నెల్లూరు, ఫిబ్రవరి 22: నెల్లూరులో ఆరు రోజులపాటు నిర్వహించిన 41వ జాతీయ మహిళా సీనియర్ హ్యాండ్‌బాల్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. శుక్రవారం సాయంత్రం హర్యానా, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. చివరకు ఢిల్లీ జట్టు హర్యానాపై 29-24 పాయింట్ల తేడాతో విజయం సాధించి చాంపియన్‌షిప్ కైవసం చేసుకుంది. హర్యానా జట్టు రన్నరప్‌గా నిలిచింది. అంతకుముందు హర్యానా జట్టు రైల్వే జట్టుపై, ఢిల్లీ జట్టు పంజాబ్ జట్టుపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. స్థానిక విఆర్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ పోటీలకు గత ఆరు రోజులుగా క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడం విశేషం. ప్రేక్షకులను పోటీ లు ఆకట్టుకున్నాయ.
హైదరాబాద్‌లోనే రెండో టెస్టు: బిసిసిఐ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా-్భరత్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మార్చి 2వ తేదీ నుంచి ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లోనే జరుగుతుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) స్పష్టం చేసింది. గురువారం దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో జరిగిన రెండు బాంబు పేలుళ్ల సంఘటన కారణంగా, ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండో టెస్టు మరో కేంద్రానికి మారుస్తారని వ్యక్తమైన అనుమానాలను బోర్డు సీనియర్ అధికారి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చీఫ్ రాజీవ్ శుక్లా తోసిపుచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటగాళ్ల భద్రతపై స్పష్టమైన హామీ ఇచ్చిందని శుక్రవారం విలేఖరుల సమావేశంలో శుక్లా ప్రకటించాడు. బాంబు పేలుళ్ల సంఘటన జరిగిన వెంటనే బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌తోపాటు, కేంద్ర హోం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పలువురు అధికారులతో తాను మాట్లాడానని చెప్పాడు. ఈ సంఘటనతో క్రికెట్ మ్యాచ్‌లను ముడిపెట్టవద్దని, భద్రతాపరమైన సమస్యలు ఏవీ ఉత్పన్నం కావని వారంతా స్పష్టం చేశారని శుక్లా తెలిపాడు. అన్ని కోణాల నుంచి పరిస్థితిని సమీక్షించి, అందరితో చర్చించిన తర్వాత హైదరాబాద్‌లోనే మ్యాచ్‌ని నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించిందని అన్నాడు. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులతోనూ చర్చించానని శుక్లా పేర్కొన్నాడు.
భద్రతపై అనుమానాల్లేవు..
చెన్నై: హైదరాబాద్‌లో తమ ఆటగాళ్ల భద్రతపై ఎలాంటి అనుమానాలు లేవని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి జేమ్స్ సదర్లాండ్ వ్యాఖ్యానించాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్‌కి హాజరైన అతను హైదరాబాద్ బాంబు పేలుళ్ల సంఘటనపై స్పందిస్తూ, ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉంటుందని తాను భావించడం లేదని అన్నాడు. సిఎ ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత పరిస్థితులను సమీక్షించుకుంటామని తెలిపాడు. ప్రస్తుతం తమ దృష్టి చెన్నై టెస్టుపైనే కేంద్రీకృతమైందని, హైదరాబాద్ టెస్టు వేదికను మార్చాలని తాము కోరడం లేదని స్పష్టం చేశాడు. సిఎ అత్యున్నతాధికారులుగానీ, ఆసీస్ ప్రభుత్వంగానీ ఏవైనా ఆదేశాలు జారీ చేస్తే తాను ఏమీ చెప్పలేనని, ప్రస్తుతానికి తాము హైదరాబాద్‌లోనే టెస్టు మ్యాచ్ జరుగుతుందని నమ్ముతున్నామని సదర్లాండ్ తెలిపాడు. అయతే, ఉన్నతాధికారుల ఆదేశాల కోసం తాము ఎదురు చూస్తామని అన్నాడు.
ఆటపైనే దృష్టి..
హైదరాబాద్ సంఘటనపై స్పందించడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ నిరాకరించాడు. ఈ అంశంపై జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని అన్నాడు. ప్రస్తుతం తామంతా ఆటపైనే దృష్టి పెట్టామని పేర్కొన్నాడు. హైదరాబాద్ సంఘటన బాధితులకు ఆస్ట్రేలియా క్రికెటర్ల తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నానని తెలిపాడు.