నెల్లూరు , ఫిబ్రవరి 15: ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో ఏర్పాటుచేసిన ప్రతి వారం సంగీత, నృత్యం ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం రాత్రి స్థానిక పాఠశాలలో ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థిని పి శివానీ గాత్రం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీగణనాధం భజరే, ఈశమనోహరి, రఘువంశసుధా, ఎందరో మహానుభావులు, పలుకేబంగారమాయేరా తదితర కీర్తనలు ఆకట్టుకున్నాయి. శివానీ గాత్రానికి వయోలిన్‌పై మద్దెల లోకేష్‌బాబు, మృదంగంపై రామకృష్ణ, కంజీరాపై వి శాంతి కళాధర్ సహకరించారు. ఈసందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సి మునికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించడం, వేదిక అనుభవం కలిగేందుకు, వేదిక భయం తొలగేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం రెండవ దశలో వర్ధమాన కళాకారులు కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. సంగీత పాఠశాలతోపాటు నగరంలోని ప్రముఖ దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, కళాకారులు, కళాప్రియులు ఈకార్యక్రమంలో పాల్గొనాలని మునికుమార్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సుప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు రాళ్లపల్లి సుబ్బలక్ష్మి మాట్లాడుతూ సంగీత నృత్య పాఠశాల నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ప్రిన్సిపాల్ మునికుమార్, సంగీత అధ్యాపకులు విద్యార్థులకు సంగీతం నేర్పించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, కార్యాలయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
తోలు పరిశ్రమ రద్దుకు బిజెపి ఆధ్వర్యంలో
* ఫిర్యాదుల ఉద్యమం
నెల్లూరు , ఫిబ్రవరి 15: జిల్లాలో స్థాపించనున్న కృష్ణపట్నం అంతర్జాతీయ తోలు పరిశ్రమల సముదాయాన్ని రద్దు చేయాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు మిడతల రమేష్ పర్యవేక్షణలో వెయ్యి మందితో వ్యక్తిగత ఫిర్యాదులు చేయించేందుకు నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా శుక్రవారం బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయలక్ష్మి తొలి ఫిర్యాదుచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిజెపి నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పేర్నాటి రంగారెడ్డి, పనబాక కోటెశ్వరరావుతోపాటు 308 మంది ఫిర్యాదులను పర్యావరణ ఇంజనీర్ కార్యాలయంలో సమర్పించారు. ఈసందర్భంగా మిడతల రమేష్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలన్నింటిలో నిషేధంలో ఉన్న తోళ్ల పరిశ్రమను నెల్లూరు జిల్లాలో స్థాపించడం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయన్నారు. చర్మాల శుద్ధికి ఉపయోగించే రసాయనాల వల్ల గాలి, నీరు, భూమి కలుషితవౌతాయని, చుట్టుపక్కల 18 గ్రామాల్లో ప్రజలు నివశించేందుకు వీలులేకుండా పోతుందని చెప్పారు. శ్వాసకోశ, ఉదర, గుండె, చర్మవ్యాధులు సంక్రమించి ప్రజలు మరణిస్తారన్నారు. రాష్ట్రంలో పశుసంపద గణనీయంగా తగ్గిపోతుందని, ఈ పరిశ్రమ ద్వారా రోజుకు 3లక్షల నుండి 4లక్షల కెజిల చర్మాలు శుద్ధి చేయాల్సి ఉంటుందని, ఇందుకుకోసం ఆవులు, బర్రెలు, గొర్రెలను వధిస్తారన్నారు. చర్మాల కోసం రాష్ట్రంలలో అనధికార పశువధశాలలు ఏర్పాటవుతాయన్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కోటమండలం కొత్తపట్నం వద్ద ఏర్పాటుచేయనున్న ఈ పరిశ్రమ స్థాపనను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 6వ తేదీకి ముందే అభ్యంతరాలు తెలియచేయవచ్చని పర్యావరణశాఖ ఇచ్చిన నోటీసుల ఆధారంగా జిల్లాలోని రైతులు, మేధావులు, న్యాయవాదులు, పర్యావరణ పరిరక్షకులు, జంతు ప్రేమికులు, గోసంరక్షకులు ప్రభుత్వానికి వ్యక్తిగతంగా ఫిర్యాదులు అందచేసి ఉద్యమానికి సహకరించాలని రమేష్ విజ్ఞప్తి చేశారు.
జంటహత్యల కేసులో
ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలి
* కలెక్టర్ శ్రీధర్‌కు టిడిపి నేత కోటంరెడ్డి విజ్ఞప్తి
నెల్లూరు, ఫిబ్రవరి 15: నగరంలోని హరనాధపురంలో జరిగిన జంటహత్యల కేసులో వెంటనే ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి 60రోజులలోగా విచారణ పూర్తి చేసి నిందితులకు ఉరిశిక్ష విధించి ఒక భద్రతా సంకేతాన్ని జిల్లా ప్రజల్లోకి పంపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోరారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ బి శ్రీ్ధర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కోటంరెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశాంతమైన జిల్లాగా పేరు ఉందని, ఇటీవల అనేక వరుస సంఘటనలతో నెల్లూరు ప్రజలు భీతిల్లుతున్నారన్నారు. దీనికి ప్రధాన కారణం పోలీస్ విధుల్లో మితిమీరిన రాజకీయ జోక్యం చోటు చేసుకోవడమేనని అభిప్రాయ పడ్డారు. జిల్లా ప్రశాంతంగా ఉండబట్టే రాష్ట్రంలోఅన్నీ ప్రాంతాల వారు తమ పిల్లల్ని నెల్లూరులో చదువుల కోసం పంపుతుంటారన్నారు. దారుణాలు పునరావృతం కాకుండా జిల్లా ప్రజల్ని భయాందోళన నుండి విముక్తి చేసి బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం చేసేందుకు నెల్లూరులో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలన్నారు. నిందితులకు ఉరి శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆ వినతిపత్రంలో కోరామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ కార్పొరేట్‌ర ధర్మవరపు సుబ్బారావు, నాయకులు మండవ రామయ్య, మున్వర్ బాషా, ఉచ్చి భువనేశ్వరప్రసాద్, మల్లి, ఖాదర్‌బాషా, మహేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళల అభ్యన్నతి కోసమే సంక్షేమ పథకాలు
ఎమ్మెల్యే ముంగమూరు స్పష్టం
నెల్లూరు, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యన్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం 19వ డివిజన్‌లోని రామలింగాపురంలోని కమ్యూనిటీ హాల్లో పొదుపు మహిళలకు గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం మహిళల అభ్యన్నతి కోసం, మహిళల సంక్షేమం కొరకు ఏర్పడిన ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సహకారంతో 5వేల గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళలకు చట్ట సభలలో 50శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. మహిళల కోసం స్ర్తి నిధిని ప్రవేశపెట్టి, వడ్డీ లేని రుణాలను మంజూరు చేశామన్నారు. ప్రజలకు అందుబాటులో ఇరువురు ఎమ్మెల్యేలు ఉంటామని సమస్యలను తమ దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవరాజులు, సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శేషారెడ్డి, జి సుబ్బారెడ్డి, రంగారావు తదితరులు పాల్గొన్నారు.
అక్వా షాపును తొలగించాలి
నెల్లూరు, ఫిబ్రవరి 15: ఎన్‌హెచ్ 5 కొత్త పెన్నాబ్రిడ్జి అవతల అనుకుని ఉన్న అక్వా షాపును తొలగించాలని ఎఎస్‌వైఎఆర్‌డి అధ్యక్షుడు బొమ్మిల బాలచెన్నయ్య కోరారు. ఈమేరకు జిల్లాకలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం బాల చెన్నయ్య మాట్లాడుతూ ఆ షాపు యాజమాని రొయ్యలు, చేపలు, తలలు ఉడకబెట్టే పరిశ్రమను వెంటనే మూయించాలని కోరారు. దీని వల్ల సుమారు గ్రామస్థులు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు.
వన భోజన విజయవంతంపై ధన్యవాదాలు
నెల్లూరు, ఫిబ్రవరి 15: జిల్లా జంగమ కుల కలయిక కార్యక్రమాన్ని ఈ నెల 10న జ్వాలాముఖి అమ్మవారి దేవాలయంలో విజయవంతం కావడం పట్ల ఆ కుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జంగమ సంఘ జిల్లా అధ్యక్షులు గంధవళ్ల దశరధరామయ్య, కార్యదర్శి వీరభద్రయ్య, సభ్యులు కరివేటి శివసాయి, పుల్లూరు ప్రసాద్, పుల్లూరు చంద్రవౌళి, వెంకటకృష్ణ విలేఖరులతో మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమానికి కావలికి చెందిన విజయదుర్గా పీఠాధిపతులు పత్రి వీరబ్రహ్మయ్యస్వామి హాజరయ్యారన్నారు. వనభోజన సందర్భంగా పరమేశ్వరునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాలాభిషేకం, స్ర్తిలచే సామూహిక లక్ష కుంకుమార్చన, చిన్నారులకు ఆటల పోటీలు, దేవతామూర్తుల వేషధారణలు, భరతనాట్యం వంటి కార్యక్రమాలు చేపట్టారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశామన్నారు.
రానున్న ఏప్రిల్ మాసంలో జంగమ కుల వివాహ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
కరెంట్‌చార్జీల పెంపుతగదు
* కోటంరెడ్డి ధ్వజం
నెల్లూరు, ఫిబ్రవరి 15: విద్యుత్ చార్జీల పెంపుదలతో సామాన్య ప్రజానీకం నడ్డివిరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు కోటంరెడ్డి శ్రీ్ధరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌సి కరెంట్‌పోరు కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని ఇరుగాళమ్మగుడి కూడలి ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. అంతకుముందు తెలుగుదేశం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనిమిది పర్యాయాలు చార్జీలు పెంచారని గుర్తు చేశారు. వైఎస్ మరణాంతరం కొలువుదీరిన ప్రభుత్వాలు ఇప్పటికే మూడుమార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని దుయ్యబట్టారు. ఇప్పటికైనా విద్యుత్ చార్జీల పెంపుదలను విరమించుకోవడంతో సహా సరఫరా మెరుగుపడేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దిశగా ప్రభుత్వ నిర్ణయం తీసుకునే వరకు తమ ఆందోళనా కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మందా బాబ్జీ, మందా పెదబాబు, పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.
మార్లగుంటలో ఉచిత వైద్యశిబిరం
రాపూరు, ఫిబ్రవరి 15: కరుణామయి విజయేశ్వరిదేవి వైద్యవిద్యాసంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్యశిబిరం జరిగింది. డక్కిలి మండలంలోని మార్లగుంట గ్రామంలో జరిగిన ఈ వైద్యశిబిరంలో 200మంది రోగులు వైద్యసేవలు పొందారు. రోగులకు వైద్యశాల వైద్యురాలు డాక్టర్ మేరి విక్టోరియా వైద్యసేవలు అందించగా, వైద్యశాల నిర్వాహకులు రాంమోహన్, రేవతమ్మ ఉచితంగా మందులు అందచేశారు.
గోశాల నిర్మాణానికి శంకుస్థాపన
కోవూరు, ఫిబ్రవరి 15: స్థానిక షిరిడీ సాయిబాబా మందిరం సమీపంలో శ్రీసాయి గోశాల నిర్మాణానికి సినీ నటి జయలలిత శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సాయిబాబా గుడి వ్యవస్థాపకులు కాకుమాని చెన్నయ్య ఆధ్వర్యంలో గోశాల నిర్మాణాన్ని తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించదలిచినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానికులు, సాయిబాబా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
వికలాంగుల పింఛన్ పెంచాలి
కోవూరు, ఫిబ్రవరి 15: వికలాంగులకు పింఛన్ పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షురాలు మరియమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ విహెచ్‌పిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ దీక్షలు చేపట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మాదిరిగానే వికలాంగులకు ప్రత్యేక సబ్‌ప్లాన్ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.
రేషన్ షాపు తనిఖీ
కోవూరు, ఫిబ్రవరి 15: స్థానిక తాశీల్దార్ సాయిబాబా శుక్రవారం సత్రం వీధిలోని రేషన్‌షాపును తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ తదితర రికార్డులను పరిశీలించారు. ఈకార్యక్రమంలో విఆర్వో భాస్కర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.