ఘట్‌కేసర్, ఫిబ్రవరి 9: భారతదేశపు భవిష్యత్తు భావితరాలపైనే ఆధారపడి ఉందని, దేశం అభివృద్ధి చెందాలంటే యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఘట్‌కేసర్ మండల పరిధి యంనంపేట్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో సంస్థ కార్యదర్శి కెటి మహికి కర్ణాటక యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందజేసిన సందర్భంగా గురువారం సన్మాన కార్యక్రమంతో పాటు కళాశాల 15వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాదెండ్ల మనోహర్ మట్లాడుతూ చేస్తున్న పనిలో వృత్తి నైపుణ్యాలను పెంచుకుని సమిష్టిగా పని చేసినపుడే అభివృద్ధి సాధ్యమన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమాజాభివృద్ధికి కూడా కృషి చేస్తున్న కళాశాల కార్యదర్శి మహి ఆదర్శప్రాయుడన్నారు. అనంతరం మహి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్య ద్వారానే మన దేశం ఐటి రంగంలో అగ్రస్థానంలో నిలిచిందని, వృత్తి విద్య కళాశాలలు నాణ్యమైన విద్యనందించి నిపుణులను తయారుచేయడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా మహికి స్పీకర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెటి సరితామహి, కార్యనిర్వాహక డైరెక్టర్ డా.నర్సింహరెడ్డి, ప్రిన్సిపాల్ వాసుదేవరావు, ప్రొఫెసర్లు మూర్తి, ఉమాకాంత్‌శాస్ర్తీ, కొమురయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
భావితరాలపైనే దేశ భవిష్యత్తు: స్పీకర్ నాదెండ్ల
english title:
fgg
Date:
Friday, February 10, 2012