కురుక్షేత్ర, ఫిబ్రవరి 8: భారత దేశం ఒక గొప్ప, బలమైన దేశంగా తయారు కావాలంటే మానవ వనరులను పెంపొందించుకోవలసిన అవసరం ఉందని రాష్టప్రతి ప్రతిభా పాటిల్ స్పష్టం చేసారు. మానవ వనరులను పెంపొందించుకోవడంపై మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఫ్యాక్టరీలను పెట్టేది, వాటిని నడిపేది మానవ వనరులే. సేవలను అందించడం మొదలుకొని పరిశోధనలు చేపట్టడందాకా వివిధ కార్యకలాపాలను నిర్వహించేదీ మానవ వనరులే’ నని బుధవారం ఇక్కడ కురుక్షేత్ర విశ్వ విద్యాలయం స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాష్టప్రతి అన్నారు. సృజనాత్మక ఆలోచనలు, ధోరణులకు కేంద్ర బిందువులు మనుషులేనని, ఈ ఆలోచనలు మనిషిలో ఎన్నో రకాల మార్పులను తీసుకు వస్తాయని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రాంగులామ్, హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడాలకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసారు. విశ్వవిద్యాలయం చాన్సలర్ కూడా అయిన రాష్ట్ర గవర్నర్ జగన్నాథ్ పహాడియా ఈ అవార్డులను ప్రదానం చేసారు. ఈ సందర్భంగా రాష్టప్రతి వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేసారు. 181 మంది పిహెచ్‌డి స్కాలర్లకు, పలువురు ఎంఫిల్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కూడా ఆమె డిగ్రీలను ప్రదానం చేసారు. బంగారు పతకాలు పొందిన వారంతా కూడా విద్యార్థినులే కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన రాష్టప్రతి, మరింత ఎక్కువ కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
(చిత్రం) బుధవారం కురుక్షేత్ర విశ్వ విద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్టప్రతి ప్రతిభా పాటిల్, మారిషన్ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గులామ్, హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా.