శ్రీకాకుళం, ఫిబ్రవరి 18: యుపిఏ ప్రభుత్వహయాంలో రాష్ట్రం ఐటి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించిందని కేంద్ర ఐటి శాఖ సహాయమంత్రి కిల్లి కృపారాణి పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఆమె విలేఖరులతో కాంగ్రెస్ హయాంలో 4,700 కోట్ల రూపాయలతో పోస్టల్ రంగాన్ని అభివృద్ధిపరచి ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఐటి రంగాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. పోస్టల్ శాఖలో ఆన్‌లైన్, ఎటిఎం, ఆధార్, నగదుబదిలీ తదితర సేవలు విస్తృత పరుస్తున్నామన్నారు. ఆటోమేటిక్ మెయిల్ ప్రొసెస్ కేంద్రాలు ఏర్పాటుచేసి ఆధునిక సేవలు అందిస్తామన్నారు. 1999లో రెండుకోట్ల ల్యాండ్‌లైన్ ఫోన్లు ఉండేవని, అది ఇప్పుడు 92 కోట్ల రూపాయలకు చేరాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు 50 లక్షల కనెక్షన్లు ఉండేవని, ఇప్పుడు 32 కోట్లకు చేరాయని తెలిపారు. సెల్ వినియోగదారులు 300 మిలియన్లు నుండి 936 మిలియన్లకు చేరారన్నారు. అర్బన్ ప్రాంతంలో 76 శాతం జరుగగా గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది నుండి 40 శాతం వరకు సెల్‌వినియోగం పెరిగిందని పేర్కొన్నారు. నేషనల్ ఆప్టికల్స్ సైబర్ నెట్‌వర్క్ పేరిట దేశవ్యాప్తంగా 2.50 లక్షల గ్రామపంచాయతీలలో నెట్‌వర్క్‌సేవలను విస్తరిస్తామన్నారు. వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినే అని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో సమైక్యాంధ్ర ఫోరం నిర్వహించిన కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
25న శ్రీహరికోటకు రాష్టప్రతి ప్రణబ్ రాక
నెల్లూరు సిటీ, ఫిబ్రవరి 18: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జి ఈ నెల 25న మధ్యాహ్నం 12.35 గంటలకు చెన్నై నుండి హెలికాప్ట్‌ర్ ద్వారా శ్రీహరికోట సతీష్ థావన్ స్పేస్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ నుండి 2 గంటలకు భాస్కర్ అతిథి గృహంలో బస చేస్తారు. ఆరోజు రాత్రి 7గంటలకు జరిగే పిఎస్‌ఎల్‌వి సి -20 రాకెట్ ప్రయోగాన్ని వీక్షిస్తారు. 26న ఉదయం శ్రీహరికోట నుండి హెలికాప్ట్‌ర్‌లో బయలుదేరి చెన్నై వెళ్లి అక్కడ నుండి విమానంలో ఢిల్లీకి వెళతారు.
షార్ డైరెక్టర్‌కు నాయుడమ్మ పురస్కారం
నెల్లూరు, ఫిబ్రవరి 18: నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ సంస్థ ప్రతి సంవత్సరం అందజేసే ప్రతిష్టాత్మక నాయుడమ్మ పురస్కారానికి శ్రీహరికోట షార్ డైరెక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌ను ఎంపిక చేశారు. మార్చిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నాయుడమ్మ 18వ స్మారకోపన్యాసం చేసి ప్రసాద్ అవార్డును అందుకోనున్నారు. సోమవారం ఈ మేరకు నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ డైరెక్టర్ డాక్టర్ ఏ జగదీష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే ఈ అవార్డు పొందిన ప్రముఖుల్లో డాక్టర్లు కె కస్తూరి రంగన్, ఆర్ నటరాజన్, ద్రోణంరాజు కృష్ణారావు, పి రామారావు, పి రామచంద్రరావు, కిరిత్‌పారిక్, గోవర్ధన్ మెహతా, విఎస్ రామమూర్తి, అనిల్ కకోడ్కర్, ఎస్ రామాదొరై, నందన్ నీలంకని, వి రాజన్నతోపాటు అంతర్జాతీయ స్థాయిలో ప్రొఫెషర్లు టి నెజాత్ వెజిరోగ్లు (అమెరికా), బెర్నాడ్ అమడై (అమెరికా), గౌత్ జాస్మన్ (మలేషియా) ఉన్నారు.
ఎంజి బ్రదర్స్ ఎండికి జైలు
నెల్లూరు , ఫిబ్రవరి 18: రాష్ట్ర ఫోరం ఇచ్చిన తీర్పును అమలు చేయక నిర్లక్ష్యం చేసినందుకు గాను నెల్లూరులోని ఎంజి బ్రదర్స్ ఎండికి నెల రోజులు జైలు శిక్ష విధిస్తూ జిల్లా ఫోరం సోమవారం తీర్పు చెప్పింది. జైలు శిక్ష పడిన ప్రతివాది ఎండిని అరెస్టు చేసి, తన ముందు హాజరుపర్చాలని జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ ఫోరం చైర్మన్ పివి కృష్ణమూర్తి ఆదేశాలు జారీ చేసారు. ఫిర్యాది వాసుదేవారెడ్డి తన టాటా ఎస్టేట్ వాహనాన్ని ప్రతివాది కంపెనీలో రిపేరు కోసం ఇచ్చారు. ఇంజన్ మార్చాలని చెప్పి ఆరు నెలల గ్యారంటీతో కొత్త ఇంజన్‌ను వాహనానికి బిగించారు. ఇందుకు గాను కంపెనీవారు 30 వేల 746 రూపాయలు ఫిర్యాదు నుండి 1999 మార్చి 19న ఇచ్చాడు. కాగా ఇంజన్ తరచు రిపేరు రావటంతో తనకు న్యాయం చేయమని జిల్లా ఫోరంలో కేసు పెట్టాడు. సాంకేతిక కారణాల వల్ల ఫిర్యాదును కొట్టివేసింది. అతడు రాష్ట్ర ఫోరంను ఆశ్రయించాడు. రాష్ట్ర ఫోరం ఫిర్యాది వాహనాన్ని రిపేరు చేసి ఇవ్వాలని, నష్టపరిహారంగా 30 వేలు ఇప్పించాలని తీర్పు చెప్పింది.