చెన్నై, ఫిబ్రవరి 22: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట హోరాహోరీగా కొనసాగింది. ఒకవైపు భారత బౌలర్ల ఆధిపత్యం, మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ విజృంభణ సమతూకంలో కొనసాగి, ప్రేక్షకులను అలరించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు ఎడ్ కోవన్, డేవిడ్ వార్నర్ చక్కటి ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. పేసర్లు ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ బంతులను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే, స్పిన్ బౌలింగ్‌లో తడబడడంతో, 64 పరుగుల స్కోరువద్ద ఆసీస్ మొదటి వికెట్‌ను కోవన్ (29) రూపంలో కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన కోవన్‌ను వికెట్‌కీపర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్టంప్ చేశాడు. అప్పటి నుంచి అశ్విన్ విశ్వరూపానే్న చూపాడు. ఫిల్ హ్యూజెస్ కేవలం ఆరు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 93 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లతో 59 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను కూడా అశ్విన్ ఎల్‌బిగా పెవిలియన్‌కు పంపాడు. షేన్ వాట్సన్ (28), మాథ్యూ వేడ్ (12) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా, జట్టును ఆదుకునే బాధ్యతను క్లార్క్, మోజెస్ హెన్రిక్స్ స్వీకరించారు. భోజన విరామం తర్వాత వీరి భాగస్వామ్యానికి అశ్విన్ తెరదించాడు. క్లార్క్‌తో కలిసి ఆరో వికెట్‌కు 147 పరుగులు జోడించిన హెన్రిక్స్ 132 బంతులు ఎదుర్కొని, 5 ఫోర్లతో 68 పరుగులు చేసి, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. అంతకు ముందు క్లార్క్ 39 పరుగుల వద్ద ఉన్నప్పుడు అశ్విన్ బౌలింగ్‌లో బంతి అతని బ్యాట్‌కు తగిలి, ఫార్వర్డ్ షార్ట్‌లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న చటేశ్వర్ పుజారా చేతుల్లోకి వెళ్లింది. బ్యాట్ అండ్ ప్యాడ్‌గా అనుమానించిన అంపైర్ కుమార ధర్మసేన భారత ఫీల్డర్ల అప్పీల్‌ను తిరస్కరించాడు. కానీ, రీప్లేలో బంతి బ్యాట్‌కు తగిలినట్టు తేలింది. ఈ పొరపాటు నిర్ణయం అశ్విన్‌కు మరో వికెట్ రాకుండా అడ్డుకుంటే, దీనిని సద్వినియోగం చేసుకున్న క్లార్క్ అజేయ సెంచరీతో కదం తొక్కాడు. కాగా, స్టార్క్ మూడు పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి, 169 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 103 పరుగులతో కెరీర్‌లో 23వ టెస్టు సెంచరీ సాధించిన క్లార్క్‌తోపాటు పీటర్ సిడిల్ (18 బంతుల్లో ఒక పరుగు) క్రీజ్‌లో ఉన్నాడు. అశ్విన్ ఆరోసారి ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఘనతను అందుకున్నాడు. అతను 30 ఓవర్లు బౌల్ చేసి 88 పరుగులకు ఆరు వికెట్లు కూల్చాడు. జడేజాకు ఒక వికెట్ లభించింది.
నిరాశపరచిన భజ్జీ
కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌ని ఆడే అవకాశాన్ని దొరికిపుచ్చుకున్న సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తొలిరోజు అభిమానులను నిరాశ పరిచాడు. ఆస్ట్రేలియాపై అద్భుత రికార్డు ఉన్న అతు 19 ఓవర్లు బౌల్ చేసి, ఏకంగా 71 పరుగులు సమర్పించుకున్నాడు. స్పిన్నర్లు అశ్విన్, జడేజా వికెట్లను పంచుకోగా, జట్టులోని సీనియర్ ఆటగాళ్లలో ఒకడైన భజ్జీ ఒక్క వికెట్‌ను కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం.
సంక్షిప్తంగా స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 95 ఓవర్లలో 7 వికెట్లకు 316 (వార్నర్ 59, క్లార్క్ నాటౌట్ 103, హెన్రిక్స్ 68, అశ్విన్ 6/88).
అజేయ సెంచరీతో ఆసీస్‌ను ఆదుకున్న క్లార్క్ మొదటి టెస్టు తొలి రోజున హోరాహోరీ పోరు
english title:
a
Date:
Saturday, February 23, 2013