విశాఖపట్నం, ఫిబ్రవరి 18: సిమ్స్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కోట్లాది రూపాయలను వసూలు చేసి బోర్డు తిప్పేసిన సిమ్స్ సంస్థ ఎండి సురేంద్ర గుప్త పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. డైరెక్టరు ఇద్దరిని గతంలోనే పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సోమవారం డైరెక్టర్ జగ్గారావుతోపాటు, మరో ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా సిమ్స్ సంస్థకు జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌లపై పోలీసులు సోమవారం దాడులు జరిపారు. హార్డ్ డిస్క్‌లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎండి భార్య పేరిట బదిలీ అయిన ఆస్తుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. సంస్థకు బాగా డిపాజిట్లు సేకరించి పెట్టిన ఏజెంట్లకు, డైరెక్టర్లకు కార్లు, ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థకు చెందిన స్థిర, చరాస్తుల వివరాలను సేకరిస్తున్నారు. సాయంత్రం వరకూ ఎండి సురేంద్ర గుప్తాను, డైరెక్టర్లను ఒకే దగ్గర పోలీసులు విచారిస్తున్నారు. డిసిపి విశ్వప్రసాద్ మాట్లాడుతూ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని, నగరంలోని ఇటువంటి ఫైనాన్స్ సంస్థలపై నిఘా ఉంచామని తెలియచేశారు. సిమ్స్ ఎండి గుప్తతో ఆదివారం ఐదుగురు బాధితులు మాట్లాడారు. సోమవారం కూడా కొంతమంది పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి గుప్తతో మాట్లాడించమని కోరారు. పోలీసులు అందుకు నిరాకరించారు. కాగా, సిమ్స్ బాధితులకు మద్దతుగా, టిడిపి, వైకాపా, డివైఎఫ్‌ఐ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సిమ్స్ సిఎండి గుప్తాపై 402, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను మంగళవారం కోర్టుకు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
* హార్డ్ డిస్క్‌లు, రికార్డులు స్వాధీనం
english title:
sims
Date:
Tuesday, February 19, 2013