విశాఖపట్నం, ఫిబ్రవరి 24: విశాఖలో ఆధార్ కార్డుల జారీ ఒక ప్రహసనంగా మారింది. ఆధార్ కార్డు కోసం జనం శనివారం అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లలో నిలబడ్డారు. ఆదివారం మధ్యాహ్నానికి ఈ క్యూలైన్ కిలో మీటరు దాటిపోయింది. రద్దీగా ఉన్న ప్రాంతంలో, మండుటెండలో జనం ఆపసోపాలు పడుతూ, బారులు తీరారు. అధికారుల మధ్య సమన్వయ లోపం, నిర్వాహకుల మధ్య విభేదాలు ప్రజల పాలిట శాపంగా మారాయి. 22 లక్షల విశాఖ జనాభాకు కేవలం రెండు సెంటర్లను పెట్టి అధికారులు చేతులు దులుపుకొన్నారు. దీని గురించి ఏ అధికారిని అడిగినా, అది తమ పరిధిలో లేదని, తమకేమీ తెలియదని తప్పుకు తిరుగుతున్నారు. చంటి పిల్లలతో జనం పడే అవస్థలను అధికారులు ఎప్పుడు అర్థం చేసుకుంటారోనని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆదివారం భారీగా జనం తరలి రావడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా, ఆర్డీఓ, సివిల్ సప్లైస్ అధికారులను పంపించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే నగరంలో 15 ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆధార్ కార్డుల కోసం బారులు తీరిన జనం