న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఇటీవల జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ‘హిందూ ఉగ్రవాదం’ వ్యాఖ్యలు దుమారం రేపడం, అనంతరం ఆ వ్యాఖ్యలు ఉపహరించుకోవడంతో ఆ గొడవ చల్లారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో షిండే క్షమాపణలు చెప్పలేదని, విచారం మాత్రమే వ్యక్తం చేశారని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో ఈ వివాదం మళ్లీ మొదటికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిఎన్‌ఎన్-ఐబిఎన్ నిర్వహించిన ‘డెవిల్స్ అడ్వకేట్’ కార్యక్రమంలో కరన్ థాపర్ అడిగిన ప్రశ్నకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ సమాధానమిస్తూ ‘షిండే క్షమాపణ మాత్రమే చెప్పారు. నేను ఆ వ్యాఖ్యలు మార్చలేను’ అన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను అని మాత్రమే చెప్పారని వివరించారు. షిండే చేసిన వ్యాఖ్యలనే గతంలో చిదంబరం కూడా చేశారని, అయితే బిజెపి అనే పదం వాడలేదని అన్నారు. బిజెపి నేతలను సంతృప్తిపరచేందుకు, ఆ విషయాన్ని అంతటితో ముగించేందుకు షిండే విచారం వ్యక్తం చేయడం, అందుకు బిజెపి సైతం సంతృప్తి చెందిన విషయం తెలిసిందేనని పేర్కొన్నారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు
భారీగా పెట్టుబడులు!
పెరిగిన అనుమానాస్పద లావాదేవీలు
తాజా నివేదికలో ఎఫ్‌ఐయు వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశంలో గత ఏడాది వివిధ ఆర్థిక మార్గాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పెట్టుబడులు సమకూర్చిన 1,400పైగా ఉదంతాలను నిఘా, భద్రతా సంస్థలు గుర్తించాయని, అలాగే అనుమానాస్పద లావాదేవీలు గణనీయంగా 300 శాతం మేరకు పెరిగాయని ఆర్థిక శాఖ తన తాజా నివేదికలో వెల్లడించింది. తీవ్రవాద పెట్టుబడులకు సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా), ఆదాయ పన్ను, కస్టమ్స్ విభాగాల నుంచి 2010-11 మధ్య కాలంలో 428 నివేదికలు అందగా, 2011-12 మధ్యకాలంలో ఇవి 1,444కు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆర్థిక నిఘా విభాగం (ఎఫ్‌ఐయు) ఈ నివేదికలో పేర్కొంది. తీవ్రవాద పెట్టుబడుల విషయమై దేశంలోని నిఘా, భద్రతా సంస్థలు కోరిన సమాచారాన్ని అందజేయడం ద్వారా ఆ సంస్థలకు ఎఫ్‌ఐయు తనవంతు సహకారాలను అందజేస్తోంది. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని విశే్లషించి దానిని నిఘా సంస్థలకు, భద్రతా సంస్థలకు, మనీ లాండరింగ్ నిరోధక సంస్థలకు, ఇతర ఆర్థిక నిఘా సంస్థలకు అందజేయడమే విధిగా ఎఫ్‌ఐయు పనిచేస్తోంది.
యాసిడ్ దాడి బాధితురాలి మృతి
గత పదిహేను రోజుల్లో రెండో మరణం
చెన్నై, ఫిబ్రవరి 24: గత నెలలో ఇక్కడ యాసిడ్ దాడికి గురైన 20 ఏళ్ల యువతి ఆదివారం మృతి చెందింది. తీవ్రగాయాల పాలైన ఆమె 25 రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ఆదివారం ఉదయం ప్రభుత్వాసుపత్రిలో కన్నుమూసింది. ఈ మరణం గత పదిహేను రోజుల వ్యవధిలో యాసిడ్ దాడి కారణంగా సంభవించిన రెండోది కావడం గమనార్హం. ఓ ఇంటర్నెట్ బ్రౌజింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న యువతిపై గత నెలలో విజయ భాస్కర్ అనే వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతన్ని జైలుకు తరలించారు. ఇదిలావుంటే మృతురాలి సోదరుడు విజయ్ మాట్లాడుతూ తన సోదరితో పెళ్లికి నిందితుడు కుటుంబం అంగీకరించినప్పటికీ, మాలో అనుమానం ఉండేదని వ్యాఖ్యానించడం ఈ కేసులో కొత్త అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న 23 ఏళ్ల బిటెక్ విద్యార్థినిపైనా యాసిడ్ దాడి జరగగా, తీవ్ర గాయాలపాలైన ఆమె ఫిబ్రవరి 12న ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. నవంబర్ 14న కరైకల్ బస్ స్టేషన్ వద్ద ఓ నిర్మాణ రంగ కార్మికుడు సదరు విద్యార్థినిపై యాసిడ్ పోశాడు.
రూ.15కోట్ల మత్తు పదార్థాలతో
పట్టుబడ్డ మణిపూర్ ఆర్మీ కల్నల్
ఇంఫాల్, ఫిబ్రవరి 24: విదేశాలకు మత్తు పదార్థాలను తరలిస్తున్న రక్షణ రంగానికి చెందిన కల్నల్ హోదా అధికారి సహా మొత్తం ఆరుగురిని మణిపూర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.15 కోట్ల విలువైన స్యూడోఎఫిడ్రిన్ అనే మత్తుపదార్థాన్ని మయన్మార్‌కు రవాణా చేస్తుండగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. రక్షణ శాఖలో పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న అజయ్ చౌదరి వద్ద పనిచేస్తున్న సరిహద్దు భద్రతా దళ సైనికుడు కూడా అరెస్టయిన వారిలో ఉన్నాడు. మయన్మార్‌లో స్యూడోఎఫిడ్రిన్‌ను విస్తృత డిమాండ్ ఉంది. టాబ్లెట్ల రూపంలో స్యూడోఎఫిడ్రిన్‌ను తరలిస్తున్న మూడు వాహనాలు సరిహద్దు పట్టణమైన మోరె వెళ్తుండగా పల్లెల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. కేసు పరిశోధనలో ఉందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
65వ పడిలో అడుగిడిన జయలలిత
చెన్నై, ఫిబ్రవరి 24: ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం 65వ యేట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆదివారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాలు (తమిళనాడు-39, పాండిచేరి-1) కైవసం చేసుకుని సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ లక్ష్య సాధనకు ఈ రోజునుంచే ఉపక్రమించాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. జయలలిత జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు బట్టలను, ఆహార పదార్థాలను పంచడం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో 65 కిలోల కేకును కోసి ప్రజలకు పంచిపెట్టారు. తన 65వ పుట్టినరోజును పురస్కరించుకుని జయలలిత ఇటీవల 65లక్షల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు.