మహేశ్వరం, ఫిబ్రవరి 9: చారిత్రత్మకంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శిథిలావస్థలోవున్న శివాలయాలను పునరుద్ధరించి భక్తుల కోర్కెలు తీర్చడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని మాజీ హోంశాఖ మంత్రి టి.దేవేందర్‌గౌడ్ తెలిపారు. గురువారం మహేశ్వరంలోని శివగంగ ప్రాంగణంలో కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఏకాంబరేశ్వరస్వామి శివలింగ ప్రతిష్ఠ చేశారు. అమరావతీశ్వరస్వామి ఆలయంలో రియల్ ఎస్టేట్ అధినేత మామిళ్ల శ్రీనివాస్ దంపతులు లింగ ప్రతిష్ఠ చేశారు. విగ్రహ ప్రతిష్ట, పూర్ణాహుతి బలిహారణ పూజల అనంతరం భక్తులనుద్దేశించి దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ కాకతీయుల నాటి చరిత్ర కలిగిన గోల్కొండ నవాబుల కాలంలో అక్కన్న మాదన్నలచే ప్రత్యేక పూజలందుకున్న శివగంగ రాజరాజేశ్వరాలయ ప్రాంగణంలో 16 శివాలయాలు జీర్ణావస్థకు చేరుకున్నందున వాటిని తిరిగి పునరుద్ధరించవలసి ఉందని ఈ విషయంలో తాను ప్రత్యేక చొరవ తీసుకుని సహకరిస్తామని తెలిపారు. మన ధర్మాన్ని, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార్య వ్యవహారాలకు నిదర్శనంగా నిలిచిన ప్రాచీన దేవాలయాలను కాపాడి నూతన వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. శక్తి స్వరూపుడు కుబౌరాధిపతి అయిన ఏకాంబరేశ్వరస్వామి ఆలయాన్ని తమ కుటుంబ సభ్యులు స్వంత నిధులతో పునరుద్ధరించి శివలింగ ప్రతిష్ట చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఏకాంబరేశ్వరస్వామి, అమరావతీశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో మాజీ నగర మేయర్ తీగల కృష్ణారెడ్డి, జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, మండల టిడిపి అధ్యక్షుడు యాదయ్య, దేవస్థాన కమిటీ చైర్మన్ నవీన్, నాయకులు దీప్‌లాల్ చౌహన్, మనోహార్, డి.శ్రీనివాస్డ్, జి.చంద్రశేఖర్ రెడ్డి, రాంరెడ్డి, ఆంజనేయులుగౌడ్, హీరాలాల్, మద్ది కరుణాకర్‌రెడ్డి, బాలరాజ్, లతీఫ్‌ఖాన్, కృష్ణ, దేవస్థాన కమిటీ నిర్వాహకులు ఎం.శివమూర్తి, టి.నాగేశ్వర సుదర్శన్, ప్రకాష్, ఎ.బిక్షపతి, జి.యాదయ్య, వేద పండితులు, పూజారులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
శిథిలావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్ధరణకు ప్రత్యేక చొరవ
english title:
fg
Date:
Friday, February 10, 2012