంతా భావించిన నేపథ్యంలో 3రాజీ2కీయంతో కాంగ్రెస్ డిసిసిబి రాజకీయం కుదుటపడినట్టు తెలుస్తోంది. వరుపుల రాజా అభ్యర్ధిత్వాన్ని మార్చి, కోనసీమకు చెందిన అభ్యర్థికి అవకాశం ఇవ్వకపోతే తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీకి దింపాలని ఎంపి హర్షకుమార్ ఒకదశలో భావించిన సంగతి విదితమే. వరుపుల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు కొందరు ఈ విషయంలో ఎంపి హర్షకుమార్‌కు లోపాయికారి మద్దతును ప్రకటించటంతో కాంగ్రెస్ పార్టీ డిసిసిబి రాజకీయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో తూర్పుగోదావరి జిల్లాలోని పరిస్థితులను సమీక్షించిన పిసిసి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, 20సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డిని తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి ఎన్నికల పరిశీలకుడిగా పంపింది. పరిశీలకుడు తులసిరెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరపటంతో పాటు, వరుపుల అభ్యర్ధిత్వం పట్ల అసంతృప్తిని వ్యక్తంచేస్తున్న ఎంపి హర్షకుమార్‌తో పాటు ఇతర నాయకులతో కూడా చర్చించారు. కొన్ని ముఖ్యమైన పెళ్లిళ్లకు హాజరుకావాల్సిన అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ, జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న డిసిసిబి రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకుని, తన సొంత కార్యక్రమాలను రద్దుచేసుకున్న తులసిరెడ్డి జిల్లాలోనే మకాంచేసి జిల్లా కాంగ్రెస్‌లోని పరిస్థితులను చక్కదిద్దారు. దాంతో తీవ్ర గందరగోళంగా ఉన్న డిసిసిబి కాంగ్రెస్ రాజకీయం కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. అధిష్ఠానం భావించినట్టే డిసిసిబి చైర్మన్ అభ్యర్ధిగా వరుపుల రాజా, డిసిఎంఎస్ చైర్మన్ అభ్యర్ధిగా కెవి సత్యనారాయణరెడ్డి పేర్లను గురువారం అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకినాడలో పరిశీలకుడు తులసిరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇతర ముఖ్యనాయకులు విలేఖర్ల సమావేశానికి హాజరై, తామంతా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్న సంకేతాలను విలేఖర్ల సమావేశం ద్వారా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. డిసిసిబి, డిసిఎంఎస్ ఉపాధ్యక్ష పదవుల్లో ఒక ఉపాధ్యక్ష పదవిని ఎస్సీలకు, మరో ఉపాధ్యక్ష పదవిని కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం డైరక్టర్ పదవులకు నామినేషన్లు దాఖలుచేసే 21మంది పేర్లను కూడా దాదాపు ఖరారుచేసినట్టు తెలుస్తోంది. బలం ఉన్నాగానీ అంతర్గత కుమ్ములాటల కారణంగా డిసిసిబి, డిసిఎంఎస్ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే పరిస్థితి ఉందని అంతా భావిస్తున్న నేపథ్యంలో సర్ధుబాటు జరగటంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. చివరి వరకు తగువులాడుకున్నాగానీ, కాంగ్రెస్ మార్క్ సంప్రదాయంలో చివరకు అంతా ఐక్యతను ప్రదర్శించటం ఎన్నికల్లో ఎంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందో చూడాలి మరి.
వైభవంగా అతిరుద్రం
*మురమళ్లలో వేదఘోష *మంత్రోచ్ఛారణల మధ్య మహాయజ్ఞం ప్రారంభం
ఐ పోలవరం, ఫిబ్రవరి 13: అతిరుద్ర మహాయాగంలో ప్రధాన ఘట్టమైన మహాయజ్ఞం బుధవారం రాత్రి 9.15 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమైంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 180 మంది రుత్వికులు శాస్త్రోక్తంగా యాగశాలలోకి ప్రవేశించి వేద పారాయణతో అగ్నిమదన, అగ్ని స్థాపన, మంట పావహిత, దేవతారాధన, ప్రధాన దేవతా హోమాలను ప్రారంభించారు. నాలుగు రుద్ర విధానాలతో మహారుద్రయాగాన్ని నిర్వహిస్తున్నారు. రుద్రైకాదశి (11 రుద్రములు, ఒక చమకం), లఘురుద్రం (121 రుద్రములు, 11 చమకములు), మహారుద్రం (1,331 రుద్రములు, 121 చమకములు), చివరిగా అతిరుద్రం (14,641 రుద్రములు, 1,331 చమకము)లతో మహాయాగం నిర్వహిస్తే పరమేశ్వరుని అనుగ్రహం పొందుతామని యాగకర్త కేశాప్రగడ హరిహరనాథ శర్మ పేర్కొంటూ యాగాన్ని ప్రారంభించారు. తొలిరోజు సుమారు అయిదువేల మందికి పైగా భక్తులు అతిరుద్రయాగంలో పాల్గొన్నారు. అతిరుద్ర యాగానికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ముమ్మిడివరం సిఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ శివలింగం భక్తులను ఆకర్షించింది. తొలుత వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ మహాక్రతువును ప్రారంభించగా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డిసిసిబి, డిసిఎంఎస్
డైరెక్టర్ అభ్యర్థుల ఎంపిక పూర్తి
*హైదరాబాద్‌లో ఛైర్మన్ అభ్యర్థుల ప్రకటన
*పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి
కాకినాడ, ఫిబ్రవరి 13: డిసిసిబి, డిసిఎంఎస్ డైరెక్టరు పదవులకు అభ్యర్థుల ఎంపిక ఎంపిక పూర్తయ్యిందని, అధ్యక్ష అభ్యర్థుల పేర్లు హైదరాబాద్‌లో ప్రకటిస్తారని పిసిసి అధికార ప్రతినిధి, రాష్ట్ర 20 సూత్రాల అమలుకమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. డిసిసిబి, డిసిఎంఎస్ అభ్యర్థుల ఎంపికలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాల నేపథ్యంలో అధిష్ఠానం ఆదేశాల మేరకు మంగళవారం కాకినాడ వచ్చిన తులసిరెడ్డి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో చర్చించిన సంగతి విదితమే. ఛైర్మన్ అభ్యర్థులకు ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో భారాన్ని అధిష్ఠానంపై ఉంచాలని నిర్ణయించారు. ఈమేరకు బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. విలేఖర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, పిసిసి కార్యదర్శి పంతం నానాజీ, నగర అధ్యక్షుడు విలియం హ్యారీ, సిరియాల చంద్రరావు, బోణం భాస్కర్ ఆకుల వెంకటరమణ, జవ్వాద్ ఆలీ, ప్రశాంతి, జనిపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్ ఆవరణలో ఇ సేవ ఉద్యోగిని
ఆత్మాహుతియత్నం
రాజమండ్రి, ఫిబ్రవరి 13: రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోని పార్కులో ఇ సేవ కేంద్రంలో పనిచేసే ఆపరేటర్ బుధవారం రాత్రి ఆత్మాహుతియత్నం చేసింది. ఈసంఘటన ఇ సేవ కేంద్రం ఎదురుగా ఉన్న పార్కులో జరిగింది. స్థానిక అంబేద్కర్‌నగర్‌కు చెందిన గెంజెటి సుజాత(27) ఇ సేవ కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తోంది. స్థానిక సిసిసి చానల్‌లో తరుచూ వార్తలు కూడా చదువుతుంది. ఇ సేవ కేంద్రం ఉద్యోగులు గత కొద్దిరోజులుగా సమ్మెలో ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం వచ్చిన ఆమె తోటి ఉద్యోగులతో మాట్లాడి, పార్కులోకి వెళ్లింది. అక్కడ ఉన్న షెల్టర్ వద్ద తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ సీసాను ఒంటిపై కుమ్మరించుకుని నిప్పు అంటించుకుంది. మంటల బాధకు తాళలేక హాహాకారాలు చేయడంతో అక్కడే ఉన్న ఇ సేవ ఉద్యోగులు గమనించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. త్రీటౌన్ ఎస్‌ఐ పరమేశం తన సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి, ఒంటిపై వస్త్రాన్ని కప్పారు. వేడికి తాళలేక సుజాత తనను రక్షించాలని పెద్దగా కేకలు వేసింది. ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు 108కు సమాచారాన్ని అందించారు. అయితే అరగంట గడిచినా 108 రాకపోవడంతో చివరకు ట్రాలీ ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి వరకు ఆమె పడిన బాధ వర్ణనాతీతం. అంతకు ముందు మధ్యమండలం డిఎస్పీ నామగిరి బాబ్జి, త్రీటౌన్ సిఐ అక్కడికి చేరుకుని ఆమె గురించి ఆరా తీశారు. తన పేరు సుజాత అని, వ్యక్తిగత, ఆర్థిక కారణాల వల్లే ఈఘాతుకానికి పాల్పడినట్లు ఆమె తెలిపింది. ఈసంఘటనకు ఎవరూ కారణం కాదని చెప్పింది. తన దుస్థితిని తల్లికి తెలియజేయాలని ఫోన్ నెంబర్ చెప్పడంతో డిఎస్పీ ఈవిషయాన్ని ఆమె తల్లికి తెలియజేశారు. ఈసంఘటనలో 90శాతంకు పైగా కాలిపోయిన ఆమెను చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుజాత పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సుజాత ఆత్మాహుతికి పాల్పడిన విషయాన్ని మేజిస్ట్రేట్‌కు తెలియజేశామని, న్యాయమూర్తి ద్వారా వాంగ్మూలాన్ని స్వీకరిస్తామని డిఎస్పీ తెలిపారు. త్రీటౌన్ పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి బొడ్డు!
*నేడు జగన్‌తో మిలాకాత్ ఖరారు*రాజధానిలో ప్రకటనకు రంగం సిద్ధం
పెదపూడి, ఫిబ్రవరి 13: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు తెలియవచ్చింది. రాష్ట్ర రాజధానిలో గురువారం వైఎస్ జగన్‌తో మిలాకాత్ ఖరారు కావడం అక్కడే ఆ పార్టీ ప్రవేశానికి ముహుర్తం కూడా ఖరారైనట్లు ఆయన సన్నిహిత వర్గాలు వివరించాయి. గత కొంత కాలంగా జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భాస్కరరామారావుతో నిర్వహించిన చర్చల ఫలితంగా నేడు ఆ పార్టీలో చేరేందుకు బొడ్డు నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు వివరించాయి. గత మూడు రోజులుగా పెదపూడి మండలం పెద్దాడలో సాయిబాబా దేవాలయ ప్రతిష్టలు జరగడంతో ఆయన స్వగ్రామానికి పరిమితమయ్యారు. బుధవారం టిడిపి జిల్లా అధ్యక్షులు నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి, పిల్లి సత్యనారాయణమూర్తి తదితరులు భాస్కరరామారావుతో చర్చలు నిర్ణయించినప్పటకీ ఫలితం లేకుండా పోయిందన్నారు. అంతేకాకుండా జగన్ మిత్రుడు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి భాస్కరరామారావుతో స్వయంగా చర్చలు నిర్వహించడమే కాకుండా బుధవారం రాత్రి హైదరాబాద్‌కు కలిసి వెళ్ళిపోవడంతో టిడిపికి భాస్కరరామారావు గుడ్‌బై చెప్పడం ఖాయమని ఆయా వర్గాలు తెలిపాయి. గురువారం హైదరాబాద్‌లో జగన్‌తో మిలాకాత్ తర్వాత వైఎస్ విజయలక్ష్మి సమక్షంలో భాస్కరరామారావు వైఎస్‌ఆర్‌సిపిలో చేరే విషయంపై ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు వివరించారు. ఇప్పటికే ఈ విషయంపై పెదపూడి మండలంలో పెద్ద చర్చనీయంశంగా మారింది. భాస్కరరామారావు టిడిపి నుంచి వైఎస్‌ఆర్ పార్టీలో చేరితే జిల్లాలో తెలుగుదేశం పార్టీ తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.
పిఠాపురంలో చిక్కిన రాబందు
పిఠాపురం, ఫిబ్రవరి 13: వెయ్యి ఎనుబోతులు తిన్న రాబందు ఒక గాలి వానకు కొట్టుకుపోయిందన్న సమేతతో అందరికి సుపరిచితమైన ఈ పక్షి ప్రస్తుతం కనుమరుగైంది. పిఠాపురం నియోజకవర్గంలో గోర్స సమీపంలో కేశనబోయిన త్రిమూర్తులు అనే రైతుకు పొలంలో ఈ రాబందు చిక్కింది. ఈ రాబందును ఒంటిమామిడి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మీనాక్షికి అందజేశారు. అక్కడ నుండి విశాఖపట్నంలోని జంతు ప్రదర్శన శాలకు దానిని తరలించినట్లు తెలిసింది. ఎక్కడ కళేబరాలు ఉన్న అక్కడ ఈ రాబంధులు ఉండేవి. ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉంది. ప్రకృతి వైఫరీత్యాల వల్ల, కాలుష్య ప్రభావాల వల్ల ఆవులు, ఎద్దులకు, గేదెలకు చేసే డైక్లినిక్ ఇంజక్షన్ ప్రభావంతో ఇవి అంతరించిపోయినట్లుగా జీవ వైవిధ్య మండలి గతంలోప్రకటించింది. అయితే వీటిని పట్టించిన వారికి 2 లక్షల రూపాయల నజరనా కూడా ప్రకటించడం విశేషం. వీరు చేపట్టిన సర్వేలో దాదాపుగా ఈ జాతి 97 శాతానికి అంతరించిపోయిందని తేలింది. అయితే పిఠాపురం సమీపంలో రాబందు కనిపించండంతో ఈ పక్షిని వింతగా చూసేందుకు కొంత మంది ఎగబడ్డారు.
నేడు డిసిసిబి, డిసిఎంఎస్ ఎన్నికలకు నోటిఫికేషన్
* రేపటి నుండి నామినేషన్లు స్వీకరణ* డిసిసిబిలో 21, డిసిఎంఎస్‌లో 10డైరక్టర్ పదవులు* నామినేషన్లు తరువాతే క్యాంపులు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఫిబ్రవరి 13: జిల్లా కేంద్రసహకార బ్యాంకు, జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది. రెండు విడతల్లో జరిగిన క్రెడిట్ సొసైటీల ఎన్నికల్లో గెలిచిన సొసైటీల అధ్యక్షులు, గత 11న జరిగిన ఎన్నికల్లో గెలిచిన నాన్‌క్రెడిట్ సొసైటీల అధ్యక్షులతో కూడిన ఓటర్ల జాబితాను ఇప్పటికే రూపొందించిన అధికారులు, అసలు ఘట్టానికి తెరతీయనున్నారు. నోటిఫికేషన్ జారీచేసిన తరువాత శుక్రవారం నామినేషన్లు స్వీకరించి, అదే రోజు పరిశీలించి, పరిశీలన అనంతరం మిగిలిన నామినేషన్లను కూడా ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చి, అదే రోజు సాయంత్రానికి రంగంలో మిగిలిన అభ్యర్ధులను ప్రకటిస్తారు. 18న కాకినాడలోని డిసిసిబి, డిసిఎంఎస్ కార్యాలయాల్లో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ జరిగిన అనంతరం, భోజన విరామం తరువాత అదే రోజు ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. డిసిసిబికి 3ఎ2 తరగతి సభ్యుల నుండి 16మంది డైరక్టర్లను, 3బి2 తరగతి సభ్యుల నుండి 5గురు డైరక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. 3ఎ2 తరగతి డైరక్టర్ పదవులు ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, బిసిలకు 2, జనరల్‌కు 10 కేటాయించారు. 3బి2 తరగతి డైరక్టర్ పదవులు ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బిసిలకు 2, ఒసిలకు 2కేటాయించారు.
డిసిఎంఎస్‌లోని 3ఎ2 తరగతి డైరక్టర్ పదవుల్లో ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బిసిలకు 1, ఒసిలకు 3కేటాయించారు. 3బి2 తరగతి డైరక్టర్ పదవుల్లో ఎస్సీలకు 1, బిసిలకు 1, ఒసిలకు 2 కేటాయించారు. 18 డైరక్టర్ పదవులకు ఎన్నికలు, ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం డైరక్టర్ పదవులకు ఎన్నికైన వారి నుండి డిసిసిబి చైర్మన్, డిసిఎంఎస్ చైర్మన్ అభ్యర్ధులను ఎన్నుకుంటారు. డైరక్టర్ పదవులకు ఎన్నికలు జరిగిన తరువాత రోజు 19న ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు జరిగిన తరువాతే జిల్లా స్థాయిలో సహకార ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టవుతుంది.
15నుండి తెరుచుకోనున్న క్యాంపులు
డైరక్టర్ పదవులకు పోటీ చేసే అభ్యర్ధులతో ఈ నెల 15న నామినేషన్లు దాఖలుచేయించిన తరువాత మాత్రమే డిసిసిబి రాజకీయ క్యాంపులను తెరవాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భావిస్తున్నాయి. 15న నామినేషన్లు స్వీకరించిన తరువాత నుండి ఎవరి పార్టీకి చెందిన వారిని వారు తమ క్యాంపులకు తీసుకెళ్లేందుకు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సొసైటీ అధ్యక్షులను హైదరాబాద్ లేదా విశాఖపట్నం క్యాంపులకు తరలించాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన సొసైటీ అధ్యక్షులను అన్నవరంలోని క్యాంపునకు తరలించాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
జిల్లాలో పెళ్లి సందడి
* వాడవాడలా మంగళవాయిద్యాలు
* కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, ఫిబ్రవరి 13: బలమైన ముహూర్తాలు ఉండటంతో బుధవారం జిల్లాలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. గురువారం కూడా పెద్ద ముహూర్తమే ఉండటంతో ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది. రాజమండ్రితో పాటు, జిల్లాలోని కాకినాడ, అమలాపురం, మండపేట, తుని తదితర ప్రాంతాల్లో కళ్యాణమండపాలన్నీ పెళ్లిళ్లతో కళకళలాడుతున్నాయి. పెళ్లిళ్లకు హాజరయ్యే ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్సులు పెళ్లిళ్ల ప్రయాణికులతో రద్దీగా తయారయ్యాయి. 50 నుండి 60శాతం ఆక్యుపెన్సీతో భారంగా నడుస్తున్న హోటళ్లకు ఒక్కసారిగా విపరీతమైన డిమాండ్ వచ్చిపడింది. హోటళ్లలో గదుల కోసం భారీ డిమాండ్ వచ్చిపడటంతో హోటల్ యజమానులపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. కళ్యాణమండపాలు ఖాళీ లేకపోవటంతో పెళ్లి వారు దేవాలయాలనే ఆశ్రయించటంతో, దేవాలయాలు కూడా కిక్కిరిసిపోయాయి. కొన్ని చోట్ల పెళ్లి జంటలు కూర్చునేందుకు కూడా చోటు లేని పరిస్థితి కనిపించింది. అసలే పెద్ద ముహూర్తం అంటే శుక్రవారం రాజమండ్రిలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కుమార్తెకు, నర్సాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు కుమార్తెకు వివాహం జరగనుంది. ఈ వివాహానికి రాష్ట్రప్రభుత్వంలోని పెద్దలతో పాటు, కాంగ్రెస్, వైకాపా పార్టీల్లోని ముఖ్యనాయకులు రాజమండ్రి తరలిరానున్నారు. దాంతో నగరంలోని ప్రభుత్వ, ప్రయివేటు అతిథిగృహాలన్నీ రిజర్వయ్యాయి. దాదాపు అన్ని పట్టణాలు, పల్లెల్లో ప్రతి వీధిలోనూ రెండుకు తగ్గకుండా పెళ్లి పందిళ్లు కనిపిస్తున్నాయి. వాతావరణం చూస్తుంటే జిల్లా అంతా పెళ్లి పందిరన్నట్టు కనిపిస్తోంది.
శ్రీఉమాసోమేశ్వరాలయంలో
పెద్ద శివుడి విగ్రహం ఆవిష్కరణ
కె గంగవరం, ఫిబ్రవరి 13: కె గంగవరం మండలం దంగేరు గ్రామంలో నెలకొనియున్న పురాతన శివాలయం శ్రీఉమాసోమేశ్వరాలయంలో బుధవారం పెద్ద శివుని విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత భక్తి ప్రపత్తులతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో జరిగింది. గ్రామానికి చెందిన పోలిశెట్టి, ఒబిళినేని, రావిపాటి వంశీయులు అందించిన విరాళాలతో శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, చక్కటి ఉద్యానవనాన్ని నిర్మించారు. ఇటీవలనే పురాతన శివాలయంగా ఉన్న శ్రీఉమాసోమేశ్వరాలయాన్ని అష్టసోమేశ్వరాలయాలలో ఒకటిగా పురావస్తు శాఖ గుర్తించింది. ఆలయ నిర్మాణాలను, లింగాకృతులను పరిరక్షించేందుకు పురావస్తు శాఖ ఇప్పటికే చర్యలు చేపట్టింది.
మెడికల్ అధికారులపై కొరడా
షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ : జీతాలు నిలిపివేతకు ఆదేశాలు
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 13: సమీక్ష సమావేశానికి హాజరుకాని మెడికల్ అధికారులకు తక్షణం షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి జీతాలను నిలుపువేయాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి పద్మావతిని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, ఆస్పత్రి ప్రసవాలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో కలెక్టరేట్ విధాన గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు మెడికల్ అధికారులు హాజరుకాకపోవడంతో జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెడికల్ అధికారులు ఎటువంటి సెలవులు తీసుకోకుండా సమావేశానికి రాకపోవడం క్షమించరాని నేరమన్నారు. సమావేశానికి హాజరుకాని మెడికల్ అధికారుల్లో అధిక శాతం మంది కాంట్రాక్ట్ డాక్టర్లు ఉండడంతో వారి పని తీరు మెరుగుపడకుంటే వారి కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తామని స్పష్టం చేశారు. మాటవినని వారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన వారిలో చలనం వస్తుందని అప్పుడైనా పని చేయని వారిలో పని తీరు మెరుగుపడుతుందని ఆమె అన్నారు. దుప్పలపాలెం, చవిటిదిబ్బలు, ఏలేశ్వరం, తదితర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులు సమావేశానికి హాజరుకాకపోవడంతో వారందరికీ ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి వారికి వేతనాలు నిలుపువేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయడంలో వెనుకబడిన ర్యాలీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న మెడికల్ అధికారి శ్యాంబాబును విధుల నుండి తొలగించాలని కలెక్టర్ డిఎంహెచ్‌ఒను ఆదేశించారు. ఇతర శాఖలకు లేనన్ని నిధులు, సిబ్బంది, వౌళిక సదుపాయాలు ఉన్న ఆశించిన లక్ష్యాలను సాధించడంలో వెనుకబడడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ప్రసవాలను నిర్వహించేందుకు త్వరలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ చెప్పారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద కేటాయించిన నిధులను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో 50 ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి శిక్షణా కార్యక్రమాల కోసం వినియోగించాల్సిన నిధులు సుమారు 85 లక్షలు ఖర్చు చేయకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రోగ్రామ్ అధికారి నాగేంద్రప్రసాద్‌ను ఈ విషయంపై నిలదీసి 15 రోజుల్లోగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసన్నకుమార్‌పై ఓ మహిళ తనను వేధిస్తున్నట్లు ఆరోపించినందున దీనిపై విచారణ జరిపి తనకు నివేదిక అందజేయాలని డిఎంహెచ్‌ఒ పద్మావతిని ఆదేశించారు. వివిధ ఉద్యోగాల భర్తీలో డబ్బులు వసూళ్ళు చేశారని ఆరోపణలు వస్తున్న డిఎంహెచ్ ఒ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ వాసును మరో సీటుకు మార్చాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పద్మావతి, వైద్యులు వి సుబ్బారావు, డాక్టర్ పవన్‌కుమార్, వి లక్ష్మణరావు, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ ప్రవీణ్, పలువురు వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమాచారం ఇవ్వని అధికారులకు షోకాజ్‌లు
సమాచారహక్కు కమిషనర్ రతన్
రాజమండ్రి, ఫిబ్రవరి 13: రాజమండ్రిలో గత మూడురోజులుగా నిర్వహించిన విచారణలో భాగంగా 12 దరఖాస్తులకు సంబంధించి సకాలంలో సమాచారం ఇవ్వని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర సమాచారహక్కు కమిషనర్ ఎం రతన్ వెల్లడించారు. గత మూడురోజులుగా ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పెండింగ్ అప్పీళ్లను ఆయన విచారించారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తాను నిర్వహించిన విచారణలో మొత్తం 75 అప్పీళ్లు వచ్చాయని, వాటిలో 63 అప్పీళ్లను తక్షణం పరిష్కరించామన్నారు. మిగిలిన 12 అప్పీళ్లకు సంబంధించి అధికారులకు షోకాజ్‌లు జారీ చేశామన్నారు. సమాచారహక్కు చట్టం ద్వారా సకాలంలో సమాచారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమ పరిధిలో మొత్తం 3వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 900 దరఖాస్తులను పరిష్కరించామని పేర్కొన్నారు. రెవెన్యూ, ఆరోగ్య, ఎస్సీ, బిసి వెల్ఫేర్, న్యాయ, కార్మికశాఖలకు సంబంధించిన సమాచారహక్కు దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించామన్నారు. అప్పీళ్లను 3నెలల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని రతన్ వివరించారు. కొత్త కమిషనర్ల నియామకం వల్ల రెండేళ్లలో అప్పీళ్లను త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. తదుపరి 27,28న విశాఖపట్నం, 25న శ్రీకాకుళం, 26న విజయనగరం జిల్లాల్లో పెండింగ్ దరఖాస్తులను విచారిస్తామన్నారు.

తిరుపతి పాదయాత్ర ప్రారంభంలో ఎమ్మెల్యే మల్లాడి
english title: 
d

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>