ఒంగోలు, ఫిబ్రవరి 15: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గానికి ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు ఇవ్వటంతో ఎన్నికలు నిలిచిపోయాయి. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సంతమాగులూరు, సజ్జాపురం, వల్లాపల్లి సొసైటీలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం శాంతిభత్రలను సమస్యగా చూపుతూ స్టే ఇచ్చింది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన నేతలు హైకోర్టును ఆశ్రయించటంతో తీర్పువారికి అనుకూలంగా వచ్చింది. దీంతో ఎన్నికలు నిలిచిపోయాయి. కాగా డిసిఎంఎస్‌కు మాత్రం యథావిధిగానే ఎన్నికలు జరగనున్నాయి. డిసిసిబి, డిసిఎంఎస్ పాలకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ ఉదయం పది నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది. డిసిసిబి పాలకవర్గానికి 16 మంది డైరెక్టర్లు ఉండగా ఆ పదవులకు 44 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధానంగా నామినేషన్లు వేసిన ప్రముఖుల్లో కాంగ్రెస్‌పక్షాన మేదరమెట్ల శంకరారెడ్డి, ఈదర మోహన్, బెల్లం సత్యంలు ఉన్నారు. అదేవిధంగా డిసిఎంఎస్‌లకు నామినేషన్ వేసిన ప్రముఖుల్లో చిడిపోతు సుబ్బారావు, బెల్లం సత్యం తదితరులు ఉన్నారు. నామినేషన్ల ఘట్టం పూర్తయిన తరువాత వైకాపా తరపున ఎస్‌టి అభ్యర్థి మేనావాత్ హనుమా నాయక్ విజయం సాధించారు. మిగిలిన 15 డైరక్టర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. డిసిఎంఎస్ పాలకవర్గంలో 10 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉండగా 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇదిలాఉండగా డిసిసిబి డైరక్టర్ల ఎ గ్రూపులో 37 మంది, బి గ్రూపులో ఏడుగురు పోటీలో ఉన్నారు. డిసిఎంఎస్ పాలకవర్గానికి ఏ గ్రూపులో 13 మంది, బి గ్రూపులో ఒకరు పోటీలో ఉన్నారు. కాగా డిసిసిబి చైర్మన్ అభ్యర్ధి ఎంపికపై మంత్రులు, ఎంపి, శాసనసభ్యులు కసరత్తులు చేస్తూనే ఉన్నారు. అభ్యర్థి ఎంపికపై ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో మంత్రులు సాకే శైలజానాథ్, మానుగుంట మహీధర్‌రెడ్డి, కొంతమంది శాసనసభ్యులు సమావేశమయ్యారు. చైర్మన్ అభ్యర్థిపై వారు ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. కాని మళ్ళీ చైర్మన్ అభ్యర్థిగా మేదరమెట్ల శంకరారెడ్డి పేరును ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. డిసిఎంఎస్ చైర్మన్ రేసులో చిడిపోతు సుబ్బారావు, బెల్లం సత్యం పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాగా తెలుగుదేశం పార్టీ తరపున చైర్మన్ అభ్యర్థి రేసులో దామచర్ల పూర్ణచంద్రరావు ఉన్నారు. ఆమేరకు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. వైకాపా తరపున మాత్రం చైర్మన్ అభ్యర్థి పేరును ఖరారు చేయలేదు. ఇదిలాఉండగా కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా పోటీచేసిన మేదరమెట్ల శంకరారెడ్టి పాత్రికేయులతో మాట్లాడుతూ అధిష్ఠానం నిర్ణయం మేరకు చైర్మన్ అభ్యర్థి ఎంపిక జరుగుతుందన్నారు. తనకు మరోసారి అవకాశం ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎంఎల్‌సి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ డిసిసిబి చైర్మన్ పీఠాన్ని తమపార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గంలో తొమ్మిది స్థానాలను కైవసం చేసుకున్నామని, రెండు డైరెక్టర్ల పదవులకు పోటీ చేశామన్నారు. మొత్తంమీద హైకోర్టు స్టేతో డిసిసిబి ఎన్నికలు నిలిచిపోయాయి.
డైరెక్టర్ల పదవులకు ముగిసిన నామినేషన్లు
english title:
dccb elections
Date:
Saturday, February 16, 2013