దాచేపల్లి, పిబ్రవరి 24: ప్రజాభిమానాన్ని పొందిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి ప్రజాసంక్షేమ రాజ్య స్థాపన ఆయన తనయుడు జగన్ వల్లనే సాధ్యమవుతుందని వైఎస్‌ఆర్ సిపి నాయకురాలు షర్మిల అన్నారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా ఆదివారం మండలంలోని నారాయణపురంలో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. రాజశేఖరరెడ్డి పరిపాలనలో అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని చెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని చెప్పారు. రైతులకు పంటలు పండక అప్పుల పాలయ్యారని చెప్పారు. తిరిగి రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొని వుందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాల వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రస్తుతం రైతులు కిడ్నీలు అమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నారని వివరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తిరిగి రైతుల ఆత్మహత్యలు పునరావృతవౌతాయన్నారు. చందబాబు పాదయాత్రలు చేస్తూ బూటకపు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. అయితే చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరన్నారు. జగన్ మీద కేసులు ఆయనను ఏమీ చేయలేవన్నారు. జగన్ త్వరలోనే జైలు నుండి బయటకు వచ్చి మీ అభిమానంతో ముఖ్యమంత్రి అయ్యి రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. షర్మిల తొలుత నారాయణపురంలో మహిళలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఆమె వెంట వైఎస్‌ఆర్ సిపి కేంద్ర కమిటీ సభ్యుడులు జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
‘మరో ప్రజాప్రస్థానం’లో షర్మిల
english title:
j
Date:
Monday, February 25, 2013