జూపాడుబంగ్లా, ఫిబ్రవరి 17: జిల్లాలో పలుచోట్ల శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పెద్దఎత్తున పంట నష్టం వాటిల్లింది. చాలా గ్రామాల్లో చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. కల్లాల్లో ఉన్న పంట దిగుబడి తడిసి పోయింది. విద్యుత్ స్త్భాలు నేలకొరగడం, తీగలు తెగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. పెద్దపెద్ద చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కొంతమేరకు రాకపో కలకు అంతరాయం కలిగింది. జూపాడుబంగ్లా మండల పరిధిలోని మండ్లెం, తంగెడంచ, తాటిపాడు, తరిగోకుల గ్రామాల రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయానే్న నందికొట్కూరు వ్యవసాయ శాఖ ఎడి ఆంజనేయులు, జూపాడుబంగ్లా ఎఓ ఇందుమతి, ఎఇఓ నాగేష్, వెంకటేశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతుల పొలాలను అధికారులు పరిశీలించారు. ప్రాథమిక విచారణ ప్రకారం పంట నష్టం రూ. 3 కోట్లకు పైగానే వుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వడగండ్ల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులు సోమవారం సాయంత్రంలోగా నష్టం వివరాలను అర్జీ రూపంలో అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రైతు లు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, సీడ్‌జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, పప్పుశనగ, ఎండుమిర్చి, మినుము, కంది, కొర్ర తదితర పంటలను సాగు చేశారు. అయితే మరో 15 రోజుల్లో చేతికొచ్చే పంటలు శనివారం రాత్రి కురిసిన భారీ వడగండ్ల వానకు నేల మట్టమయ్యాయి. వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
వడగండ్లతో ఐదుగురికి గాయాలు
నందికొట్కూరు : మండల పరిధిలోని నందికొట్కూరు, మల్యాల, నాగటూరు, బిజినవేముల గ్రామాల్లో శనివారం రాత్రి గాలి, వాన బీభత్సవంలో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు, పంటలు పూర్తిగా నేలకొరిగాయి. దీంతో విద్యు త్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలో గడిపారు. మల్యాల గ్రామంలో వడగండ్ల వాన వల్ల నబీ తలకు తీవ్ర గాయాలు కాగా బిచ్చమ్మ, చిట్టమ్మ, అబ్దుల్లా, వేణుగోపాల్ నాయుడుకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక్క మల్యాల గ్రామ సమీపంలోని 200 విద్యుత్ స్తంభాలు, 8 ట్రాన్స్‌పార్మర్లు నేలకొరిగి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని విద్యుత్ ఎడిఎ హరిప్రసాద్ తెలిపారు. అలాగే మండల పరిధిలోని 350 ఎకరాల్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు తదితర పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కాగా బొల్లవరం గ్రామంలో రైతు సాగు చేసిన మునగ పంట, గాలివాన దెబ్బకు నేలకొరిగాయి. పగిడ్యాల మండలంలోని లక్ష్మాపురం, ప్రాతకోట, సంకిరేణిపల్లె, నెహ్రూనగర్, ముచ్చుమర్రి గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలు నేలమట్టం కావడంతో లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ నష్టం వాటిల్లినా ఏ అధికారి కూడా తమ పొలాల వైపు తిరిగి చూడలేదని రైతులు వాపోయారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రైతులు కోరారు.
చాగలమర్రిలో..
చాగలమర్రి : మండలంలో శనివారం అర్థరాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము వరకు ఈదురగాలులతో కూడిన భారీవర్షం కురిసింది దీంతో పలు పంటలు దెబ్బతిన్న రైతులు భారీ నష్టానికి గురయ్యారు. పొలాల్లో కోసిన పంటలు, కోతకు సిద్దంగా ఉన్న పంటలు దెబ్బతినడంతో లక్షల్లో నష్టాలు వచ్చాయని రైతులు వాపోతున్నారు. శెట్టివీడు గ్రామంలో వర్షానికి అరటి, మునగచెట్లు నేలకొరిగాయి. గేలతో ఉన్న అరటిచెట్లు కూలిపోవడంతో రైతులు నష్టాలకు గురయ్యారు. చిన్నవంగలి, పెద్దవంగలి, పెద్దబోధనం, చిన్నబోధనం, చింతలచెరువు, చాగలమర్రి తదితర గ్రామాల్లో పంట పొలాల్లో కోసివుంచిన జొన్న, వేరుశెనగ పంట వర్షం పాలైంది. కొందరు రైతులు హుటాహుటిన కోసి వుంచిన పంటపై ప్లాస్టిక్ పట్టాలు కప్పారు. పసుపుతోటలు జలమయం కావడంతో పసుపుకొమ్మలు కుళ్లిపోతాయని రైతులు అందోళన చెందుతున్నారు. మొత్తం మీద ఈ అకాల వర్షం రైతులకు మేలుచేయడం అటుంచి కన్నీటిని మిగిల్చింది. ప్రభుత్వం అదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. తహశీల్దార్ శివరామిరెడ్డి మాట్లాడుతూ వర్షపాతం 5.6 సెంటిమీటర్లు నమోదైనట్లు తెలిపారు. డివిజన్ మొత్తం మీద చాగలమర్రిలోనే అధికవర్షం పడిందని తెలిపారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు : డివిజన్ పరిధిలో శనివారం ఆర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా మిర్చి పంట రైతులకు తీరని నష్టం మిగిల్చింది. వేరుశెనగ, మొక్కజొన్న రైతులు కూడా ఈ వర్షంతో నష్టపోయారు. ఆత్మకూరు మండలంలో 2.73 సె.మీ వర్షపాతం నమోదైంది. దీంతో పొలాల్లో కుప్పలుగా వున్న పంట దిగుబడులు, అమ్మకానికి సిద్ధంగా వుంచిన పంట దిగుబడి దెబ్దతిన్నాయి. ఆత్మకూరు డివిజన్‌లో 2 వేల హెక్టార్లలో సాగు చేసిన మొక్కజొన్న, శనగ, వేరుశెనగ, పత్తి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు, వెలుగోడు మండలాల్లో సాగు చేసిన పంటలు వర్షం దెబ్బకు పూర్తిగా నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మండల రైతులు కోరుతున్నారు.
* పంటలు నేలమట్టం.. * తడిసిన ఎండుమిర్చి * నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు..
english title:
rains
Date:
Monday, February 18, 2013