ఖమ్మం, ఫిబ్రవరి 17: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల్లో అత్యధిక డైరెక్టర్ స్థానాలను గెలుచుకొని చైర్మన్, వైస్‌చైర్మన్లను గెలుచుకుంటామని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ధీమాగా ఉన్నాయి. సోమవారం జరగనున్న ఎన్నికల్లో ఎవరికి వారు లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకొని గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో సిపిఎంకు పొత్తు కుదరకపోవటంతో కాంగ్రెస్ నాయకులు సిపిఎంతో కలిసి పని చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు వరంగల్ జిల్లా దంతాలపల్లి వద్ద సిపిఎం నాయకులతో గత శనివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించాయి. అయితే తెలుగుదేశం, సిపిఐ కూటమిలు మాత్రం అత్యధిక స్థానాలు గెలుచుకున్న తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని చెప్తున్నారు. కాంగ్రెస్‌లోనే తమకు సహకరించే వారు ఉన్నారని, లోపాయికారిగా వారితో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నామని ఓ టిడిపి సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ టిడిపి శిబిరంలో తమ వారు ఉన్నారని, ఓటు వారు తమకే వేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ గ్రూప్‌లో 16మంది, బిసి కేటగిరిలో 5 పోటీ పడుతుండగా, డిసిసిబి గ్రూప్ బిలో ఓసి విభాగంలో ఇద్దరు, బిసి కేటగిరిలో 4, ఎస్సీ కేటగిరిలో ఇద్దరు పోటీ పడుతున్నారు. గ్రూప్ ఏ లో ఎస్సీ కేటగిరిలో తలారి రాణి, ఎస్టీ కేటగిరిలో ఈసాల నాగేశ్వరరావు, గ్రూప్ బిలో ఎస్టీ కేటగిరిలో ధరావత్ బద్దులాలులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఓసి కేటగిరి నుంచి 10పదవులకు 16మంది బిసి కేటగిరిలో 2పదవులకు 5 బరిలో ఉన్నారు. గ్రూప్ బిలో ఐదు పదవులకు ఒకటి ఏకగ్రీవం కాగా, మిగిలిన నాలిగింటికి 8మంది బరిలో ఉన్నారు. వీరందరికీ ఎన్నికల గుర్తులను కేటాయించారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఎన్నిక జరగనున్నది. అనంతరం వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల బరిలో నిలిచిన వారి వివరాలిలా ఉన్నాయి.
డిసిసిబి గ్రూప్ ఏలో అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఆలపాటి రామచంద్రప్రసాద్, ఉమ్మినేని కోటయ్య, గూడపాటి శ్రీనివాసరావు, చింతనిప్పు సైదులు, తమ్మినేని కృష్ణయ్య, తుళ్ళూరి బ్రహ్మయ్య, దేవరల్లి వీరారెడ్డి, పాల నర్సారెడ్డి, పి కృష్ణమూర్తి, బాగం హేమంతరావు, బోడేపుడి రమేష్‌బాబు, రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, బోజడ్ల అప్పారావు, మువ్వా విజయబాబు, రాయల వెంకట శేషగిరిరావు, బిసి కేటగిలో కొత్వాల శ్రీనివాసరావు, కొంగర వెంకటనారాయణ, మండె వీరహన్మంతరావు, వెలిశాల చెన్నాచారి, యార్లగడ్డ చిన్న నర్సింహారావులు బరిలో నిలిచారు. గ్రూప్ బి ఓసి విభాగంలో దుబాకుల పిచ్చయ్య, షేక్ పుల్లా సాహెబ్, బిసి కేటగిరిలో కూరపాటి రంగరాజు, పిక్కెల సీతారాములు, మేకల మల్లిబాబు, వంగాల రామకోటేశ్వరరావు, ఎస్సీ కేటగిరిలో జనగం కోటేశ్వరరావు, మెండెం విశాక్‌బాబులు రంగంలో ఉన్నారు.
ఇదిలా ఉండగా టిడిపి సభ్యులకు ఆదివారం శిబిరం నిర్వహిస్తున్న పట్వాయిగూడెం వద్ద ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నమూనా పోలింగ్‌ను కూడా నిర్వహించారు. శిబిరంలో ఉన్న 47మంది ఓటింగ్‌లో పాల్గొనటమే కాకుండా ఎవరికి ఎలా వేయాలనే దానిపై ప్రణాళిక రచించి అమలుచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పది డైరెక్టర్ స్థానాలు గెలుచుకోవాలని, అందుకు అనుగుణంగా ఎవరు ఎవరికీ ఓటు వేయాలనే దానిపై ప్రత్యేకంగా శిక్షణను ఇచ్చారు. వీరంతా సోమవారం 12గంటల సమయంలో నేరుగా డిసిసిబి కార్యాలయానికి వచ్చి ఓటు వేయనున్నారు. మరో వైపు కాంగ్రెస్ సైతం ఇదే తరహా విధానాన్ని అవలంబిస్తోంది.
కాగా ఎన్నికల్లో తామెవరికి ఓటు వేయమని వైఎస్‌ఆర్‌సిపి కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ తరుపున ఎన్నికైన సభ్యులను తమ వైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకులు బేరసారాలకు దిగినట్లు ఆరోపణలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో సిపిఎంకు డిసిఎంఎస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. అయితే వైఎస్‌ఆర్‌సిపి నేతలు అనుకున్నట్లుగా ఓటింగ్‌కు దూరంగా ఉంటే తెలుగుదేశం గెలవటం సులభమవుతుంది.
కన్నుల పండువగా
శ్రీకుసుమ హరనాథ కల్యాణం
తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 17: తిరుమలాయపాలెం గ్రామంలో ఆదివారం శ్రీకుసుమ హరనాథ్‌ల కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. కన్నుల పండువగా జరిగిన స్వామివార్ల కల్యాణాన్ని తిలకించడానికి వందల సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కుసుమ హరనాథ్‌ల విగ్రహమూర్తులను ఎడ్లపెల్లి బుచ్చయ్య ఇంటివద్ద నుండి దేవాలయానికి తీసుకొని వచ్చారు. నూతన వధూవరులను అలంకరించి వేద మంత్రోచ్ఛారణల మధ్య మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివార్ల విగ్రహాలకు కల్యాణం నిర్వహించారు. పెళ్లి పీటలపై ఎడ్లపెల్లి బుచ్చయ్య, అరుణ, ఆకు వెంకటేశ్వర్లు, గురవమ్మ, మద్దినేని పానకాలు దంపతులు కూర్చొని కల్యాణం జరిపించారు. భక్తులకు అన్నదానం చేశారు.
అనంతరం స్వామివార్లను గ్రామంలో ఊరేగించారు. కల్యాణం సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో దుకాణాలను ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలస్యం వెంకటేశ్వర్లు, మద్దినేని వీరభద్రం, ఎడ్లపల్లి చలపతి, ఎడ్లపల్లి బుచ్చయ్య తదితరులు కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షించగా ఎఎస్‌ఐ వీరస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.