ఖైరతాబాద్, ఫిబ్రవరి 9: బిసిలను రాజకీయంగా అణగదొక్కేందుకే మంత్రి మోపిదేవి వెంకటరమణపై అగ్రవర్ణాల ఆధ్వర్యంలోకొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని బిసి సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్‌ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి ముఖ్య అతిధులుగా ఆర్.కృష్ణయ్య, బి.సి.యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు రామకృష్ణయ్య, నారుూబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు సుబ్రమాణ్యం హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మోపిదేవిపై లేనిపోని కేసులు బనాయించాలని చూస్తోందన్నారు. ఎటువంటి మచ్చలేని నాయకునిపై ఇలాంటి అభియోగాలు మోపితే యావత్ బిసి సంఘాలు ఐకమై నిరసన కార్యక్రమాలను చేస్తాయని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖకే వనే్న తెచ్చిన మోపిదేవిపై ఎసిబి చార్జిషీటు ద్వారా ఆరోపణలు చేయించడం ముమ్మాటికీ ఆగ్రకుల దుర అహంకారమేనని అన్నారు. తన ప్రభుత్వంలో మంత్రి కొనసాగుతున్న ఓ మంత్రి పై తన ఆధీనంలో కొనసాగుతున్న ఏసీబీతో దాడులు చేయించి వాటి విషయాలను మీడియాకు లీక్ చేయించడంలో కిరణ్‌కుమార్ రెడ్డి ఉద్దేశం ఏమిటో అర్ధం చేసుకోవచ్చునని వారు విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 90 శాతం మద్యం సిండికేట్లు ఆగ్రకులాల వారే నిర్వహిస్తున్నారని వారిని కట్టడి చేసేందుకు శ్రమిస్తున్న మంత్రిపై దాడులు చేయించి వారిని కాపాడాలని సిఎం చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 85 శాతం ఉన్న బిసిలు కట్టే పన్నులతో ఇన్నాళ్ళు కేవలం రెండు సామాజిక వర్గాలే రాష్ట్రాన్ని పాలిస్తూ వస్తున్నాయని, పాలకులుగా బిసిలు పనికి రారు అని చెప్పే ప్రయత్నమే మోపిదేవి వెంకటరమణపై జరుగుతున్న ఏసిబి దాడులని, బిసిలకు అవినీతి తెలిసి ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రులు అయ్యేవారని అన్నారు. ఇది యావత్ బిసిల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు. బిసిలకు రాజ్యాధికారం సిద్దించినప్పుడే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని దాని కోసం అందరూ శ్రమించాలని కోరారు. ఓ మంత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిగి నిర్ధారణ కాక ముందే చార్జ్‌షీట్‌లో పేరునట్లు మీడియాకు రిలీజ్ చేయడం ఎలా జరిగిందని వారు అన్నారు. ఇలాంటి విధానాలను మార్చుకోక పోతే బిసిలు కిరణ్ ప్రభుత్వానికి సరైన బుద్ది చెబుతారని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్, పల్లంరాజులతో పాటు పలువురు బిసి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బిసిలను రాజకీయంగా అణగదొక్కేందుకే మోపిదేవిపై వేధింపులు f
english title:
ff
Date:
Friday, February 10, 2012