జరుగుమల్లి, ఫిబ్రవరి 15: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనులలో భాగంగా సోషల్ ఆడిట్ బృందం మండలంలో నిర్వహిస్తున్న సామాజిక తనిఖీలో భాగంగా శుక్రవారం పచ్చవలో గ్రామసభ నిర్వహించామని ఇండిపెండెంట్ అబ్జర్వర్ వై పూర్ణచంద్రరావుతెలిపారు. తొలుత పచ్చవ గ్రామానికి చెందిన ఎం బంగారయ్య 2012నవంబర్ నెలలో మృతి చెందితే అతనికి డిసెంబర్ నెలలో కూడా పెన్షన్ పంపిణీ చేసినట్లు రికార్డులలో ఉందని సోషల్ ఆడిట్ బృందం నిజాలు వెలుగులోకి తెచ్చారు. పొరపాటు చేసిన సిఎస్‌పి బి ఈశ్వరమ్మ నుంచి 200 రూపాయలు రికవరీ చేస్తామన్నారు. అలాగే ఎడ్లూరపాడులో 8, తూమాడు 1. సతుకుపాడు 3 మృతి చెందిన వారికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు వెలుగులోకి తెచ్చారు. ఇకనుంచి ఇలా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఉపాధి పనులలో అక్కడ్కడ కొలతలలో చిన్నపాటి పొరపాటు జరిగాయని ఆయన తెలిపారు. ఈగ్రామ సభలలో ఎపిడి సుందరయ్య, ఎపిఓ వై వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి
పామూరు, ఫిబ్రవరి 15: మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఐద్వా జిల్లా కార్యదర్శి షేక్ సుల్తాన్‌బేగం ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఐద్వా జిల్లా శిక్షణ తరగతులు షాదీఖానాలో సయ్యద్ సెమి అధ్యక్షతన జరిగాయి. ఈసందర్భంగా సుల్తాన్‌బేగం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని, గ్రామాలలో మరుగుదొడ్లులేక అవస్తలు పడుతున్నారని, దాదాపు 50శాతం మరుగుదొడ్లులేని కుటుంబాలు ఉన్నాయన్నారు. విచ్చలవిడిగా ప్రతి గ్రామంలో మద్యం దొరుకుతోందని, ప్రభుత్వ పథకాల పేరుతో వేలకోట్ల రూపాయలు పాలకులు, నాయకులు కాజేస్తున్నారని విమర్శించారు. ఈకార్యక్రమంలో హబీబా, సిపిఎం నాయకులు హనీఫ్, మంగమ్మ, రహంతాబీ, రమణమ్మ, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి:ఎంపిడిఓ
కందుకూరు రూరల్, ఫిబ్రవరి 15: రానున్న వేసవి దృష్ట్యా మండల పరిధిలో గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఉద్దేశించి ఎంపిడిఓ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తాగునీటి అంశంపై ఎంపిడిఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసమావేశానికి తహశీల్దార్ శ్యాంబాబు, ఆర్‌డబ్ల్యూఎస్ డిఇ బి మోహన్‌రావు తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఎంపిడిఓ, తహశీల్దార్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామాలలోని మంచినీటి పథకాలను ముందుగానే పర్యవేక్షించి సమస్యలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన వ్యయ అంచనాలను తయారుచేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. వేసవిలో మండలంలో తాగునీటి సమస్య లేకుండా కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అధికారులకు వారు సూచించారు. ఈసమావేశానికి ఇఓఆర్‌డి రత్నజ్యోతి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మిశ్రమ పంటల ద్వారా రైతులకు మేలు
* కిసాన్‌వాణిలో జెసి లక్ష్మీనృశింహం
మార్కాపురం, ఫిబ్రవరి 15: రైతులు ఒకేపంటను సాగుచేస్తే ప్రకృతి వైపరిత్యాల కారణంగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని మిశ్రమ పంటలను సాగుచేస్తే రైతులకు మేలు చేకూరుతుందని ఆకాశవాణి మార్కాపురం రేడియో కేంద్రంలో రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కిసాన్‌వాణి కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీనృశింహం రైతులకు సూచించారు. ఈకార్యక్రమానికి ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ చుండూరి మహేష్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ రైతులు శ్రీవరిసాగు చేస్తే అతితక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందవచ్చునని తెలిపారు. కూరగాయల సాగువలన నిత్యం రైతులకు సంపాదన ఉంటుందని అన్నారు. బేస్తవారపేటకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు తనకు ఐదు ఎకరాల భూమి ఉందని, ఏ పంట సాగుచేసిన దిగుబడి రావడం లేదని, నీటి కొరత కారణంగా పంట దిగుబడి తగ్గుతుందని భావించి బోరు కూడా వేయించినప్పటికీ ఫలితం లేదని అధికారుల దృష్టికి తీసుకురాగా ఉద్యానవనశాఖ ఎడి రవీంద్రబాబు మాట్లాడుతూ ముందుగా భూసార పరీక్ష చేయించుకోవాలని, రసాయనిక ఎరువులను అధికంగా వాడటం వలన భూమి చౌడుశాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. చౌడు విరిగిపోవడానికి ప్రభుత్వం సబ్సీడిపై జిప్సమ్‌ను అందజేస్తున్నామని, స్ప్రింకర్లు వాడటం వలన నీటిని ఆదా చేయవచ్చునని, ఇందుకు ప్రభుత్వం 90శాతం సబ్సీడి ఇస్తుందని తెలిపారు. తోకపల్లికి చెందిన వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ సేంద్రియ ఎరువులు వాడటం వలన పంట నాణ్యతతోపాటు దిగుబడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తీగపంటలు సాగుచేసే రైతులకు నిలువురాళ్ళను ప్రభుత్వం సబ్సీడిపై అందించేందుకు చర్యలు చేపట్టాలని తర్లుపాడుకు చెందిన రైతు వెంకటేశ్వరరెడ్డి కోరగా 50శాతం సబ్సీడి ఇప్పించేందుకు చర్యలు చేపడతామని జెసి లక్ష్మీనృశింహం తెలిపారు. రైతు ఇంట్లో పాడి ఉంటే పంట వస్తుందని, పంట సాగుచేయాలంటే వర్మీకంపోస్టు అవసరమని, దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులు పశువులను పెంచుకోవాలని సూచించారు. మిరప పంట సాగు చేసుకునేందుకు అవసరమైన పట్టలను పెద్దసైజులో అందించేవిధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరగా వ్యవసాయ అధికారులతో చర్చించి అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడిఎ నరసింహులు, మార్కాపురం ఎడిఎ సుదర్శన్‌రాజు, ఎఓ బాలాజీనాయక్, పలువురు రైతులు పాల్గొన్నారు.