ముండ్లమూరు, ఫిబ్రవరి 15: మండలంలోని వెంకటాపురం గ్రామంలో అద్దంకి నాంచారమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 8.27 నిమిషాలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామానికి చెందిన 18 జంటలు పీఠలపై కూర్చుని పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 12 లక్షల రూపాయల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. దేవాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఎస్‌ఎస్‌ఎన్‌లో ఘనంగా సరస్వతి పూజలు
సంతనూతలపాడు, ఫిబ్రవరి 15: మండలంలోని ఎస్‌ఎస్‌ఎన్ ఇంజనీరింగ్ కళాశాల ముఖద్వారం వద్ద ఉన్న 40 అడుగులు సరస్వతి విగ్రహానికి శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకొని పూజలు నిర్వహించారు. ఈ పూజలలో బీహార్, జార్ఖండ్, ఛతీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, నేపాల్, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన విద్యార్థులు వారి సాంప్రదాయాల ప్రకారం ఒక పండుగలా సరస్వతిదేవికి పూజలు జరిపారు. ఎస్‌ఎస్‌ఎన్ విద్యాసంస్థల చైర్మన్ వై రామకృష్ణారెడ్డి, ఆయన సతీమణి రామలక్ష్మిలు విద్యార్థులతో మమేకమై సరస్వతిదేవికి పూజలు నిర్వహించారు. అనంతరం కళాశాలకు చెందిన 500 మంది విద్యార్థులకు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మనిషి సృష్టికి ప్రతిసృష్టి రోబో
సంతనూతలపాడు, ఫిబ్రవరి 15: రాబోవుకాలమంతా మనుషులతో సమానంగా యంత్రాలు రానున్నాయని ఎస్‌ఎస్‌ఎన్ విద్యాసంస్థల చైర్మన్ వై రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఎస్‌ఎస్‌ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు జరిగే రోబోటిక్ రీజనల్ పోటీలలో ఆయన పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాబోవు రోజుల్లో మనిషి చేసే ప్రతి పని రోబో చేస్తుందన్నారు. రోబోటిక్ టెక్నాలజీ అన్ని బ్రాంచీలకు సంబంధించిందని, మెకానికల్, ఇసిఇ, సిఎస్‌ఇ, ఇఇఇ విద్యార్థులు దీనిపట్ల అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఈ రోబోటెక్ రీజనల్ పోటీలలో పాల్గొనేందుకు రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 240 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న విద్యార్థులను ఐదుగురిని ఒక బృందంగా ఏర్పాటుచేసి వారికి కావల్సిన సాఫ్ట్‌వేర్ కిట్టు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రోబోపై అవగాహన కల్పించి శనివారం ప్రాక్టికల్స్ రోబో తయారీపై విద్యార్థులకు పోటీ ఉంటుందని రోబోటెక్‌కు సంబంధించిన నిపుణులు తెలిపారు. రోబో తయారీకి కావాల్సిన సాఫ్ట్‌వేర్, ఇతర ముడిసరుకును ఎస్‌ఎస్‌ఎన్ ఇంజనీరింగ్ కళాశాల సమకూరుస్తుందని తెలిపారు. ఈ పోటీలలో రోబోటెక్‌ను తయారుచేసే విధానం, దానిలోని భాగాలు గురించి విద్యార్థులకు వివరించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులను జాతీయస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమిత్‌సింగ్ గోద్వాల్, అతింద్రనాథ్‌దాస్, ప్రకాష్‌చంద్రలు రోబోటెక్ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఓడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బాలల విద్య దేశాభివృద్ధికి మూలం
హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ స్పష్టం
ఒంగోలు , ఫిబ్రవరి 15: ఉపాధ్యాయులు బాలలకు విద్యనేర్పించేటప్పుడు వారిలో ఉన్న తేజస్సు చూడాలని, కాలానుగుణంగా తల్లిదండ్రులు మారాలని, తద్వారా విద్యార్థులను మార్చవచ్చని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ అన్నారు. శుక్రవారం సంతపేట సాయిబాబా మందిరంలో ఎపి లిటిల్‌చాంప్స్ టాలెంట్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థులకు పురస్కార వేడుకల్లో గౌరవ అతిధిగా పాల్గొని మాట్లాడారు. మన తెలివితేటలు బలవంతంగా పిల్లలపై రుద్ద కూడదని, విద్యను నిర్లక్ష్యం చేయడం వలన అజ్ఞానం పెరుగుతుందన్నారు. విద్యార్థుల అభివృద్ధికి, ఉపాధ్యాయుల సేవలకు ప్రోత్సాహం అందిస్తున్న అకాడమీ కృషి అభినందనీయమన్నారు. విద్య మనిషికి బంగారు భవిష్యత్ కల్పిస్తుందని, అలాంటి విద్యను కొంతమంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థిలో శక్తిసామర్థ్యాలు ఉంటాయని, విద్యార్థులు సామాజికంగా, సాంస్కృతికంగా దేశానికి ఉపయోగపడాలన్నారు. విద్య కేవలం పుస్తకాలు చదవడమే కాదని, సమాజాన్ని కూడా చదవాలన్నారు. ఒత్తిడిలేని విద్యను అభ్యిసిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు అబ్ధుల్‌కలాం, అంబేద్కర్, గాంధీజీలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాలో, దానిని ఎలా అభివృద్ధి పథనంలో నడిపించాలో ఆలోచించాలన్నారు. ప్రభుత్వం చదువుకోసం, విద్యార్థుల భవిష్యత్‌కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. బాలల హక్కులు రాజ్యాంగంలో పొందు పరిచారని, 18 సంవత్సరాలలోపు బాలలు పని వదిలి బడిబాట పట్టాలన్నారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే అందుకు తగిన కృషి చేయాలన్నారు. కష్టపడే మనస్తత్వం ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. చదువుకోవడం బాలల హక్కు అయితే మంచి విద్యను అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అన్నారు. విద్యే మానవ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మార్గం చూపిస్తుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి చక్రధరరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థకు విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు చక్రాలలాంటివారన్నారు. సమాజంలో మానవ సంబంధాలు తగ్గుముఖం పడుతున్నాయని, బాల్యం నుండే విద్యార్థులకు తల్లిదండ్రులపట్ల ప్రేమను పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. చదువుతోపాటు విద్యార్థులకు సమాజంపట్ల అవాహన కల్పించాలన్నారు. ముందుగా ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలని కోరుతూ అకాడమీ రూపొందించిన సంచులను హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ ఆవిష్కరించారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జి రామ్‌గోపాల్, అకాడమీ గౌరవాధ్యక్షులు భవనాసి సుబ్రమణ్యం, కార్యదర్శి బుచ్చేశ్వరరావు, సాయి పాదసేవకులు అలహరి చెంచలరావు తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా సాయిబాబా మందిరంలో న్యాయమూర్తులు పూజలు నిర్వహించారు.