లక్నో, ఫిబ్రవరి 8: నేతల వాగ్యుద్ధాలతో వాడివేడిగా ప్రచారం జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ప్రధాన రాజకీయ పక్షాలు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు మాత్రం భారీ సంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ముందుకు రాలేదు. 64 శాతం మంది ఓటర్లు ఓట్లు వేశారు. ఉదయం పూట చాలా చోట్ల వర్షం పడటం కూడా ఇందుకు ఒక కారణం.
వాతావరణం అననుకూలంగా ఉండటంతో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వర్షం నిలిచిపోయిన తర్వాత వేగం పుంజుకుంది. ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి, సమాజ్‌వాదీ పార్టీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఈ తొలి విడతలో పది జిల్లాల పరిధిలోని 55 నియోజకవర్గాల్లో ఒక కోటి 70 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళలు 70 లక్షల మంది ఉన్నారు. సీతాపూర్, బారాబంకి, ఫజియాబాద్, అంబేద్కర్ నగర్, బహ్రాయిచ్, శ్రవస్తి, బలరాంపూర్, గోండా, సిద్దార్థనగర్, బస్తీ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో జరిగిన ఈ పోలింగ్ సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ తొలి దశ పోలింగ్ జరిగిన 55 నియోజకవర్గాల్లో మొత్తం 862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 796 మంది పురుషులు, 65 మంది మహిళలు, ఒక హిజ్రా ఉన్నారు.
403 మంది సభ్యులు గల ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఈ తొలి దశ ఎన్నికల్లో ఇద్దరు మంత్రులు, 31 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 15 మంది మాజీ మంత్రుల భవితవ్యం తేలనుంది. ఉదయం పూట వర్షం అంతరాయం కలిగించడంతో మధ్యాహ్నం తర్వాత అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి కనిపించారు. పోలింగ్ మొదలైన తొలి గంటల్లో వర్షం కురవడం పెద్ద సమస్యగా మారిందని, అయితే తర్వాత వర్షం ఎడతెరిపినివ్వడంతో ఓటర్ల నుంచి మంచి స్పందన కనిపించిందని ప్రధాన ఎన్నికల అధికారి ఉమేష్ సిన్హా పేర్కొన్నారు.
సీతాపూర్ జిల్లా మిస్రిక్ నియోజకవర్గంలోని గులారియా గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని నిరసిస్తూ పోలింగ్‌ను బహిష్కరించారు. ఇవిఎంలు సరిగా పనిచేయలేదని ఫిర్యాదులు వచ్చిన బహ్రాయిచ్ జిల్లాలో తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. గోండా జిల్లా మెహ్నాన్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 34లో ఓటు వేయాల్సిన 800 మంది ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. తమ పోలింగ్ కేంద్రాన్ని గ్రామానికి మూడు కిలో మీటర్ల దూరానికి తరలించారని నిరసిస్తూ వారు పోలింగ్‌ను బహిష్కరించారు.
చిత్రం...
యుపి అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా బుధవారం బారాబంకిలోని ఓ పోలింగ్ కేంద్రం ముందు తమ ఓటరు గుర్తింపు కార్డులతో బారులు తీరిన మహిళా ఓటర్లు