మిర్యాలగూడ, ఫిబ్రవరి 18: మీ ఆత్మాభిమానమే నన్ను వెయ్యి కిలోమీటర్లు నడిపించిందని వైకాపా అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల అన్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుండి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారానికి నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామం కాల్వకట్టకు చేరడంతో వెయ్యి కిలోమీటర్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ కుమ్మక్కు రాజకీయాలతో తమ స్వార్థం కోసం ఎదుటివారిని బలిచేసి అధికార, ప్రతిపక్షపార్టీలు ఆనందిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించారని, కాని ఆయన మరణానంతరం ప్రజలు పన్నుల భారాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరగడంతో కంటతడి పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు. మళ్లీ మన జగనన్న రాజ్యం వస్తుందని, అప్పుడు మన కష్టాలు తొలగిపోతాయని ప్రజలకు తెలిపారు. మీ అందరి ఆశీస్సులు జగనన్నకు అందిస్తే అది సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ వ్యక్తిని కదిలించినా కన్నీటిపర్యంతమవుతున్నారని ఆమె అన్నారు. ప్రజలు భారాలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఉండడం కన్నా ఊడడం మంచిదని ఆమె ఎద్దేవా చేశారు. శాసనసభలో కాంగ్రెస్‌ప్రభుత్వం మైనార్టీలో పడ్డా అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్, టిడిపిల మద్య చీకటి ఒప్పందం జరగడం వల్లే బాబు అవిశ్వాసం పెట్టడం లేదని ఆమె విమర్శించారు. (చిత్రం) వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతున్న షర్మిల
మీ ఆత్మాభిమానమే నన్ను వెయ్యి
english title:
sharmila
Date:
Tuesday, February 19, 2013