విజయనగరం, ఫిబ్రవరి 18: పార్టీలో చేరాలంటే ముందుగా జైలుకెళ్లి నాయకుడిని కలవాల్సిందేనా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిపై పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చురకలు వేశారు. విజయనగరంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవకాశం లభించిందని, ఇప్పటికే సహకార ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో స్థానిక ఎన్నికలకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై న్యాయస్థానం స్పందించిన తీరును తాము ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి ఈ తీర్పు నిదర్శనమని పేర్కొన్నారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న వివాదంపై తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు తాము భయపడుతున్నామంటూ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పామన్నారు. ఒకప్పుడు రాజకీయ రంగప్రవేశం చేయాలనుకునే ఔత్సాహికులు, అప్పటికే తలపండిన సీనియర్ నేతలు తమ ఇష్టదైవాలను తలచుకుని, చేరాలనుకునే పార్టీ కార్యాలయానికి వెళ్ళేవారు.. కొత్తగా పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునే వారు తొలుత చంచల్‌గూడ జైలుకెళ్ళి తర్వాత పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నారంటూ వ్యంగ్య విమర్శ చేశారు. వైకాపాతో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టైందన్నారు. కాంగ్రెస్‌ని వీడుతున్న వారివల్ల నష్టం లేదని పేర్కొన్నారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘన విజయం పార్టీపట్ల ప్రజాదరణకు నిదర్శనమన్నారు. ప్రతి ఎన్నికలు పాలనకు రిఫరెండంగా భావించలేమని, అయితే వచ్చిన ఫలితాలు తమ పనితీరుకు అద్దం పడతాయని పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై ప్రజల్లో వ్యితిరేక ప్రభావం ఉన్నప్పటికీ పరిస్థితులను అర్ధం చేసుకుంటారని అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల మేరకు రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల సరుకులను రాయితీపై ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఇక వైకాపా తరపున పాదయాత్ర చేస్తున్న షర్మిల విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. తెలంగాణ విభజన అంశంపై పిసిసి చీఫ్‌గా అన్ని ప్రాంతాల అభిప్రాయాలను అధిష్ఠానానికి వివరిస్తానని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన స్థానంలో తానున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తున్నారనేందుకు ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో ఘనవిజయమే నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికలన్నీ రెఫరెండం కాదని, అయితే సహకార ఎన్నికల్లో లభించిన విజయంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకం వెల్లడయిందన్నారు. విపక్ష నేత చంద్రబాబు తాను పాదయాత్ర చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి పట్టించుకుంటోందనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బాబు పాదయాత్రల్లో భాగంగా ఇస్తున్న హామీలపై తాను స్పందించలేనన్నారు. బాబు తనకున్నది బలమనుకుంటున్నారని, అది వాపు మాత్రమేనని చురకంటించారు. అధికారం వద్దంటూనే తనను గెలిపించాలని కోరుతున్నారని విమర్శించారు.
* రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంది * పిసిసి అధ్యక్షుడు బొత్స స్పష్టీకరణ
english title:
botsa
Date:
Tuesday, February 19, 2013