సంతనూతలపాడు, ఫిబ్రవరి 15: మండల కేంద్రమైన సంతనూతలపాడులో అక్రమంగా దాచి ఉంచిన 15 లక్షల విలువ గల 1500 బస్తాల రేషన్ బియ్యం గుట్టు రట్టయింది. స్థానిక యానాదిశెట్టి గోదాముల్లో అక్రమంగా రేషన్ బియ్యం ఉండటాన్ని గమనించిన అజ్ఞాత వ్యక్తి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు గురువారం రాత్రి సమాచారం ఇచ్చాడు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ పౌరసరఫరాల శాఖాధికారులను అప్రమత్తం చేయడంతో అక్రమ బియ్యం రవాణా గుట్టు బయటపడింది. రేషన్ బియ్యాన్ని రీపాలిష్ చేసి, రీప్యాక్ చేసి ఉన్న 1500 బస్తాల ఎల్‌ఆర్ రకం బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యంగా భావిస్తూ బియ్యం దాచిన గోదాము యజమానిపై 6 ఎ కేసు నమోదు చేశారు. రాత్రి పొద్దుపోవడంతో స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్థానిక పోలీసులకు, ఎండ్లూరు విఆర్‌ఓకు అప్పజెప్పి శుక్రవారం ఉదయం బియ్యాన్ని గోదాముకు తరలించారు. ఈదాడిలో పౌరసరఫరాల శాఖాధికారి ఎ హనుమంతురావు, కందుకూరు సహాయక పౌరసరఫరాల అధికారి ఎ శ్రీనివాసరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఒంగోలు ఫుడ్ ఇన్స్‌పెక్టర్ సిహెచ్ కృష్ణమోహన్, అడిషనల్ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ ఎం ప్రసాద్, ఎండ్లూరు విఆర్‌ఓ జయప్రకాష్ పాల్గొన్నారు.
1500 బస్తాలు స్వాధీనం
english title:
biyyam guttu rattu
Date:
Saturday, February 16, 2013