అమృతలూరు, ఫిబ్రవరి 18: దేశ, రాష్టవ్య్రాప్తంగా మహిళలపై అత్యాచారాలు సాగిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి రక్షణ కల్పించే ప్రయత్నం చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లాలో ‘వస్తున్నా... మీకోసం’ పాదయాత్ర 12వ రోజు సోమవారం అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో సాగింది. ఈసందర్భంగా చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఇది చేతగాని, అసమర్థ, అవినీతి ప్రభుత్వమని, రాష్ట్రాన్ని దోచుకోవటం వైఎస్‌ఆర్‌తో ప్రారంభమైందని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేవని, ఎరువులు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. లైలా, జల్ తుపాన్లలో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ సాయం అందలేదన్నారు. నేటి పాలకులకు రైతుల పట్ల శ్రద్ధ లేదని, ప్రభుత్వం పనితీరు వాతావరణ కేంద్రాల పనితీరు మాదిరిగానే ఉందని ఎద్దేవా చేశారు. రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారంపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపటంలో అలక్ష్యం వహించిన నాయకులు వారి స్వవిషయాల్లో మాత్రం ఢిల్లీకి వెళుతున్నారన్నారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు క్షేత్రస్థాయిలో ఎంపిలు, ఎమ్మెల్యేల పరామర్శలు లేవని, అధికారులను అప్రమత్తం చేసిన దాఖలాలూ లేవన్నారు. రానున్న రోజుల్లో టిడిపి అధికారంలోకి రాగానే వ్యవసాయ అవసరాలకు రైతులు చేసిన రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పనులు చేయించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. గిట్టుబాటు ధర, రుణమాఫీ, తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు 10వేల రూపాయల పరిహారం ఇచ్చేంతవరకూ పోరాటం చేస్తామన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో రాష్ట్రాన్ని దోచిపెట్టారని, స్వపరిపాలన, సుస్థిరమైన పాలన టిడిపితోనే సాధ్యమన్నారు. నేటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా అవినీతిని పెంచి పోషిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు కంపెనీల ద్వారా సంపాదించిన ప్రజాధనంతో ఎంపిలు, ఎమ్మెల్యేలను పిల్లకాంగ్రెస్ కొనుగోలు చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదరికం లేని సమాజం చూడాలనే తాను పోరాటం చేస్తున్నానని చెప్పారు.
* కాంగ్రెస్ సర్కార్‌పై చంద్రబాబు ధ్వజం
english title:
chandra babu
Date:
Tuesday, February 19, 2013