నెల్లూరు, ఫిబ్రవరి 15: జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మార్గదర్శకత్వంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు డిసిసిబి, డిసిఎంఎస్ డైరెక్టర్ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం పది గంటల నుంచే నామినేషన్లపర్వం ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం 12గంటల వరకు రాహుకాలం ఉండటంతో ఆ తరువాతే నామినేషన్లు దాఖలుకు శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు స్థానికంగా ఉన్న మంత్రి ఆనం నివాసంలోనే సుదీర్ఘ సమాలోచనలు సాగాయి. డైరెక్టర్లగా ఎవరెవరికి అవకాశం కల్పించాలనే అంశంపై స్పష్టత చేకూరేలా ఆనం సూచించారు. డిసిసిబి (జిల్లా కేంద్ర సహకార బ్యాంక్) చైర్మన్ పదవికి ప్రచారంలో ఉన్న మెటుకూరు ధనుంజయరెడ్డి తొలి డైరెక్టర్‌గా నామినేషన్‌గా వేయడం గమనార్హం. డిసిఎంఎస్ (జిల్లా సహకార మార్కెట్ సొసైటీ) అధ్యక్ష హోదాకు ప్రచారంలో ఉన్న సుమంత్‌రెడ్డి తొలి డైరెక్టర్‌గా నామినేషన్ వేశారు. దీంతో ఈయనే డిసిఎంస్ అధ్యక్ష పదవి ఖరారైందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఇదిలాఉంటే డిసిసిబి ఉపాధ్యక్ష పదవికి నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడు సహకార సంఘం నుంచి అధ్యక్షునిగా ఎన్నికైన కోడూరు కమలాకరరెడ్డి నియమితులు కానున్నారనే ప్రచారం కూడా జోరందుకుంటోంది. నెల్లూరు సహకార ఎన్నికలకు కాంగ్రెస్‌పార్టీ పరిశీలకులుగా హాజరైన చిత్తూరుజిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి నేతృత్వంలో నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి, ఎన్‌డిసిసిబి మాజీ చైర్మన్ వాకాటి నారాయణరెడ్డి అభ్యర్థులతో నామినేషన్లు వేయించడంలో హడావుడి సృష్టించారు. నామినేషన్ల దాఖలులో ఇంకా మాజీ జడ్పీ చైర్మన్ పొనే్నబోయిన చెంచలబాబుయాదవ్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చేవూరు దేవకుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉంటే ఒక్కో డైరెక్టర్‌కు ఒక్కోటే నామినేషన్లు వేయించారు. డమీలుగా నామినేషన్లు వేయించే క్రమానికి కూడా స్వస్తిపలికారు. కాగా, విపక్ష పార్టీలు డైరెక్టర్ పోస్టులకు కూడా పోటీ పడకుండా దూరం పాటించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఎన్నికలు జరిగిన మొత్తం 93 సొసైటీల్లో సుమారు ఇరవై స్థానాల్లో తెలుగుదేశం మద్దతుదారులు విజయం సాధించారు. వివిధ వృత్తి సంఘాలు కూడా ఆ పార్టీకి అనుకూలంగా ఓట్లున్నాయి. అయినాసరే పోటీకి పూర్తిగా దూరం పాటించడమే వింతగొలుపుతున్న రాజకీయ పరిణామం.
డిసిసిబి అధ్యక్షుడిగా మెటుకూరు, డిసిఎంఎస్‌కు సుమంత్‌రెడ్డి ఖరారే !
english title:
anam
Date:
Saturday, February 16, 2013