కోల్‌కతా, ఫిబ్రవరి 22: త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొన్న డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ శుక్రవారం అస్సాంను ఏడు వికెట్ల తేడాతో చిత్తుచేసి, ఈస్ట్‌జోన్ నుంచి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అస్సాం 33.3 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బెంగాల్ తన లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. మనోజ్ తివారీ అజేయంగా 61 పరుగులు చేసి బెంగాల్‌ను విజయపథంలో నడిపించాడు.
జార్ఖండ్ చిత్తు
ఒడిషాతో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ 235 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. పరేష్ పటేల్ (126), అరబింద్ సింగ్ (132) సెంచరీలు చేయడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఒడిషా నాలుగు వికెట్లకు 353 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్ 118 పరుగులకే కుప్పకూలింది.
ఎఐటిఎ కమిటీ సమావేశానికి
రెబెల్ ఆటగాళ్ల గైర్హాజరు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఆటగాళ్లతో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) నియమించిన త్రిసభ్య కమిటీ శుక్రవారం సమావేశమై, పలు అంశాలను చర్చించింది. అయితే, ముందుగా హెచ్చరించిన విధంగానే రెబెల్ ఆటగాళ్లు ఎవరూ కమిటీ ముందు హాజరు కాలేదు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఆందోళన బాట పట్టిన 11 మంది ఆటగాళ్లు, ఎఐటిఎ అధికారుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ వర్మ నేతృత్వంలో, మాజీ ఆటగాడు నరేష్ కుమార్, ఎంసి గుప్తా సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ ప్రయత్నాలు ఆరంభించింది. శుక్రవారం జరిగిన తొలి సమావేశంలో, ఆటగాళ్లు, ఎఐటిఎ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇతర చర్చలవివరాలను సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. మార్చి 16న న్యూఢిల్లీలో రెండోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
సోమ్‌దేవ్, యుకీ సుముఖం!
ఇండోనేషియాతో జరిగే డేవిస్ కప్ ఆసియా/ఓషియానా గ్రూప్-1 పోటీల్లో పాల్గొనేందుకు రెబెల్ ఆటగాళ్లలో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యుకీ భంబ్రీ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఎఐటిఎ అధికారులతో జరిపిన చర్చల్లో కొంత వరకు పురోగతి కనిపించిందని, ఈ కారణంగానే యుకీతో కలిసి అతను మళ్లీ జాతీయ జట్టులోకి వస్తాడని తెలుస్తోంది.