బేతంచర్ల, ఫిబ్రవరి 17: రాష్ట్ర ప్రభు త్వం సర్‌చార్జీ పేరుతో విద్యుత్ బిల్లులను విపరీతంగా పెంచడాన్ని నిరసి స్తూ ఆదివారం వ్యవసాయ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో స్థానిక పాతబస్టాండ్‌లో నల్లజెండాలు ఎగురవేశారు. తొలుత వారు విద్యుత్ బిల్లులను తగులబెట్టి నిరసన తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు పెంచి రైతులు, కార్మికుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడి 48 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో బొగ్గు, గ్యాస్ ఉత్పత్తులు పుష్కలంగా వున్నా విద్యుత్‌ను సరఫరా చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందన్నారు. విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు విక్రయించడంవల్లే ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఆర్టీసీ చార్జీలు, కిరోసిన్, నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేసి మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. సంపన్న వర్గాలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు, విదేశీ, స్వదేశీ, బహుళజాతి సంస్థలకు రాయితీలుగా కోట్లాది రూపాయలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని సూచించారు. కార్యక్రమంలో వ్య.కా.స జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లయ్య, మండల కార్యదర్శి వేణుగోపాల్, సిఐటియు వివిధ అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు, రాముడు, నీలకంఠం, సోమరాజు, పరమేశ్వరప్ప పాల్గొన్నారు.
ఆర్‌యు అభివృద్ధికి
రూ. 73 కోట్లతో ప్రతిపాదనలు:విసి
మహానంది, ఫిబ్రవరి 17: కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం అభివృద్ధి కొరకు 2013-14కు గాను రూ. 73 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు వైస్ ఛాన్స్‌లర్ కృష్ణానాయక్ తెలిపారు. ఆదివారం ఆయన మహానంది క్షేత్రంలో పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అభివృద్ధికి టీచర్స్‌డే సందర్భంగా కర్నూలుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రూ. 165 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు. అందులో రూ. 25 కోట్ల అభివృద్ధి పనులకు వివరణ అడిగినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో యూనివర్శిటికి మంచి పేరు ఉన్నందున అభివృద్ధి కొరకు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తే వేగవంతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయంలో క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కొరకు సబ్‌ప్లాన్ ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల, అధ్యాపకుల, ఉద్యోగుల కొరకు ప్రత్యేక ప్యాకేజి కింద కోటి రూపాయలు యూనివర్శిటికి ఇవ్వాలని కమిటి ద్వారా ప్రతిపాదించడం జరిగిందన్నారు. 12బి స్టేటస్ కొరకు రాయలసీమ యూనివర్శిటి సన్నద్దం అవుతుందన్నారు. నిధుల కొరకు కమిషన్ కమిటీ వారు పరిశీస్తే కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు అవుతాయని దాని వల్ల మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. 2012-13 గాను యూనివర్శిటికి జీతాలకు మాత్రమే బడ్జెట్ ఇచ్చిందని రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటి అభివృద్ధికి ఒక్కొక్కటికి రూ. 10 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం రాయలసీమ యూనివర్శిటికి మాత్రం నిధులు మంజూరు చేయలేదన్నారు. దానికోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. యూనివర్శిటిలో పుస్తకాలు, రసాయనల కొనుగోలులో సమన్వయం లోపాల వల్ల అంతర్గత విబేధాలు తలెత్తాయని త్వరలోనే కొలిక్కివస్తాయని వాటిని ప్రేరేపించేవారికి త్వరలోనే బుద్దిచెబుతామన్నారు. ఈయూనివర్శిటి కింద 129 కళాశాలలు, 55 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ కో-అర్డినేటర్ శేషయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 32 లక్షల మంది సమాజసేవను అందిస్తున్నారన్నారు. వీరి వెంట రామకృష్ణ డిగ్రీ కళాశాలల అధినేత రామకృష్ణారెడ్డి, ఇఓ దివాకర్‌బాబు, ఎఇ శ్రీనివాసప్రసాద్, పర్యవేక్షకులు రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.