నేరేడ్‌మెట్, ఫిబ్రవరి 9: ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని 15 గుడిసెలు పూర్తిగా కాలిపోయిన సంఘటన గురువారం మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లికార్జుననగర్‌లో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా అలూరు, దేవనకొండ, తుగ్గలి, చక్రాల, కొత్తకోట ప్రాంతాలకు చెందిన 15 కుటుంబాలు దాదాపు 15 ఏళ్ళ క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మల్కాజిగిరిలోని మల్లికార్జుననగర్‌లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉండే రాములు, ఓబులేష్, మద్దిరెడ్డి, మధు, మురళి, బాలకృష్ణ, అన్నయ్య, బాలన్న, గంగన్న, రంగనాయక్, రంగస్వామి, పెద్ద రమేష్, చిన్న రమేష్, రామాంజనేయులు, గోపాల్ కుటుంబాలు శివారు మున్సిపాల్టీల్లో రిక్షా కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా, వీరు రోజూ మాదిరిగానే గురువారం ఉదయం పనులకు వెళ్ళిపోయారు. 9.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ ఒక గుడిసెకు నిప్పంటుకుని మంటలు అన్ని గుడిసెలకు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు తేరుకుని ఫైరింజన్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు 15 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఫైరింజన్లు, మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలను ఆర్పివేశారు. గుడిసెలు తగలబడిన సమయంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటల్లో రామాంజనేయులుకు అప్పు తీర్చేందుకు తెచ్చిన రనూ.1.30 లక్షల నగదు కాలిపోయింది. ప్రమాదంలో మొత్తంగా రూ.7లక్షల మేర ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. గుడిసెలు కాలిపోయిన విషయం తెలుసుకుని బాధితులను పరామర్శించడానికి ఎంపి సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, కార్పొరేటర్ సుమలత తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని నేతలు హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా ఎమ్మెల్యే రూ.1000, కార్పొరేటర్ రూ.500ను అందజేశారు.
అగ్ని ప్రమాదంలో గుడిసెలు దగ్ధం
english title:
gh
Date:
Friday, February 10, 2012