వాటికన్ సిటీ, ఫిబ్రవరి 24: కేథలిక్కులకు పవిత్రమైన ఆదివారం ప్రార్థనలు... అందులోనూ పదవీ విరమణ పొందనున్న పోప్ బెనడిక్ట్ చిట్టచివరి ప్రసంగం... వెరసి వాటికన్‌లోని పీటర్స్ స్క్వేర్ ఆదివారం కిటకిటలాడింది. ప్రార్థనల అనంతరం అపోస్టోలిక్ ప్యాలెస్‌లోని కిటికీనుంచి పోప్ బెనడిక్ట్ చేసిన ఉద్వేగభరిత ప్రసంగానికి కేథలిక్కులు విశేషంగా స్పందించారు. చప్పట్లతో, నినాదాలతో పీటర్స్ స్క్వేర్ హోరెత్తింది. ‘దేవుడు నన్ను విశ్రాంతి తీసుకోమన్నాడు’ అంటూ 85 ఏళ్ల పోప్ తన చిట్టచివరి ప్రసంగాన్ని ప్రారంభించారు. వేలాదిమంది సమక్షంలో సాగిన పోప్ అలిఖిత ప్రసంగం ఆద్యంతం ఉద్వేగంతో కొనసాగింది. ప్రార్థనలకి పూర్తిస్థాయిలో అంకితమవ్వాలని దేవుడు ఆదేశించాడనీ, అలాగని చర్చికి దూరం కావడం లేదని తన మద్దతుదారులకు పోప్ హామీ ఇచ్చారు. నిరంతర ప్రార్థనలకు తన జీవితాన్ని అంకితం చేయాలని, ఒక మహా పర్వతాన్ని అధిరోహించాలని దేవుడు తనకు పిలుపునిచ్చాడని పేర్కొన్నారు. ఇప్పటివరకూ నేను చూపిన అంకితభావాన్నీ, ప్రేమనూ ప్రస్తుతం దేవుడు అప్పగించిన బాధ్యతల్లోనూ ప్రదర్శిస్తానన్నారు. నా వయసుకీ, నా శక్తికి తగిన విధంగా నెరవేరుస్తానన్నారు. ‘ఎల్లప్పుడూ మనం దగ్గరగానే ఉంటాం’ అంటూ భరోసా ఇచ్చిన పోప్, తన ప్రసంగాన్ని వినేందుకు వచ్చినవారికి ధన్యవాదాలు తెలియజేశారు.
పోప్ బెనడిక్ట్ అధికారికంగా గురువారం పదవీ విరమణ చేయనున్నారు. కాగా, పోప్ చివరిసారిగా ప్రసంగిస్తుండటంతో ఆదివారం లక్షకు పైగా ప్రజలు హాజరయ్యారని వాటికన్, రోమ్ పోలీసులు అంచనా వేశారు.
పోప్ బెనడిక్ట్ చిట్టచివరి ప్రసంగం