కడప, ఫిబ్రవరి 18: చివరి రెండు రోజుల్లో గందరగోళం రేపిన కడప వైఎస్సార్ జిల్లా సహకార ఎన్నికల్లో అంతిమ విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే వరించింది. ప్రాథమిక సహకార ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి వైకాపా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే వైకాపా అధినేత జగన్‌ను ఆయన సొంత జిల్లాలోనే దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మొదటి నుండి ఎత్తులు వేస్తూనే ఉన్నారు. అందివస్తుందనుకున్న ఏ అవకాశాన్ని వదల్లేదు. వైకాపాకు అనుకూలంగా ఉన్న సహకార సంఘాల ఎన్నికలను వాయిదా వేయించారు. దీనికి తోడు అత్యంత నమ్మకంగా డిఫాల్టర్ అస్త్రం ప్రయోగించారు. ఆయన అభిప్రాయానికి అనుగుణంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలతో మిలాఖత్ అయ్యారు. స్థానిక మంత్రులు సహకరించకపోయినా ముఖ్యమంత్రి పట్టుదలతో పావులు కదిపారు. కడప జిల్లా ఇంచార్జి మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా చక్రం తిప్పారు. ఆఖరి రోజున పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా రంగంలోకి దిగారు. దీనితో రెండు రోజుల క్రితం వరకు వైకాపాకు అనుకూలంగా ఉన్న వాతావరణం ఆదివారం రాత్రికి మారిపోయింది. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపించింది. దీనితో ఆ పార్టీ నేతల్లో ధీమా పెరిగింది. కానీ ఆఖరి నిముషంలో అన్నీ తారుమారయ్యాయి. జిల్లాలో వైకాపా సాధిస్తున్న ఎన్నికల ఫలితాలు పునరావృతమయ్యాయి. డిసిసిబి ఎన్నికలకు సంబంధించి రిజర్వు కేటగిరీలో డైరెక్టర్ పదవులు పక్కన పెడితే మొత్తం 14 డైరెక్టర్ పదవులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ఇంతకు ముందే పది మంది డైరక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో ఆరుగురు వైకాపా మద్దతుదారులుండగా నలుగురు కాంగ్రెస్ మద్దతుదారులు ఉన్నారు. మిగిలిన నాలుగు స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండు కాంగ్రెస్, రెండు వైకాపాకు దక్కాయి. చివరకు డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్ పదవులకు వైకాపాకు చెందిన తిరుపాల్‌రెడ్డి, ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి ఎన్నికకు మార్గం సుగమమయింది. చివరి నిముషంలో మాజీ ఎంపి మైసూరారెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రంగంలోకి దిగడంతో కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిన సీన్ తలకిందులయిందని తెలుస్తోంది. జిల్లా మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కూడా అందుకు సహకరించారని కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడం కొసమెరుపు.
* సీను మార్చిన మైసూరా, వివేకా
english title:
kadapa
Date:
Tuesday, February 19, 2013