విశాఖపట్నం/ కశింకోట, ఫిబ్రవరి 24: విశాఖ జిల్లా కశింకోటలో ఆదివారం తెల్లవారుజామున ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ గ్రామంలో జరిగిన గౌరీపరమేశ్వర్ల మహోత్సవంలో తలెత్తిన వివాదం ఈ హత్యకు దారి తీసింది. ఈ గొడవలో గొలగాని మహేష్(30) అనే యువకుడు కత్తిపోట్లకు గురై మరణించాడు. దీంతో కశింకోట పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హతుని వర్గానికి చెందిన వారు ప్రత్యర్థుల ఆస్తులపై దాడులకు తెగబడ్డారు. అంతేకాకుండా గంటల తరబడి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. జనం భయంతో పరుగులు తీశారు. వెంటనే పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చింది. స్థానికుల కథనం మేరకు వివరాలివి. శనివారం కశింకోటలో గౌరీపరమేశ్వర మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి, అది ఘర్షణకు దారి తీసింది.
అనకాపల్లి గవరపాలెంకు చెందిన కర్రి రాజేష్, మహేష్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో రాజేష్ తీవ్రంగా గాయపడడంతో అతనిని పోలీసులు చికిత్స నిమిత్తం అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన రాజేష్‌ను పోలీసులు ఆసుపత్రిలోనే వదిలేశారన్న కథనం ఒకటైతే, ఆయన పోలీసుల కళ్ళు కప్పి పరారైనట్టు మరో కథనం వినిపిస్తోంది. ఇది జరిగిన కొద్ది గంటలకు అంటే ఆదివారం తెల్లవారుజాము సుమారు నాలుగు గంటలు ప్రాంతంలో మహేష్ కత్తిపోట్లకు గురయ్యాడు. రక్తమడుగుల్లో ఉన్న మహేష్‌ను అనకాపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో మహేష్ మద్దతుదారులు పట్టణంలో ఒక వర్గానికి చెందిన పలు వాహనాలను ధ్వంసం చేయడమే కాకుండా ఉత్సవానికి ఏర్పాటు చేసిన విద్యుత్‌దీపాలను ధ్వంసం చేశారు.
బడ్డీలు, స్టేజ్‌లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మహేష్ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆందోళనకారులు రాస్తారోకో చేశారు. గంటల తరబడి రాస్తారోకో చేయడంతో జాతీయ రహదారిపై ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు అప్రమత్తమై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడు మహేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేష్ మద్దతుదారులు కోపానికి గురై వాహనాలను ధ్వంసం చేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. జనం భయంతో ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. సంఘటనా స్థలానికి ఎస్పీ శ్రీనివాస్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ కశింకోటలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 11 పికెట్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. నిందితుల కోసం ఐదు బృందాలను పంపించామని అన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు.
ఎస్‌ఐ సస్పెన్షన్
ఇదిలా ఉండగా ఆసుపత్రికి తరలించిన రాజేష్ తప్పించుకుని పారిపోవడంతో, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్‌ఐ రవీంద్రను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కిషోర్ విచారణ జరపుతున్నారని, కేసును అనకాపల్లి డిఎస్పీ దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే కశింకోటలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటన రెండు కులాల మధ్య చిచ్చురేపింది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న భయం జనంలో అలముకుంది. అలాగే ఈ రెండు వర్గాల్లో ఒక్కో వర్గానికి ఒక్కో రాజకీయ పార్టీ అండగా నిలబడడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఆందోళనకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు, ఆందోళనకారుల దాడిలో ధ్వంసమైన వైకాపా కార్యాలయం