మార్కాపురం, ఫిబ్రవరి 15: రానున్న వేసవిలో ఏర్పడనున్న తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 100కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కె విజయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నుంచి జూన్ వరకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని, అధికారులు ముందుగా గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను అద్యయనం చేసుకొని చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. నీటి సరఫరా విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముందుగా ఎంపిడిఓ, తహశీల్దార్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రస్తుత నీటి సరఫరా పరిస్థితి, రాబోయే కాలంలో నీటి సరఫరా పరిస్థితిపై ప్రజలను అడిగి సమాచారం తీసుకొని ఒక అవగాహనకు వచ్చి ఆ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈఏడాది వేసవిలో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే విధానానికి స్వస్తి చెప్పామని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని గుర్తించి సమీప ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బోర్ల నుంచి పైపుల ద్వారా గ్రామాల్లో నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సామాజిక దృక్పథంతో పాటు ఉద్యోగి బాధ్యతగా గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. మార్చినాటికి జిల్లాలో లక్ష మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి మండలంలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి మండలానికి రెండు వేల మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 10వేల రూపాయలు ఇస్తుందని, ఔత్సాహికులు ఎవరైనా ముందుకు వస్తే ఆ గ్రామంలో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఐకెపి కార్యదర్శి, పొదుపుసంఘాల ఆద్వర్యంలోగ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. గతంలో కొన్ని స్కీంల కింద మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన వారికి బిల్లులు బకాయి ఉంటే వారికి బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. ప్రస్తుతం పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉన్నందున రైతులకు అవసరమైన గడ్డి విత్తనాలను అందచేయాలని పశుసంవర్ధకశాఖ జెడి రజినీకుమారిని ఆదేశించారు. ఇప్పటికే భూమి ఉన్నవారికి గడ్డివిత్తనాలను అందజేశామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి 13వ ఆర్థిక సంఘం నిధులు రానందున పంచాయతీలకు నిధుల కొరత తీవ్రంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిపన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ విజయ్‌కుమార్ ఎంపిడిఓలను ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న పిడి పద్మజా మాట్లాడుతూ ఎంపిడిఓలు, ఐకెపి సిబ్బంది సమన్వయంతో పనిచేసి పొదుపుసంఘాలకు రుణాల మంజూరు విషయంలో శ్రద్ధ చూపాలని, అలాగే రుణాల వసూళ్ళలో కూడా బ్యాంకర్లకు సహకరించాలని ఆదేశించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి వేసిన బోర్లు, ఇతర మరమ్మతుల బిల్లులను సంబంధిత కాంట్రాక్టర్లకు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ భానుప్రసాద్ ఎఇలను ఆదేశించారు. పనిచేయని చేతిపంపులు ఉంటే యుద్ధప్రాతిపదికన వాటి మరమ్మతులు చేపట్టాలని, అందుకు అవసరమైన విడిభాగాలను కూడా అందచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో డిపిఓ మోహన్‌కుమార్, సిఇఓ గంగాధర్‌గౌడ్, ఆర్డీఓ ఎం రాఘవరావు, పంచాయతీరాజ్ ఇఇ వెంకటేశ్వర్లుతోపాటు ఎంపిడిఓలు, ఐకెపి, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
* కలెక్టర్ జిఎస్‌ఆర్‌కె విజయ్‌కుమార్ వెల్లడి
english title:
drinking water
Date:
Saturday, February 16, 2013