న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: విద్యుత్ చార్జీలను పెంచినందుకు అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మాత్రం ఈ పెంపును సమర్థించుకుంటూ రోజులో 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండాలనుకుంటే జనం ఈ చార్జీలను చెల్లించక తప్పదని స్పష్టం చేసారు. అంతేకాదు, ఈ చార్జీలను భరించడం కష్టమనుకుంటే జనం వివిధ విద్యుత్ ఉపకరణాలపై ఖర్చు చేస్తున్న విద్యుత్‌ను తగ్గించుకోవాలని కూడా ఆమె సలహా ఇచ్చారు. ‘మేము రోజులో 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రోజంతా విద్యుత్ సరఫరా ఉండేలా చూస్తుంటే ప్రతిపక్షాల వారు విద్యుత్ బిల్లు చాలా ఎక్కువ ఉంటోందని అంటున్నారు. మీరు రోజులో 24 గంటలూ విద్యుత్ వాడుతున్నప్పుడు అయిదు గంటల వినియోగానికి బిల్లు చెల్లించ లేరు కదా. ఒకవేళ విద్యుత్ బిల్లులను భరించలేమని అనుకుంటే వినియోగాన్ని తగ్గించుకోండి. ఢిల్లీలో కూడా రోజుకు ఏడెనిమిది గంటలు విద్యుత్ కోతలు ఉండేవనే విషయం భావి తరాల వారికి ఎప్పటికీ తెలియకుండా ఉంటుంది’ అని షీలా దీక్షిత్ ఆదివారం దక్షిణ ఢిల్లీలోని ఛతర్‌పూర్‌లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ అన్నారు. విద్యుత్ చార్జీల పెంపును ఆమె సమర్థించుకుంటూ, విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగినందువల్లనే చార్జీలను పెంచాల్సి వచ్చిందన్నారు. ఎవరైనా బిల్లు చెల్లించడం కష్టమనుకుంటూ కూలర్‌కు బదులుగా ఫ్యాన్ వాడండి. బిల్లు తగ్గాలంటే విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవలసిందేనని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి డిస్కామ్‌లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఈ విద్యుత్ పంపిణీ కంపెనీల్లో జరుగుతున్న అవినీతిని పట్టించుకోవడం లేదని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు విజయ్ గోయల్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ స్పందిస్తూ ముఖ్యమంత్రి నుంచి ఇలాంటి ప్రకటన రావడం దుదృష్టకరమన్నారు. ఢిల్లీలో విద్యుత్ చార్జీలు పెరగడానికి ఉత్పత్తి వ్యయం పెరగడం కారణం కాదన్నారు. నిత్యావసరాలుగా మారిన టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ లాంటిని వాడకుండా ఎలా ఉంటారు? అని ప్రశ్నించారు. విద్యుత్ కంపెనీలతో కుమ్మక్కయి అవినీతికి పాల్పడ్డం కారణంగానే చార్జీలను పెంచారని ఆరోపించారు. అవినీతిని అదుపు స్తే చార్జీలు సగం తగ్గుతాయని అన్నారు. ఢిల్లీలో విద్యుత్ చార్జీలు గత మూడేళ్లుగా వరసగా పెంచారు. చివరగా ఈ నెల 1వ తేదీనుంచి చార్జీలు పెంచారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత అయిదేళ్లుగా నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడని గృహ వినియోగదారులకు యూనిట్‌కు రూపాయి మేర సబ్సిడీ ఇస్తోంది.
బిల్లు కట్టలేకపోతే కరంటు వాడకం తగ్గించుకోండి పెంపును సమర్థించుకున్న ఢిల్లీ సిఎం షీలాదీక్షిత్ షీలా వ్యాఖ్యలపై మండిపడ్డ బిజెపి, ఆమ్ ఆద్మీ
english title:
u
Date:
Monday, February 25, 2013