నెల్లూరు, ఫిబ్రవరి 15: మీ సొంత ఇల్లైతే ఇలాగే నింపాదిగా నిర్మాణ పనులు జరుగుతాయా అంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుగంగ సూపరింటిండెంట్ ఇంజనీర్ రవిశంకర్‌నుద్దేశించి ఆక్రోశం వెలిబుచ్చారు. కండలేరు జలాశయ స్పిల్‌వే నిర్మాణ పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై మంత్రి ఆనం ఆగ్రహించిన వైనమిది. శుక్రవారం జిల్లాలో తాజా సాగునీటి పరిస్థితులపై, ఇందిరమ్మ బాట కార్యక్రమాలపై ముందస్తుగా స్థానిక గోల్డెన్ జూబ్లీహాల్‌లో మంత్రి ఆనం సమీక్షించారు. కండలేరు డ్యామ్ స్పిల్ వే వర్క్ 2006లో మంజూరై ఇప్పటికే ఏడేళ్లవుతున్నా ఇంతవరకు సగభాగం పనులు కూడా జరగకపోవడాన్ని తప్పుపట్టారు. అరవై కోట్ల రూపాయలతో మంజూరైన ఈ పనుల్లో టెండర్ల విధానం ద్వారా జాప్యం జరగకుండా అప్పటికే ఆధునీకరణ ప్యాకేజి కాంట్రాక్టర్‌కే నామినేటెడ్‌గా అప్పగించినా ఎందుకు జాప్యం జరుగుతుందంటూ ఆక్షేపించారు. త్వరలో సీఎం ఇందిరమ్మబాట కార్యక్రమం పేరిట జిల్లాలో పర్యటిస్తున్నారని, అప్పుడు కండలేరు డ్యామ్ వద్దకు కూడా వస్తారని ఈ పనిని చూపి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సిఎం నిన్ను కొనసాగిస్తారో... తొలగిస్తారో తెలుసుకోవాలంటూ హితవుపలికారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యంతో రాష్టస్థ్రాయిలో సమీక్షించేటప్పుడు తల ఎత్తుకోలేకపోతున్నానంటూ మంత్రి ఆనం ఆవేదనాభరితంగా వ్యాఖ్యానించారు.
నిర్మాణ పనుల్లో జాప్యంపై తెలుగుగంగ ఎస్‌ఇపై మండిపడ్డ మంత్రి ఆనం
english title:
minister anam
Date:
Saturday, February 16, 2013