ఒంగోలు , ఫిబ్రవరి 15: డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి మంచి స్పందన లభించింది. బాధితులు తమగోడును స్వయంగా చెప్పుకొనేందుకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అనేకమంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించుకున్నారు. కంభంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగి పోయిందని, స్టేషన్‌లో చెప్పినా పట్టించుకొనేవారే కరవయ్యారన్నారు. బుధవారం రాత్రి ఒంగోలులో నిర్మల కానె్సప్ట్ స్కూల్ వద్ద బంగారు గొలుసు చోరీ గురించి స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. తన భర్త సుభాన్‌కు ఒక నెల పెరోల్ వచ్చినా కంభం ఎస్సై అనుమతి ఇవ్వడంలేదన్నారు. ఒంగోలులో నివసిస్తున్న సుంకర చక్రవర్తి, అతని కొడుకు నరేష్‌లు టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నలుగురి దగ్గర 4 లక్షల రూపాయులు తీసుకొని తమను మోసం చేశారని కందుకూరుకు చెందిన శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను సానుకూలంగా విన్న జిల్లా ఎస్పీ రఘురాంరెడ్డి స్పందించి ఆయా స్టేషన్‌లకు చెందిన ఎస్సైలు, సిఐలను పరిష్కరించాలని ఆదేశించారు.
భూములు నష్టపోయిన రైతులకు చెక్కుల పంపిణీ
ఒంగోలు , ఫిబ్రవరి 15: ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన భూములు కోల్పోయిన రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర పరిధిలోని ముక్తినూతలపాడు నుండి కార్గిల్ పెట్రోలు బంకు వరకు 10.5 కిలో మీటర్ల పొడవున ఆరులైన్ల జాతీయ రహదారిని నిర్మించేందుకు ప్రణాళికలు తయారుచేసి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించగా ఆమోదముద్ర పడింది. దీనితో పనులు ప్రారంభించేందుకు నేతలు, అధికారులు సిద్ధమయ్యారు. ఇలాంటి తరుణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి కోటి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో రైతులను నేతలు ఒప్పించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రారంభించి రైతులకు చెక్కుల పంపిణీ చేశారు. 300 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. 250 మంది లబ్ధిదారులకు 225 కోట్ల రూపాయల చెక్కులను ఎంపి మాగుంట పంపిణీ చేసి మాట్లాడారు. ఒంగోలు నగరానికి మహర్ధశ పట్టిందన్నారు. ఆరులైన్ల జాతీయ రహదారి వల్ల ఒంగోలు నగరం మూడుపువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతుందన్నారు. నష్టపోయిన రైతులకు పెద్దమొత్తంలో నష్టపరిహారం చెల్లించేందుకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, దేశ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లతో ప్రత్యేకంగా మాట్లాడి ఎకరాకు కోటి 50 లక్షల రూపాయల ప్యాకేజీని తీసుకొచ్చామన్నారు. రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇంకా రావాల్సిన నష్టపరిహారాన్ని త్వరలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జె రాధాకృష్ణమూర్తి, తహశీల్దార్ సుబ్బారావు, ఆర్ ఐలు, నేషనల్ హైవే అధికారులు, రైతులు పాల్గొన్నారు.
నూతన వధూవరులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సందడి
చీరాల, ఫిబ్రవరి 15: గత రెండు రోజులుగా చీరాల, పర్చూరు ప్రాంతాలలో జరిగిన వివాహాలను రిజిస్ట్రేషన్‌ల నమోదుకోసం సంబంధిత కార్యాలయాలు నూతన వధూవరులతో కళకళలాడాయి. ఇటీవల కాలంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొంతమంది రిజిస్ట్రేషన్‌లను తప్పనిసరిగా భావించి వారివారి పేర్లుతో వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలను తీసుకున్నారు. ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగాలు చేసే వధూవరులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉండగా, వారితో పాటు స్థానికంగా ఉండే వధూవరులు సైతం తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రెండు రోజులుగా చీరాల, పర్చూరు ప్రాంతాలలో సుమారు వంద పెళ్ళిళ్ళు వరకు జరిగాయి. అయితే అధిక జంటలు వివాహాన్ని సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి గురు, శుక్ర వారాల్లో వివాహం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎక్కువ మంది నూతన వధూవరులు పెళ్ళి దుస్తులలోనే సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకొని వివాహ ధ్రువీకరణ పత్రాలను స్వీకరించారు.