న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: సభ్య సమాజం తలదించుకునే విధంగా ఢిల్లీలో గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ రాత్రి వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఇప్పటికీ ఒళ్లు జలదరింపజేస్తోంది. ఈ దారుణాన్ని, అలాగే సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, నేరాలు తదితర సమస్యలపై రాజధానిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 500 మంది చిత్రకారులు తమ కుంచెలతో ఆదివారం వినూత్న రీతిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం వీరంతా ఢిల్లీ యూనివర్శిటీ ఉత్తర క్యాంపస్‌లో కిలోమీటర్ పొడవు గల గోడను కాన్వాస్‌గా మలుచుకున్నారు. దేశంలో, ముఖ్యంగా రాజధానిలో మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న లైంగిక నేరాలు, ఇతర సామాజిక సమస్యలపై వీరు కుంచెలనే అస్త్రాలుగా సంధించారు. సామాజిక రుగ్మతలపై తమ ఆవేదనకు దృశ్యరూపమిచ్చి గుండెలు పిండే హృద్యమైన చిత్రాలతో అందరినీ ఆలోచింపజేశారు. ‘మార్పునకు రూపకల్పన చేద్దాం’ (డిజైన్ ది చేంజ్) అనే ఉమ్మడి సందేశంతో ‘్ఢల్లీ వాల్‌బఉక్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టాటా హౌసింగ్ అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ‘విజువలైజ్ ముంబయి’ అనే పేరుతో గత ఏడాది ముంబయిలో కూడా ఇదే విధమైన ఈవెంట్‌ను నిర్వహించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రజలంతా ఆన్‌లైన్‌లో పరుగులుతీస్తూ గ్రాఫిక్ చిత్రాలతో హోరెత్తిస్తున్నప్పటికీ కుంచెలు, రంగులతో జీవం పోసుకున్న చిత్రాల ప్రత్యేకతే వేరని, అందుకే రాజధానిలోని చిత్రకారులందరినీ ఒకచోటికి తీసుకువచ్చి సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలను ఎలుగెత్తి చాటాలన్న ఆలోచన కలిగిందని బ్రాండ్ ఇండియా ప్రమోషన్స్ సంస్థ అధికారి స్వప్న మీనన్ తెలిపారు.
సభ్య సమాజం తలదించుకునే విధంగా ఢిల్లీలో
english title:
g
Date:
Monday, February 25, 2013